చెప్పులు కుడతారా..

జనకుడు ఏర్పాటు చేసిన పండిత సభకు అష్టావక్ర మహారుషి విచ్చేశాడు. ఆయన ఆకారాన్ని చూసి అక్కడి పండితులు నవ్వారు. అందుకాయన నొచ్చుకోకుండా తానూ నవ్వాడు.

Published : 06 Jun 2024 00:12 IST

నకుడు ఏర్పాటు చేసిన పండిత సభకు అష్టావక్ర మహారుషి విచ్చేశాడు. ఆయన ఆకారాన్ని చూసి అక్కడి పండితులు నవ్వారు. అందుకాయన నొచ్చుకోకుండా తానూ నవ్వాడు. ఇదంతా చూస్తున్న జనకమహారాజు విస్తుపోయి- ‘మహాత్మా! వాళ్లు మీ దేహాన్ని చూసి పరిహసించారని తెలిసి కూడా మీరెందుకు నవ్వారు?’ అనడిగాడు. ‘మహారాజా! మీరీ సమావేశాన్ని పండితగోష్టి అన్నారు కానీ.. వారి ప్రవర్తనా తీరు అలా లేదు’ అన్నాడు. ‘కానీ మహర్షీ! వారంతా ఉద్ధండ పండితులే’ అన్నాడు జనకుడు. అష్టావక్రుడు నవ్వి ‘రాజా! మనలో బాహ్య, అంతర, ఆధ్యాత్మిక- అనే మూడు రకాల దృష్టికోణాలుంటాయి. చెప్పులు కుట్టే వారి దృష్టి తాము కుడుతున్న చర్మం పైనే ఉంటుంది. అంటే వాళ్లది బాహ్య దృష్టి. వీరిదీ అలాగే ఉంది. ఇలాంటి వాళ్లు పైన కనిపించే శరీరాన్నే తప్ప అంతరంగ వైభవాన్ని చూడలేరు. కనుక వారిలో ఆధ్యాత్మిక దృష్టి, భగవత్‌ ధ్యానం కూడా శూన్యం. దేహాన్ని చూసి గేలిచేస్తూ నవ్వుతున్నారంటే.. వారిలో ఇసుమంతైనా పాండిత్యం లేదు. ఆ వైఖరి చూసి పాదరక్షలు చేస్తారు కాబోలు అనుకున్నాను. అందుకే నవ్వొచ్చింది. మనిషి విలువ అతడి విద్వత్తులో ఉంటుంది. ఆత్మ స్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలే తప్ప అశాశ్వతం, రోగాలకు ఆశ్రయం అయిన ఈ శరీరం మీద దృష్టి నిలపడం సరికాదు. దేహాభిమానం ఉన్నవారు ఎన్నటికీ పండితులు అనిపించుకోరు’ అంటూ వివరించాడు.

డా.జయదేవ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు