డోలు చెప్పిన కథ

తండ్రీ కొడుకులైనా సరే ఎవరి దారి వారిదే. వారి వారి కర్మానుసారం జీవితాలు నడుస్తాయి. కర్మకు తగ్గ ఫలాలు ఎవరికి వారు అనుభవించక తప్పదు. బంధాలు, అనుబంధాలను జయించడమే మోక్షం. బంధం ఎంత భయంకరమైందో తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు.

Published : 06 Jun 2024 00:12 IST

తండ్రీ కొడుకులైనా సరే ఎవరి దారి వారిదే. వారి వారి కర్మానుసారం జీవితాలు నడుస్తాయి. కర్మకు తగ్గ ఫలాలు ఎవరికి వారు అనుభవించక తప్పదు. బంధాలు, అనుబంధాలను జయించడమే మోక్షం. బంధం ఎంత భయంకరమైందో తెలుసుకోవడానికి ఈ ఉదాహరణ ఒక్కటి చాలు.

కబీర్‌దాసు చావడి ఎదురుగా కూర్చుని ఎద్దుని గమనిస్తున్న వ్యక్తిని చూశాడు. ‘ఎందుకయ్యా, కాలాన్ని వృథా చేస్తున్నావు? దైవాన్ని ధ్యానించవచ్చు కదా’ అన్నాడు కబీర్‌. ‘అప్పుడే ఏం భక్తి? నా పిల్లలు పసిబిడ్డలు. వాళ్లకి కొంచెం వయసు వచ్చాక అటు దృష్టిపెడతాను’ అన్నాడతడు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్లకి పెళ్లిళ్లూ అయ్యాయి. ఈసారి అతడు ఎదురైనప్పుడు భక్తి, ధ్యానం గురించి గుర్తుచేశాడు కబీర్‌. ‘ఆగండి స్వామీ! మనవలు పుట్టాలి, వాళ్లతో గడపాలి కదా’ అన్నాడు. మూడోసారి కనిపించినప్పుడు మనవల పెళ్లిళ్లు అయ్యేదాకా ఆగాలన్నాడు. ఇంకోసారి అతడు కబీర్‌కు ఎదురవలేదు, ఏకంగా పరలోకం చేరాడు. అతడి మనవడు ఒక ఎద్దును చూపి, ‘ఇదంటే తాతయ్యకు చాలా ఇష్టం’ అన్నాడు. దానితో గల వీడని అనుబంధం ఆ వ్యక్తికి ఎద్దు జన్మను ప్రసాదించింది. పొలం యజమాని ఎద్దుజన్మలో ఉన్న అతడితో పొలం దున్నించాడు, బండి కట్టించాడు. రానురాను ఆ ఎద్దు ముసలిదై సత్తువ కోల్పోయింది. పనికిరాని ఎద్దును మేపడం వృథా ఖర్చు అనుకున్న యజమాని దాన్ని కబేలాకి అమ్మేశాడు. దాని చర్మంతో డోలు తయారయ్యింది. ఆ డోలు వాయించగానే ఓ వింత కథ వినబడేది. ‘ఎద్దునై పొలం దున్నాను. బండి లాగాను.. కబేలా చేరాను. నా మాంసం తినేశారు. డొక్క చీల్చి డోలు కట్టారు. డోలు వాయించిన ప్రతిసారీ దెబ్బలు తింటూనే ఉన్నాను. ఇదీ నా కథ.. కర్మఫలం అనుభవించడమంటే ఇదే!’ అదీ సంగతి. భౌతిక ప్రపంచం ఒక ఆగని ప్రవాహం. గట్టున పెరిగే గడ్డిపోచలు ఆదుకోవు. మనల్ని అనుగ్రహించేది భగవంతుడే. దైవంతోనే శాశ్వత బంధం ఏర్పరచుకోవాలి.

ఉప్పు రాఘవేంద్ర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని