హోరువానలో.. జోరు వద్దు

వర్షాకాలం వచ్చిందంటే రోడ్డుమీద బైక్‌లు ఆగిపోవడం.. కుర్రకారు ప్రమాదాలకు గురవడం తరచూ చూస్తుంటాం. ద్విచక్రవాహనాలపై గాల్లో తేలిపోవడమే కాదు.. ఈ జాగ్రత్తలూ పాటిస్తేనే ఈ సీజన్‌లో సురక్షితంగా ఉంటాం. 

Published : 08 Jun 2024 00:59 IST

యువాహనం

వర్షాకాలం వచ్చిందంటే రోడ్డుమీద బైక్‌లు ఆగిపోవడం.. కుర్రకారు ప్రమాదాలకు గురవడం తరచూ చూస్తుంటాం. ద్విచక్రవాహనాలపై గాల్లో తేలిపోవడమే కాదు.. ఈ జాగ్రత్తలూ పాటిస్తేనే ఈ సీజన్‌లో సురక్షితంగా ఉంటాం. 

  • వానాకాలం మొదలవగానే ముందు పరిశీలించాల్సింది బైక్‌ టైర్లని. అరిగిపోయిన టైర్లను అటకెక్కించాల్సిందే. టైర్ల త్రెడ్‌ బాగుంటేనే రోడ్డుపై పట్టు ఉంటుంది. లేదంటే తడి రోడ్లపై జారిపోతుంటాయి. టైర్ల పక్కలకు పగుళ్లు వచ్చినా.. కోతకు గురైనా.. బుడగల్లా ఉబ్బినా ప్రమాదకరం. వీటిని మార్చాలి, మరమ్మతులైనా చేయాలి.
  • వేగం ఎప్పుడైనా ప్రమాదకరమే.. వానాకాలంలో మరింత ప్రమాదకరం. నీటి ప్రవాహం కారణంగా రోడ్డుపక్కలు కోసుకుపోయి ఉంటాయి. చూసుకోకపోతే స్కిడ్‌ అవుతాం. తడిరోడ్లపై సడెన్‌ బ్రేక్‌ వేయాల్సి వస్తే బండి నియంత్రణలో ఉండదు. రోడ్డుపై నీళ్లు నిలిచినచోట కనిపించని గుంతలు ఉంటాయి. వాట్లోంచి వెళ్తే కిందపడిపోతుంటాం. ఇవన్నీ గమనించి వేగానికి కళ్లెం వేస్తేనే సురక్షితంగా గమ్యం చేరతాం.
  • ఈ కాలంలో ఏ క్షణమైనా వర్షం రావచ్చు. ప్రయాణాలు చేసేవాళ్లు దీనికి సంసిద్ధంగా ఉండాలి. బండి బయటికి తీస్తుంటే తప్పకుండా మాన్‌సూన్‌ గేర్‌ (రెయిన్‌ కోటు, గ్లౌజులు, హెల్మెట్, రెయిన్‌ప్రూఫ్‌ బూట్లు) ఇవన్నీ వెంట ఉండాలి. 
  • బండికి బురద అంటుకోవడం, దుమ్ము పట్టడం ఇప్పుడు ఎక్కువ. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. ముఖ్యంగా చైన్‌ని శుభ్రం చేస్తూ, తరచూ లూబ్రికేషన్‌ చేస్తుండాలి. లేదంటే మట్టి, బురద, దుమ్ము పట్టిన చైన్, బండి మైలేజీని గణనీయంగా తగ్గిస్తుంది.
  • సరైన వెలుతురు లేకపోవడంతో వర్షాకాలంలో బైకర్లకు రోడ్డుపై పరిసరాలు సరిగా కనిపించవు. ఒక్కోసారి వర్షం పడుతున్నప్పుడూ అదే సమస్య వస్తుంది. ఈ పరిస్థితిలో ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే.. తప్పనిసరిగా హెడ్‌లైట్లు ఆన్‌ చేయాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని