అ‘కండ’ విజయం

శరీరసౌష్టవంపై అసక్తి... కష్టాలను తట్టుకోగలిగే శక్తినిచ్చింది. శ్రేయోభిలాషుల ఆసరా..

Published : 17 Mar 2018 01:28 IST

అ‘కండ’ విజయం
సంకల్పం

ఆసక్తి.. శక్తినిస్తుంది.
ఆసరా.. నడిపిస్తుంది.
తపన... నిలబెడుతుంది.
శ్రమ.. గెలిపిస్తుంది.
రీరసౌష్టవంపై అసక్తి... కష్టాలను తట్టుకోగలిగే శక్తినిచ్చింది. శ్రేయోభిలాషుల ఆసరా.. లక్ష్యం దిశగా నడిపించింది. తనని తాను నిరూపించుకోవాలన్న తపన... కష్టాలను ఎదుర్కొనేలా నిలబెట్టింది. అకుంఠిత శ్రమ.. పోటీల్లోనే కాదు, పేదరికాన్ని గెలిచే నేర్పునిచ్చింది. ఓ యువకుడిని ప్రపంచానికి పరిచయం చేసింది.

లూథియానాలో జరిగిన ఇంటర్నేషనల్‌ బాడీబిల్డింగ్‌ పోటీల్లో రెండు పతకాలు సాధించిన ఓ కండలవీరుణ్ని ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఓ మహిళ వీడియో సోషల్‌మీడియాలో సంచలనమైంది. ఎక్కువమంది ఆ యువకుడి వివరాలను తెలుసుకోవడానికి గూగుల్‌లో సెర్చ్‌ చేశారు. ఆ వివరాలను ఈతరం సేకరించింది. అతని పేరు సుధీర్‌. వీడియోలో కన్నీళ్లు పెట్టుకుంది ఆయన భార్య అపర్ణ. వీరికి పెళ్లై నెలరోజులే అయింది. కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని బలపనూరు వీరి గ్రామం. సరైన వసతులు, తిండి లేకుండానే అతను సాధించిన విజయాలు స్ఫూర్తి నింపేవే. అద్భుతమైన లక్ష్యం అతన్ని ఊరిస్తుంటే... అకుంఠిత శ్రమ నడిపించింది.
అప్పుచేసి ఆహారం
శరీరసౌష్టవం కావాలంటే ప్రతిరోజూ ఖరీదైన పౌష్టిక ఆహారం తీసుకోవాలి. అంత ఆర్థిక స్థోమత సుధీర్‌కు లేదు. దీంతో  అప్పులు తెచ్చి లక్ష్యం కోసం శ్రమించాడు. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన బాడీబిల్డింగ్‌ కోచ్‌ హరిసందు ఆన్‌లైన్‌లో సుధీర్‌కు శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో కోచ్‌ ఇస్తున్న చిట్కాలతో రాటుదేలుతున్నాడు.
పెరిగిన ప్రోత్సాహం
2015 ఆగస్టులో మొదటిసారి పోటీలకు వెళ్లి ‘ఏపీ బాడీబిల్డింగ్‌ అసోసియేషన్‌’ ఆధ్వర్యంలో అనంతపురంలో జరిగిన మిస్టర్‌ రాయలసీమ పోటీల్లో ప్రతిభ చాటాడు. 60కిలోల విభాగంలో బంగారు పతకం సాధించాడు. అప్పటి నుంచి సుధీర్‌ ప్రతిభను గుర్తించి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. ఆ తర్వాత ఎన్నో జాతీయ పోటీల్లో పతకాలు గెలిచాడు. మిస్టర్‌ ఆంధ్ర, మిస్టర్‌ తెలంగాణగా నిలిచాడు. నెలరోజుల క్రితం సుధీర్‌ అపర్ణ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. డిగ్రీపూర్తిచేసి బ్యాంక్‌ కోచింగ్‌ తీసుకుంటున్న అపర్ణ భర్తకు పూర్తి సహకారం అందిస్తోంది. డైట్‌ను సకాలంలో అందించడంతోపాటు పోటీలు జరిగే రాష్ట్రాలకు వెంటవెళ్లి ప్రోత్సహిస్తోంది. 2018 ఫిబ్రవరి 10న పంజాబ్‌ రాష్ట్రంలోని లూథియానాలో షేరోక్లాసిక్‌ నిర్వహించిన ఇంటర్నేషనల్‌ బాడీబిల్డింగ్‌ పోటీలలో 70 కేజీల విభాగంలో వెండి, కాంస్య పతకాలు సాధించి ఔరా అనిపించాడు. రాష్ట్రానికి కండలవీరుడు తెస్తున్న పతకాల వెనుక శ్రమను గుర్తించి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.10లక్షల నగదు అందజేసి సన్మానించారు.

- ఎడ్లపాటి సురేంద్ర, ఈనాడు డిజిటల్‌ - కర్నూలు

రోజూ 9 గంటలు

 ‘రోనీ కోల్మన్‌’లా కండలు పెంచాలని ప్రయత్నిస్తున్నా. ఉదయం 6-8గంటల వరకు జిమ్‌ శిక్షకుడిగా పనిచేస్తూ వర్క్‌అవుట్లు చేస్తాను. 9-11 గంటల వరకు పూర్తిగా కసరత్తులపై దృష్టి పెడతాను. తర్వాత ప్రోటీన్లు, కూరగాయాలు, చికెన్‌ తీసుకుంటాను. సాయంత్రం 4-5 గంటల వరకు వ్యాయామం చేస్తాను. 6-8గంటల వరకు ఆర్జీఎం కళాశాలలో జిమ్‌ శిక్షకుడిగా వ్యవహరిస్తాను. రోజుకు 9గంటలపాటు జిమ్‌లోనే ఉంటాను. మార్చి 18న గోవాలో బాస్‌క్లాసిక్‌ వారు నిర్వహించే ఇంటర్నేషనల్‌ బాడీబిల్డింగ్‌ పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నాను. ‘మిస్టర్‌ ఇండియా’ సాధించడమే నా లక్ష్యం.

- సుధీర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని