Ishan Kishan- Shreyas: అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్‌లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి

సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కాలంటే దేశవాళీ క్రికెట్‌లో ఆడాలనే సూత్రాన్ని పక్కన పెట్టడంతో ఇషాన్‌, శ్రేయస్‌పై వేటుపడిన సంగతి తెలిసిందే.

Published : 10 May 2024 17:32 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లను క్రికెటర్లకు ఇచ్చింది. స్టార్‌ ప్లేయర్లు ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan), శ్రేయస్‌ అయ్యర్‌కు (Shreyas Iyer) మాత్రం దక్కలేదు. దేశవాళీ క్రికెట్‌లో ఆడకపోవడం వల్లే వారికి కాంట్రాక్ట్‌లు దక్కలేదని క్రీడా పండితులు విశ్లేషించారు. ఆ తర్వాత బీసీసీఐ నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్యలే వచ్చాయి. అయితే, ఈ నిర్ణయం వెనక బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) వల్లే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ప్రధాన కార్యదర్శి జై షా (Jai shah) వెల్లడించారు. 

‘‘మీరు ఒకసారి బీసీసీఐ రాజ్యాంగాన్ని చూసుకోండి. నేను కేవలం కన్వీనర్‌ను మాత్రమే. జట్టు ఎంపికలో నా పాత్ర చాలా తక్కువ. ఇషాన్, శ్రేయస్‌ సెంట్రల్ కాంట్రాక్ట్ పొడిగింపు విషయంలోనూ అజిత్‌ అగార్కర్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు ఆసక్తి చూపకపోవడం వల్లే వారిద్దరినీ పక్కనపెట్టాలని అజిత్ భావించాడు. నా పాత్ర కేవలం అమలుచేయడం వరకే ఉంటుంది. వారికి బదులు కొత్త ఆటగాళ్లను తీసుకున్నాం. దేశవాళీ  వీరిద్దరితో తర్వాత నేను ప్రత్యేకంగా మాట్లాడా. మీడియాలోనూ కథనాలు వచ్చాయి. హార్దిక్‌ పాండ్య కూడా తాను పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమని చెప్పాడు. ప్రతీ ఆటగాడు డొమిస్టిక్‌లో ఆడాల్సిందే. అలాకాకుండా ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో అనుమతి తీసుకుంటే ఫర్వాలేదు’’ అని తెలిపారు. 

ఐపీఎల్‌లో రాణించడంపై..

‘‘భారత్‌ నుంచి యువ క్రికెటర్లు ఐపీఎల్‌లో అద్భుతంగా ఆడుతున్నారు. జాతీయజట్టులో చోటు లేకపోయినా ఇషాన్‌ కిషన్ చాలా ప్రశాంతంగా పరుగులు రాబట్టేస్తున్నాడు. శ్రేయస్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. కోల్‌కతాకు సారథ్యం వహిస్తున్నాడు. టీమ్‌ఇండియా తరఫున వరుసగా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తేనే చోటు నిలవడం సాధ్యమవుతుంది. గుజరాత్‌ - ముంబయి మ్యాచ్‌ అనంతరం ఇషాన్‌తో నేను మాట్లాడా. అయితే, అతడికేమీ సూచనలు చేయలేదు. మా  మధ్య సంభాషణ స్నేహపూర్వకంగా సాగింది. టెస్టు క్రికెట్‌ను మరింత విస్తరించేలా చేయడానికి మావంతు కృషి చేస్తూనే ఉన్నాం. దానికోసం ఇప్పటికే ఇన్సెంటివ్‌లను భారీగా పెంచాం. దేశవాళీలోనూ యువ క్రికెటర్లకు మ్యాచ్‌ ఫీజులను పెద్ద మొత్తంలో చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నాం’’ అని జైషా వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని