Air India Express: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌.. నేడూ 75 విమానాలు రద్దు

ఎయిరిండియా (Air India Express)లో కొందరు క్యాబిన్‌ సిబ్బంది చేపట్టిన ఆందోళన విరమించుకున్నప్పటికీ.. సర్వీసుల రద్దు కొనసాగుతూనే ఉంది.

Published : 10 May 2024 17:55 IST

ముంబయి: ఎయిరిండియా (Air India Express)లో సిబ్బంది చేపట్టిన ఆందోళన విరమించుకున్నప్పటికీ.. విమాన సర్వీసులకు ఆటంకం కలుగుతూనే ఉంది. సిబ్బంది కొరత వల్ల శుక్రవారం కూడా 75 విమానాలు రద్దు చేసినట్లు ఏఐఎక్స్‌ వెల్లడించింది. ఆదివారం నాటికి కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని పేర్కొంది. అయితే, ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల వల్ల విమానాల రద్దు, ప్రయాణికులకు పరిహారం కలిపి సంస్థకు దాదాపు రూ.30 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేసింది.

శుక్రవారం కూడా 75 విమానాలు రద్దయినట్లు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ వర్గాలు వెల్లడించాయి. శనివారం కూడా ఈ ప్రభావం ఉండవచ్చని.. దాదాపు 45 నుంచి 50 విమానాలు రద్దయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గురువారం దాదాపు 85 విమాన సర్వీసులను నిలిపివేశారు. ఇలా సమ్మె మొదలైనప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు 260లకు పైగా విమాన సర్వీసులు రద్దైనట్లు తెలిసింది.

కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సుప్రీం

టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ నిత్యం 380 విమానాలను నడుపుతోంది. వీటిలో 120 అంతర్జాతీయ సర్వీసులు కాగా మరో 260 విమానాలు దేశీయంగా సేవలందిస్తుంటాయి. ఈ సంస్థలో మొత్తం 6 వేల మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో 2 వేల మంది క్యాబిన్‌ సిబ్బంది ఉన్నారు.

ఎయిరిండియాకు చెందిన సిబ్బందిలో కొందరు మే 7 రాత్రి నుంచి ఆందోళన బాట పట్టారు. వీటిని తీవ్రంగా పరిగణించిన యాజమాన్యం.. సమ్మెకు దిగిన వారిలో 25 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించడంతోపాటు మిగిలినవారినీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వారి మధ్య చర్చలు విజయవంతం కావడంతో గురువారం రాత్రి ఉద్యోగులు ఆందోళనను విరమించారు. అయితే, అనేకమంది విధులకు తిరిగివస్తుండగా.. వారికి వైద్య పరీక్షలు, ఫిట్‌నెస్‌ టెస్టులు చేస్తుండటంతో ఆలస్యం అవుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని