Jaishankar: వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్‌

వేర్పాటువాదానికి, హింసను సమర్థించేవారికి మద్దతు ఇవ్వడమనేది భావప్రకటన స్వేచ్ఛకు అర్థం కాదని కేంద్ర మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు.

Published : 10 May 2024 17:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఖలిస్థానీ అనుకూలవాదులపై చర్యలు తీసుకునే విషయంలో కెనడా (Canada) మెతక వైఖరిని భారత విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ (S Jaishankar) తూర్పారపట్టారు. వేర్పాటువాదులకు రాజకీయ వేదికను కల్పించడం ద్వారా.. చట్టపర పాలన కంటే ఓటు బ్యాంకే ముఖ్యమన్న ధోరణిని ఆ దేశం బయటపెట్టుకుంటోందని విమర్శించారు. ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వేర్పాటువాదానికి, హింసను సమర్థించేవారికి మద్దతు ఇవ్వడమనేది భావప్రకటన స్వేచ్ఛకు అర్థం కాదని స్పష్టం చేశారు. ఆ దేశంతో సత్సంబంధాల కోసం ఈ అంశాలను పక్కనపెట్టలేమని తేల్చిచెప్పారు.

‘‘అనుమానాస్పద వ్యక్తులను తమ దేశంలో అడుగుపెట్టేందుకు, నివసించేందుకు కెనడా ఎలా అనుమతిస్తోంది? నిబంధనలు పాటించే దేశంలో సంబంధిత వ్యక్తుల నేపథ్యం ఏంటి? వారు ఎలా వచ్చారు? ఏ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నారు? వంటివి తనిఖీ చేస్తారు. కానీ, నకిలీ పత్రాలతో వచ్చినవారినీ అనుమతించడమంటే.. మీ పాలన కంటే ఓటు బ్యాంకే శక్తిమంతమైనదని చెప్పడమే’’ అని వ్యాఖ్యానించారు. ‘‘వేర్పాటువాదులు, ఉగ్రశక్తులకు కెనడాలో రాజకీయ అవకాశాలు లభించాయి. అక్కడి రాజకీయాల్లో ప్రముఖ స్థానాల్లో ఉన్న వ్యక్తులు నేడు భారత వ్యతిరేక కార్యకలాపాలను సమర్థిస్తున్నారు’’ అని జైశంకర్‌ ఆరోపించారు.

కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్‌ హత్య కేసుపై భారత్‌

‘‘భారత వ్యతిరేక కార్యకలాపాలను కెనడా దృష్టికి తీసుకెళ్లినప్పుడల్లా ‘వాక్‌ స్వాతంత్ర్యం’ పేరు చెప్పి తప్పించుకుంటోంది. పదేళ్లుగా ఇదే తంతు. కానీ వాక్ స్వాతంత్ర్యం అంటే.. విదేశీ దౌత్యవేత్తలను బెదిరించడం, భారత్‌కు హాని కలిగించే పనులకు అవకాశం ఇవ్వడం, వ్యవస్థీకృత నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తులను చేరదీయడం కాదు’’ అని స్పష్టం చేశారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో దిల్లీ ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు భగ్గుమన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు ఎటువంటి సాక్ష్యాధారాలను ఆ దేశం పంచుకోలేదని భారత్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు