Election Commission: పోలింగ్‌ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం

Election Commission: పోలింగ్ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయంటూ విపక్ష నేతలకు ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండి పడింది. అసలేం జరిగిందంటే..?

Published : 10 May 2024 17:08 IST

దిల్లీ: సార్వత్రిక సమరానికి సంబంధించి ఎన్నికల సంఘం విడుదల చేసిన పోలింగ్‌ డేటా (voter turnout)లో వైరుద్ధ్యాలు ఉన్నాయంటూ ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీనిపై విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ఇటీవల లేఖ రాశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం ఆ వైరుద్ధ్యాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘంపై విశ్వసనీయత పడిపోయిందని, ఆ సంస్థ పూర్తి స్వతంత్రత, జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడటం అత్యావశ్యకమని పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను ఈసీ (Election Commission) తీవ్రంగా ఖండించింది.

‘‘పోలింగ్‌ డేటాపై కాంగ్రెస్‌ (Congress) బాధ్యతారహిత ప్రకటనలు విస్తుగొలుపుతున్నాయి. నిష్పక్షపాతంగా జరుగుతున్న ఎన్నికల నిర్వహణలో గందరగోళం, అడ్డంకులు సృష్టించేందుకు.. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు పోలింగ్‌ ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఎన్నికల వ్యవస్థను నిరుత్సాహపరుస్తాయి. ఖర్గే లేఖ అత్యంత అవమానకరం. ఈ ఆరోపణలన్నీ అపోహలే. ఓటింగ్‌ డేటా సేకరణ, పోలింగ్ శాతం ప్రకటనలో ఎలాంటి లోపాలు జరగలేదు’’ అని ఎన్నికల సంఘం వెల్లడించింది.

కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సుప్రీం

తొలి, రెండోవిడతల పోలింగ్‌ తుది వివరాలను ఈసీ ఇటీవల అధికారికంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, తొలివిడత పోలింగ్‌ ముగిసిన 11 రోజుల తర్వాత తుది వివరాలను ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. లోక్‌సభ ఎన్నికల తుది ఫలితాలను మార్చే ప్రయత్నమే ఇది అంటూ ఖర్గే తన లేఖలో ఆరోపించారు. దీనిపైనా ఈసీ తీవ్రంగా స్పందించింది.

పోలింగ్ డేటా వెల్లడిలో ఎలాంటి ఆలస్యం జరగలేదని పేర్కొంది. పోలింగ్‌ రోజున చెప్పిన దానికంటే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన డేటా ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుందని తెలిపింది. గత ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందని గుర్తుచేసింది. ఇలాంటి దురుద్దేశ ఆరోపణలతో ప్రజలు, రాజకీయ పార్టీల్లో అనేక సందేహాలు నెలకొంటాయని, అది దారుణమైన పరిస్థితికి దారితీస్తుందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని