నిటారు స్తంభాన్ని నిలువునా ఎక్కచ్చు

వివిధ రాష్ట్రాల్లోని విద్యుత్తు శాఖ అధికారుల ఆర్డర్‌ మేరకు ఇప్పుడు పోల్‌క్లైంబర్లు తయారు చేస్తున్నాను. గతేడాది వేల సాధనాలు తయారుచేశాను. ఇంటి వద్ద ఇప్పుడు నాతో పాటు మరో 12మందికి ఉపాధి ఇవ్వగలుగుతున్నాను....

Published : 02 Jun 2018 01:40 IST

నిటారు స్తంభాన్ని నిలువునా ఎక్కచ్చు

విద్యుత్తు స్తంభం ఎక్కాలంటే ఎంత ప్రయాస? కాలుజారి పడిన వాళ్లెందరో? కాళ్లు చేతులు విరగొట్టుకున్న వాళ్లెందరో? బతుకుబండి నడవాలంటే... ఇలా తాను ఎక్కక తప్పలేదు. ఈ సమస్య ఆలోచనను ఇచ్చింది.
పరిసరాలు పరిష్కారం చూపించాయి. ఈ కష్టం నుంచి బయటపడటానికి చేసిన ఆవిష్కరణ జీవితాన్నే మార్చేసింది. ఆ కష్టం... ఆ ఆలోచన.. ఈ ఆవిష్కరణ గురించి.. మీరే చదవండి.

వివిధ రాష్ట్రాల్లోని విద్యుత్తు శాఖ అధికారుల ఆర్డర్‌ మేరకు ఇప్పుడు పోల్‌క్లైంబర్లు తయారు చేస్తున్నాను. గతేడాది వేల సాధనాలు తయారుచేశాను. ఇంటి వద్ద ఇప్పుడు నాతో పాటు మరో 12మందికి ఉపాధి ఇవ్వగలుగుతున్నాను. తాటి, ఈతచెట్లు సులువుగా ఎక్కే సాధనాలు రూపొందించాను. వాటిని త్వరలోనే ప్రదర్శిస్తాను.

సులువుగా విద్యుత్తు స్తంభం ఎక్కే సాధనాన్ని (పోల్‌   క్లైంబర్‌) రూపొందించాడు చీరాలకు చెందిన తిరుపతిరావు. ఈ పోల్‌క్లైంబర్‌కు జాతీయస్థాయిలో ఉత్తమ ఇన్నోవేషన్‌(ఆవిష్కరణ) అవార్డు వచ్చింది. దేశంలో ఈ అవార్డు ముగ్గురికి దక్కగా, వారిలో తిరుపతిరావు ఒకరు. దీంతో పాటు, రూ. 3 లక్షల నగదు బహుమతి అందుకొని అందరి ప్రశంసలూ పొందుతున్నాడు ఈ చీరాల చిన్నోడు.
పేద కుటుంబానికి పెద్ద కష్టం
ప్రకాశం జిల్లా చీరాలలోని కొత్తపేట ప్రాంతానికి చెందిన తిరుపతిరావు ఎనిమిది మంది సంతానంలో ఒకరు. తండ్రి రామదాసు హోంగార్డు. తల్లి వరదానమ్మ. ఆర్థిక కష్టాల మధ్య చదువు సాగేది. 2005లో రోడ్డు ప్రమాదానికి గురై ఒక అన్నయ్య చనిపోయాడు. ఏడాది తర్వాత మరో అన్నయ్య ప్రమాదానికి గురై అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. చికిత్స కోసం ఉన్న ఇంటిని అమ్ముకుని రూ. 5 లక్షల వరకు ఖర్చుచేశారు. అప్పులు చేశారు. అయినా అన్నయ్య దక్కలేదు. ఇలా కుటుంబం అప్పులపాలై ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకుంది.
గైడ్‌ కొనలేక బడి మానేసి
అప్పుడు తిరుపతిరావు ఏడో తరగతి. బడిలో అందరూ గైడ్‌ తీసుకురావాలని ఉపాధ్యాయుడు ఆదేశించారు. వారం రోజులైన తిరుపతిరావు కొనలేదు. రూ. 25 ఖర్చు చేసే పరిస్థితి ఇంట్లో లేదు. బడిలో ఉపాధ్యాయుడు రోజూ కొట్టేవారు. దీన్ని భరించలేని తిరుపతిరావు ఇక చదువు మానేశాడు. కుటుంబ పరిస్థితులు పూట గడవడమే కష్టంగా ఉండడంతో కూలీగా మారాడు. విద్యుత్తు స్తంభాలు ఎక్కే పనికి వెళ్లాడు.కష్టం నేర్పిన పాఠం
విద్యుత్తు స్తంభాలు ఎక్కేటప్పుడు చాలామంది కింద పడుతున్నారు. కాళ్లు, చేతులు విరుగుతున్నాయి. సులువుగా, కిందపడకుండా స్తంభాలు ఎక్కలేమా? అని తిరుపతిరావు ఆలోచించాడు. ఆ సమయంలో ఊరిలోని చర్చికి బల్లలు తయారు చేయాల్సి వచ్చింది. వాటిలో క్లింబర్లు పెట్టడం, వాటిని జాయింట్‌ చేయడం చూశాడు. వాటిని అతికించినట్టే మనిషి కాళ్లకు, స్తంభంపై పట్టు ఉండేలా చేస్తే పడిపోమని ఆలోచించాడు. అదే ఆవిష్కరణకు దారి తీసింది. స్తంభాన్ని గట్టిగా పట్టుకుని ఉండేలా క్లైంబర్‌ను రూపొందించాడు. దాన్ని కాళ్లకు పెట్టడం కుదరదు. పెడితే కాళ్లకు దెబ్బలు తగులుతున్నాయి. ఇలా దాదాపు రెండు వారాల పాటు వివిధ ప్రయోగాలు చేసి, చెప్పులకు అతికించాడు. దీంతో అనుకున్న ఫలితం వచ్చింది. దీన్ని తానే స్వయంగా ప్రయోగించి... స్తంభం ఎక్కుతూ వీడియో తీయించాడు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. దీన్ని ఒక్కరోజులో 2 లక్షల మంది వీక్షించారు. కువైట్‌, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల నుంచి కొందరు విద్యార్థులు ఫోన్‌ చేసి తమకు ఆ విధానం తెలియజేయాలని కోరారు. దేశవ్యాప్తంగా వందలాదిగా ప్రశంసలు, ఫోన్లు వచ్చాయి.దిల్లీ నుంచి ప్రశంసలు
ఆవిష్కరణ విషయం దిల్లీకి చేరింది. జాతీయ సొసైటల్‌ ఆవిష్కరణ అవార్డు-2017 కి తిరుపతిరావు ఎంపికయ్యాడు. గత వారమే ఆయన ఈ అవార్డుని కేంద్రమంత్రి హర్షవర్థన్‌ చేతులు మీదుగా అందుకున్నారు. దీంతో పాటు ఎన్‌ఐఆర్‌డీ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డులు దక్కాయి. విశాఖపట్నంలో గత ఏడాది జరిగిన 30 దేశాల ఆవిష్కరణల సదస్సులో ద్వితీయస్థానం దక్కింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, విదేశీ ప్రముఖుల చేతుల మీదుగా రజత పతకం అందుకున్నారు. ప్రస్తుతం తిరుపతిరావు దూరవిద్య ద్వారా ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు.

- మానెం శ్రీనివాసరావు
ఈనాడు డిజిటల్‌, ఒంగోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని