మనసున మనసైన

మెనూ! ఏ ఆదివారం అయినా అక్కడికి వెళ్లండి... చిట్టిచిట్టి చేతులు వంటల్లో అద్భుతాలు చేస్తూ కనిపిస్తాయక్కడ! ఏమ్‌.. ఆదివారమే...

Published : 04 Aug 2018 02:11 IST

మనసున మనసైన

 మెనూ! ఏ ఆదివారం అయినా అక్కడికి వెళ్లండి...
చిట్టిచిట్టి చేతులు వంటల్లో అద్భుతాలు చేస్తూ కనిపిస్తాయక్కడ!
ఏమ్‌.. ఆదివారమే ఎందుకు? మామూలు రోజుల్లో వెళ్లకూడదా
అంటే అప్పుడూ వెళ్లొచ్చు. అప్పుడైతే వంటల గురించి
తీవ్రమైన చర్చోపచర్చలు జరుగుతాయి. అది విని ఔరా
అని నోరెళ్లబెట్టొచ్చు. పాకశాస్త్రంలో లోతులు వెతికే  ది కలినరీ లాంజ్‌ గురించే ఈ వివరణ అంతా....
బుక్కున చూడగానే హాల్లో గోడమీద కనిపించే ఆ చిత్రాలు ఎవరివో ఎంత బుర్రబద్ధలు కొట్టుకొన్నా అర్థంకావు. ఒక వేళ మీరు ఏ పేరున్న చెఫ్‌ అయితేనో తప్ప! కానీ ఆ చిత్రాలు అమర్చిన తీరుని బట్టి ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలం అయితే మనలో అంతకంతకు పెరుగుతుంది. ఆ ఫొటోల్లో ఒకావిడ జియాంగ్‌క్వాన్‌. బౌద్ధబిక్షువు ఆమె. తక్కువ పదార్థాలతో ఆమె చేసే రుచికరమైన పదార్థాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భోజనప్రియులు లొట్టలేసుకుంటూ ఎదురుచూస్తుంటారట! గోర్డన్‌రామ్సే.. హెల్స్‌ కిచెన్‌ అనే పేరొందిన టీవీ కార్యక్రమం చూసే చాలామందికి అతను చిరపరిచితుడే. ఇలా ఒక్కో ఫొటో.. ఒక్కో వంటల కథ  తెలుసుకున్న తర్వాత కుడివైపునకు వెళ్లాలా? ఎడమవైపునకు వెళ్లాలా? అని ఆలోచిస్తున్న మనకి కుడివైపునకు వెళ్తే సకల సదుపాయాలు అందుబాటులో ఉండే కిచెన్స్‌ స్వాగతం పలుకుతాయి. అక్కడ అంతర్జాతీయ వంటకాలు మొదలుకుని.. స్ట్రీట్‌ఫుడ్‌ వరకూ అన్నీ నేర్చుకోవచ్చు. అవి నేర్పడానికి ప్రముఖ హోటల్స్‌కు చెందిన మాస్టర్‌ చెఫ్‌లు మొదలుకుని ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ల వరకూ 350 మంది పాకశాస్త్ర నిపుణులు మీకు తోడుగా ఉంటారు. అదే ఎడమవైపునకు వెళ్తే? ఎక్స్‌పీరియెన్షల్‌ డైనింగ్‌ వేదిక స్వాగతం పలుకుతుంది.
ఎక్స్‌పీరియెన్షల్‌ డైనింగ్‌ అంటే...
మెనూ తీసుకుని అందులో ఉన్న ఏవో నాలుగు వంటకాలకి టిక్‌ కొట్టే పద్ధతి ఇక్కడ ఉండదు. ఎదురుగా చెఫ్‌ ఉంటారు. మీకు నచ్చిన వంటకాన్ని చెబితే అతను మీ ఎదురుగానే ఆ వంటకాన్ని చేసి పెడతారు. దగ్గరుండి చూడొచ్చు. కావాలంటే మీరే మార్పుచేర్పులు చేసుకోవచ్చు. రుచికరమైన భోజనంతో పాటు, లైవ్‌ సంగీతం మొదలుకుని మీరు కోరుకున్న విధంగా అదనపుహంగులూ ఏవి కావాలన్నా ఉంటాయి. ఆస్వాదిస్తూ తినొచ్చు. అదీ ఎక్స్‌పీరియెన్షల్‌ డైనింగ్‌ ప్రత్యేకత అంటారు ఈ సంస్థ స్థాపకుల్లో ఒకరైన నాగరాజు. ‘ఈ మధ్యే ఓ జంట మా దగ్గరకు వచ్చారు. వాళ్ల పెళ్లై ఏడేళ్లు అవుతోంది. ఇది ఎనిమిదో ఏడాది. ఏడు సంవత్సరాలు ఏడు దేశాల్లో సెలబ్రేట్‌ చేసుకున్నారట. ఈసారి అలానే కొత్తగా ప్రయత్నించాలనుకున్నారు. ఆ బాధ్యతని మాకు అప్పగించారు. ఆమె నచ్చే విధంగా లైవ్‌ సంగీతం మధ్య... మెడిటేరియన్‌ఫుడ్‌తో వడ్డించాం. ఇంతవరకూ మేం నిర్వహించిన డైనింగ్స్‌లో ఏ రెండూ ఒకేలా ఉండకపోవడం విశేషం. ప్రతి భోజనం భిన్నంగా ఉంటుంది. వీటి ఖరీదు ఐదువేల రూపాయల నుంచి లక్షన్నర వరకూ ఉంటుంది. ముంబయి, దిల్లీ, కోల్‌కత్తా తర్వాత ఈ రకమైన డైనింగ్‌ ఇక్కడే అందుబాటులో ఉంది అంటున్నారు నాగరాజు.
పిల్లల కోసం..
అమ్మానాన్న ఆఫీసుల నుంచి ఇంటికి రావడానికంటే ముందుగానే పిల్లలు ఇంటికి చేరుకుంటారు. అంతవరకూ ఇంట్లో ఉన్నవాటితో సర్దుకోవాలి. సొంతంగా చేసుకోవాలంటే వంటరావాల్సిందే. ‘కానీ ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలకు వంటవచ్చు చెప్పండి. అందుకే మేం వారాంతాల్లో పిల్లలకు వంట నేర్పిస్తున్నాం. మాస్టర్‌ చెఫ్‌ ఇండియా భక్తిఅరోరా పిల్లలకు వంట నేర్పిస్తారు. సులువుగా చేసుకునే వంటలు, కుక్‌ వితవుట్‌ ఫైర్‌ వంటలతో పాటు ఆసక్తికరమైన అంశాలపై వర్క్‌షాపులు నిర్వహిస్తాం. చాక్లెట్‌ బీన్స్‌ని తీసుకొచ్చి వాటిని చాక్లెట్‌గా మార్చే విధానం వరకూ పిల్లలకు అర్థమయ్యేలా ప్రతి దశను వారికి విపులంగా వివరిస్తాం. కేవలం వంట వండుకోవడం మాత్రమే కాదు... వండేటప్పుడు ప్రతి అంశాన్ని ఆస్వాదించడంలో ఉండే మజాను కూడా వారికి వివరిస్తాం’ అంటున్నారు ఈ సంస్థను ప్రారంభించిన గోపి.

పార్టీలు చేసుకోవచ్చు...   

లినరీలాంజ్‌ను ప్రారంభించిన గోపీ, నాగరాజు ఇద్దరూ ఐటీ నేపథ్యం ఉన్నవాళ్లు. అంతకుమించి రుచులని ఆస్వాదించే మనసున్న వాళ్లు. ఆ ఆసక్తితోనే ‘ఫీజ్ట్‌’ అనే స్టార్టప్‌ని ప్రారంభించారు. అది విజయవంతం అవ్వడంతో ఈ కలినరీ లాంజ్‌కి శ్రీకారం చుట్టారు. ఇక్కడ కార్పొరేట్‌ సంస్థల సిబ్బంది, సీఈవోలు, పర్యటకులు వస్తుంటారు. కొందరు ఎక్స్‌ప్రెసివ్‌ డైనింగ్‌ హాజరైతే మరికొందరు మా దగ్గర జరిగే హండీ టాక్స్‌కు హాజరవుతుంటారు అంటున్నారు నాగరాజు.

- శ్రీసత్యవాణి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని