ప్రేమ కాదు గురూ!

సౌభాగ్య... ఈ పేరు వినగానే మనసుకు రెక్కలొచ్చేవి. పాదాలు స్టెప్పులేసేవి.

Published : 27 Aug 2016 01:09 IST

నాలుగు మాటలు..కుదిరితే కప్పు కాఫీ..
ప్రేమ కాదు గురూ!

సౌభాగ్య... ఈ పేరు వినగానే మనసుకు రెక్కలొచ్చేవి. పాదాలు స్టెప్పులేసేవి. గుండె లవ్‌లవ్‌ అని కొట్టుకునేది. అది ఒకప్పుడు. ప్రస్తుతం ఆ పేరు వింటేనే కంపరం, బాధ... అన్నింటికి మించి కోపం. ఎందుకిలా అంటే నా గాథ వినాల్సిందే.
‘అన్నయ్యా! మన పక్క వూరిలో ఉండే ప్రవీణ్‌ నన్ను సతాయిస్తున్నాడు. కాలేజీ నుంచి వస్తుంటే రోజూ ఫాలో అవుతున్నాడు’ చెల్లి ఫిర్యాదుతో కోపం నషాళానికంటింది. వార్నింగ్‌ ఇవ్వాలని వాడింటికి పరుగెత్తా. గుమ్మంలోనే ఓ అమ్మాయి ఎదురొచ్చింది. ఏంజెల్లా ఉన్న తనను చూసి మెలికలు తిరిగిపోయా. ‘హలో ఎవరు కావాలి? విషయమేంటి?’ తను గద్దించేసరికి నా కర్తవ్యం గుర్తొచ్చింది. ప్రవీణ్‌ గురించి అడిగా. తమ్ముడంది. ‘మీవాడు మా చెల్లి వెంట పడుతున్నాడట. అదుపులో పెట్టుకో. తీరు మారకపోతే ఎముకలిరుగుతాయ్‌’ గెట్టిగానే చెప్పా. తమ్ముడికి చీవాట్లు పెడుతుందనుకుంటే తనేమో రివర్స్‌లో వచ్చింది. ‘మీ చెల్లి నచ్చిందేమో? ప్రేమించడం నేరమా’ అంది. తన సమాధానంతో నాకు ఆశ్చర్యంతోపాటు చిరాకేసింది. ‘అయితే నువ్వూ అందంగానే ఉన్నావ్‌. నిన్ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడితే వూర్కుంటావా?’ అన్నా. ‘పడూ... నచ్చితే నేనూ ప్రేమిస్తా. లేదంటే నో చెబుతా’ అంతే వేగంగా దూసుకొచ్చింది సమాధానం. ఇంకేం మాట్లాడలేక అక్కణ్నుంచి కదిలా.

తన మాటలు నన్ను కవ్వించాయ్‌. ప్రేమలో పడమని ప్రేరేపించాయ్‌. ఏదో పని కల్పించుకొని తన చుట్టూ తిరిగా. ఆకాశరామన్నలా సందేశాలు పంపా. ‘ఎందుకీ డొంక తిరుగుడు ప్రయత్నాలు... విషయమేంటో సూటిగా చెప్పు’ అందోసారి. క్షణం ఆలస్యం చేయకుండా ‘నువ్వంటే నాకిష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకుంటా’ అన్నా. నాకు మంచి ఉద్యోగం ఉంది. బాగానే ఉంటాననే నమ్మకం. పైగా ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం కావడంతో కాదనదు అనే నమ్మకం. నాల్రోజుల్లో చెబుతానంది. అన్నట్టుగానే ‘నీ లవ్‌లో నిజాయతీ కనిపిస్తోంది. ఐ టూ లవ్యూ రా’ అంది. ఇక నా ఆనందానికి అడ్డేముంది? సౌభాగ్య అమ్మమ్మది మా వూరే. కొన్నాళ్లు ఇక్కడే ఉంటానని వచ్చింది. మాకిక అడ్డంకి లేకుండా పోయింది. చెరుకు మడులు, మామిడి తోటలు, పంట చేలు మా ప్రేమకు వేదికలయ్యేవి. ‘రేయ్‌ మామా తను చాలా ఫాస్ట్‌రా... నీకు సరిపోదేమో’ నా ఫ్రెండ్స్‌ సందేహించేవాళ్లు. నేను పట్టించుకుంటేగా!

నెలలు గడిచాయి. మంచి రోజులొచ్చాయని పెళ్లి మాటెత్తారు అమ్మానాన్నలు. సౌభాగ్యని అడిగా. ‘పెళ్లా? చేస్కుందాం. కానీ మనిద్దరం కాదు. వేరేవాళ్లని’ అనేసరికి నా గుండె బేజారైంది. ‘నువ్వు విన్నది నిజమే. సిటీలో చదువుకున్నపుడు నీలాగే ఇంకో అబ్బాయి నన్ను ప్రేమించాడు. ఇప్పుడు తను నీకంటే మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అతడ్నే చేస్కోవడం కరెక్ట్‌ కదా!’ అనేసరికి నాకు ఏడుపొక్కటే తక్కువ. మరి మన ప్రేమ, కలిసి తిరగడం సంగతేంటి అంటే ‘టేకీటీజీ యార్‌... లైట్‌ తీస్కో’ అంది. ‘అన్నట్టు ఏ ప్రియుడైనా తన లవర్‌ సంతోషం కోరుకుంటాడట. ఇంకోసారి నువ్వు నా జీవితంలోకి రావనుకుంటున్నా’ అభ్యర్థనో, ఆజ్ఞో అర్థంకాని విధంగా ఓ మాట చెప్పింది. తను ఏ విషయమైనా సూటిగా మాట్లాడుతుందని తెలుసుగానీ ఇంత నిర్భయంగా, నిస్సిగ్గుగా మాట్లాడుతుందనుకోలేదు.

తన మోసం నన్ను చాలా బాధించింది. కొన్నాళ్లు దేవదాసునయ్యా. కానీ ముందూవెనకా ఆలోచించేవాణ్ని కావడంతో తొందర్లోనే తేరుకున్నా. వయసులో ఉన్నపుడు అమ్మాయి, అబ్బాయిలు ఏవో కొన్ని మాటలకు ఆకర్షితులవడం... కలిసి తిరగడం... దాన్నే ప్రేమని పొరపడటం... తీరా ఎవరో ఒకరు హ్యాండివ్వగానే ఏడవడం. అనుభవపూర్వకంగా చెబుతున్నా ఇది ప్రేమకాదు కేవలం ఆకర్షణే. నిజం తెలుసుకోండి. విలువైన సమయం వృథా కానీవ్వకండి.

- రాజు (పేర్లు మార్చాం)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని