ప్రేమలో ఫెయిల్‌.. చదువు పాస్‌

ప్రేమ మోజులోపడి చదువును నిర్లక్ష్యం చేసే వాళ్లెంతోమంది. కానీ చదువే వద్దనుకున్న కుర్రాడు ఓ...

Published : 11 Mar 2017 01:16 IST

ప్రేమలో ఫెయిల్‌.. చదువు పాస్‌

ప్రేమ మోజులోపడి చదువును నిర్లక్ష్యం చేసే వాళ్లెంతోమంది. కానీ చదువే వద్దనుకున్న కుర్రాడు ఓ అమ్మాయి కారణంగా బీటెక్‌ పూర్తి చేశాడు. అదెలా?
‘నా ఫ్రెండ్సంతా శ్రీ చైతన్యలో చేరుతున్నారు. నేనూ చేరతా నాన్నా?’ నా మాటకి గుడ్లురిమారు నాన్న. ‘స్కూల్‌కే సరిగా వెళ్లవు. లక్షల ఫీజు కట్టి కార్పొరేట్‌ కాలేజీలో చేర్పించాలా?’ అంటూ నా ఉత్సాహంపై నీళ్లు చల్లారు. ఇరవై కిమీల దూరంలో మొదలైంది నా ఇంటర్‌. బూత్‌బంగ్లాలాంటి కాలేజీ.. ఉదయం, సాయంత్రం బస్సు ప్రయాణం. చిరాకేసేది. క్లాసులకు తరచూ బంక్‌ కొట్టేవాణ్ని. కొన్నాళ్లయ్యాక అసలు కాలేజీకెళ్లడమే మానేద్దాం అనుకున్నా.
ఓరోజు ఎప్పట్లాగే ఇంటికొచ్చే బస్సెక్కుతున్నా. ఎక్కణ్నుంచో వచ్చింది మెరుపుతీగలా ఓ అమ్మాయి నన్ను దాటుకొని లోపలికెళ్లిపోయింది. కాసేపయ్యాక ఎవరో పిలిస్తే పొడుగాటి జడని ముందుకు తోసి వెనక్కి తిరిగింది. ఒక్కసారిగా తన చూపులు నా గుండెల్లో గుచ్చాయి. ఒంట్లో నరాలు జివ్వుమన్నాయ్‌. మర్నాడు అదే సమయానికి మళ్లీ కనపడింది. మీసాలు మొలిచే ప్రాయంలో కుర్రాళ్లకి ఏ అమ్మాయైనా అందంగానే కనిపిస్తుందట. తనేమో అప్సరస. అరగంట ముందే బస్టాపులో వాలిపోయేవాణ్ని. కొత్త డ్రెస్‌ వేసుకొని పోజు కొట్టడం.. ఫ్రెండ్స్‌తో బిగ్గరగా మాట్లాడ్డం.. తన దృష్టిలో పడటానికి చేయని ప్రయత్నం లేదు. మాట కలిపే ధైర్యం మాత్రం లేదు.
నా ఫస్టియర్‌ పూర్తైంది. తను కనుమరుగైంది. డీలా పడిపోయా. వూళ్లొ కాలేజీలన్నీ గాలించా. ‘పిచ్చోడిలా ఏంటా వెతుకులాట? ఎవరి కోసమో చెప్పరా’ అనేవారు ఫ్రెండ్స్‌. నా బాధ వాళ్లకేం తెలుసు? వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు కొన్నాళ్లకు ఓసారి మా వూళ్లొ కనిపించింది. నాకు పట్టరానంత సంతోషం. ‘ఆమె పేరు ప్రియ. నీకన్నా సీనియర్‌. బంధువులింటికొచ్చింది’ వివరాలు అందించాడో స్నేహితుడు.
ఇంటర్‌ కాగానే ఎంసెట్‌ కోచింగ్‌ కోసం నెల్లూరు వెళ్లా. బాగా చదవాలి.. తన కాలేజీలోనే చేరాలి. ఇదీ నా లక్ష్యం. బాగా కష్టపడ్డా. మంచి ర్యాంకొచ్చింది. పేరున్న కాలేజీలో సీటొచ్చే అవకాశం ఉన్నా ప్రియ కాలేజీలోనే చేరా. మళ్లీ తను కనపడింది. నాకు ప్రాణం లేచొచ్చింది. కాలేజీకి రోజూ హాజరు వేసుకునేవాణ్ని. కానీ మళ్లీ అదే మొహమాటం. రెండేళ్లు గడిచినా నోరు విప్పలేదు.
వారంలో ప్రియ ఫేర్‌వెల్‌ డే. ఆరోజు కచ్చితంగా నా మనసులో మాట చెప్పాలనుకున్నా. బాగా ప్రిపేరయ్యా. కానీ నా దురదృష్టం! ఓరోజు తను ఒకబ్బాయితో సన్నిహితంగా కనిపించింది. వాళ్లది ప్రేమేమో అనే అనుమానం. కావొద్దని అందరి దేవుళ్లకు మొక్కుకున్నా. ప్చ్‌.. నా కోరిక తీరలేదు. ఆ అబ్బాయి మరోసారి ప్రియకు ముద్దు పెడుతూ కనిపించాడు. నా కళ్లల్లోంచి ధారగా నీళ్లు.
ఐదేళ్ల నుంచి తనని అనుసరించా. గుండెల్లో కొండంత ప్రేమ పెంచుకున్నా. ఇప్పుడు తను వేరొకరి సొంతం. అయినా అప్పుడొచ్చింది మొండి ధైర్యం. నా ప్రేమ, బాధంతా వెళ్లగక్కేసానోసారి. నేనెవరో.. ఎప్పట్నుంచి ప్రియని ఇష్టపడుతున్నానో.. తనకోసం ఏం చేశానో చెప్పేశా. అంతా విని ‘అయ్యో.. మరిన్నాళ్లు నాతో ఎందుకు చెప్పలేదు? సారీ.. నేనీమధ్యే ఆ అబ్బాయి లవ్‌ ప్రపోజల్‌కి ఒప్పుకున్నా’ అంది. అప్పుడు కలిగింది అసలైన బాధ. నా ప్రేమ విషయం ముందే చెబితే ఒప్పుకునేదేమో. ఏదేమైనా ఇప్పుడు నా చేతుల్లో ఏం లేదు.
అప్పట్నుంచి ఎప్పుడు ఎదురుపడ్డా చిరునవ్వుతో పలకరించేది. కల్మషం లేని మాట. బాగా చదవమని చెప్పేది. తన ప్రోత్సాహంతోనే బీటెక్‌ పూర్తి చేశా. తన ప్రేమ దక్కలేకపోయినా డిగ్రీ పట్టా చేతికందిందంటే ఆమె చలవే. ప్రియ కోసం ఎదురుచూసిన క్షణాలు.. మాటలు.. జ్ఞాపకాలు ఎప్పటికీ నా గుండెల్లో పదిలమే.

- హరికృష్ణ, నెల్లూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు