Haryana: హరియాణాలో భాజపా సర్కార్‌కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!

హరియాణాలో నాయబ్‌ సింగ్‌ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.

Published : 07 May 2024 21:48 IST

చండీగఢ్‌: లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతోన్న సమయంలోనే హరియాణాలో భాజపా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. నాయబ్‌ సింగ్‌ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తామని వెల్లడించారు. వీరి నిర్ణయంతో భాజపా ప్రభుత్వం చిక్కుల్లో పడినట్లు అయ్యింది.

‘ప్రభుత్వానికి మా మద్దతు ఉపసంహరించుకుంటున్నాం. కాంగ్రెస్‌కు మద్దతు తెలియజేస్తాం. రైతులకు సంబంధించిన అంశాలతోపాటు ఇతర సమస్యల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని రోహతక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు సోంబిర్‌ సాంగ్వాన్‌, రణధీర్‌ గొల్లెన్‌, ధరంపాల్‌ గోండర్‌లు పేర్కొన్నారు. హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్‌ సింగ్‌ హుడా, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్‌ భాన్‌ల సమక్షంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ ప్రకటన చేశారు.

సీఎం రాజీనామా చేయాలి..

‘90 మంది సభ్యులున్న హరియాణాలో అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల సంఖ్య (మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, మరో స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్‌ చౌతాలా ఇటీవల రాజీనామాలతో) 88కు పడిపోయింది. భాజపాకు మాత్రం 40 మంది సభ్యుల బలం ఉంది. పది మంది ఎమ్మెల్యేలు ఉన్న జేజేపీ, ఇతర స్వతంత్రులతో తొలుత భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ, ఆ తర్వాత జేజేపీ మద్దతు ఉపసంహరించుకోగా.. మరికొంత మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి వైదొలిగారు. దీంతో నయాబ్‌ సింగ్‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది. అందుకే ఆయన తక్షణమే రాజీనామా చేయాలి’ అని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్‌ భాన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని