దారి తప్పిన సావాసం... చేజారింది జీవితం

స్నేహం గొప్పదే. కానీ అది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. ఒక మంచి...

Published : 12 Aug 2017 01:21 IST

దారి తప్పిన సావాసం...
చేజారింది జీవితం

స్నేహం గొప్పదే. కానీ అది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. ఒక మంచి స్నేహితుడు జీవితాన్ని నిలబెడితే... చెడు స్నేహం అధోపాతాళానికి నెట్టేస్తుంది. అందుకు నేనే సాక్ష్యం అంటున్నాడో యువకుడు.
ఇంటర్‌ దాకా నేను రాముడు మంచి బాలుడు టైపే. డిగ్రీలో ముగ్గురితో కుదిరిన దోస్తీ నన్ను పూర్తిగా మార్చేసింది. బైక్‌ షికార్లు.. సినిమాలు చూడ్డంతో మొదలై పూర్తిగా దిగజారిపోయా. సిగరెట్‌ తాగితేనే హీరో అనేవారు ఫ్రెండ్స్‌. మందు కొట్టపోతే మనిషే కాదన్నారు. రెడ్‌లైట్‌ ఏరియాలకు కూడా వెళ్లేవాళ్లం. చెడు స్నేహం మత్తులో మునిగిన నాకు ఆ చేష్టలన్నీ హీరోయిజంలా కనిపించేవి.
ఓరోజు చర్చ అమ్మాయిలపైకి మళ్లింది. ప్రేమించే పెళ్లి చేసుకుంటా అన్నాన్నేను. ‘నీకంత సీన్‌ లేదురా? లవ్‌ మ్యారేజీ చేసుకోకపోతే మగాడివి కాదని ఒప్పుకుంటావా?’ అని రెచ్చగొట్టారు ఆ ముగ్గురు. రోషం ముంచుకొచ్చింది. ‘ఓకే డన్‌.. ఒప్పుకోవడమే కాదు అలా చేయలేకపోతే జీవితాంతం మీ బానిసలా ఉంటా’ సవాల్‌ విసిరా.
మర్నాటి నుంచే నా టాస్క్‌ మొదలైంది. మాకు నాలుగిళ్ల ఆవల ఉండే అమ్మాయి టార్గెట్‌ అయింది. తన దృష్టిలో పడేలా పోజు కొట్టడం... పుట్టినరోజు, పండగలకి విష్‌ చేయడం... ప్రత్యేక సందర్భాల్లో చిన్నచిన్న బహుమతులివ్వడం... ఇదే నా దినచర్యగా మారింది. మొత్తానికి తొందర్లోనే ఆ అమ్మాయిని ముగ్గులోకి దింపేశా. చాటింగ్‌లు.. మీటింగ్‌లూ వూపందుకున్నాయి. పందెం వేసి తనని ప్రేమలో పడేసినా తర్వాత సిన్సియర్‌గా ప్రేమించడం మొదలుపెట్టా. ఒకవైపు గాడితప్పిన అలవాట్లు... ఇప్పుడేమో కొత్తగా ప్రేమ మైకం.. చదువు సంగతే మర్చిపోయా. పరీక్షలపుడు చదువుదాంలే అని తేలిగ్గా తీసుకునేవాణ్ని.
పరీక్షలవగానే ప్రేమించిన అమ్మాయితో పెళ్లి సంగతి మాట్లాడాలనుకున్నా. కానీ ఈలోపే చెడు శకునం. ‘మన పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకునేలా లేరు’ నేనడక్కముందే చెప్పేసింది. ఫ్రెండ్స్‌ దగ్గర బాధ వెళ్లగక్కా. ‘మర్యాదగా అడిగితే పెద్దవాళ్లు ఒప్పుకోర్రా. లేచిపోయి పెళ్లి చేసుకోండి. ఏదైనా అయితే మేం చూసుకుంటాం. మీకోసం ప్రాణాలివ్వడానికీ మేం సిద్ధం’ మిత్రత్రయం సలహా ఇచ్చారు. ఆ భరోసాతోనే మేం ఇంట్లోంచి బయటికెళ్లిపోవడానికి ‘ముహుర్తం’ కూడా పెట్టేసుకున్నాం. ఆ అమ్మాయి వచ్చి నా చేయందుకునే సమయం కోసం ఎదురుచూస్తున్నా. తను రాలేదు కదా టైంకి పోలీసులు వచ్చి నా చేయి పట్టుకున్నారు. స్టేషన్‌కి లాక్కెళ్లారు. ప్రాణం ఇస్తామన్న స్నేహితులు జంప్‌. అమ్మాయిని బలవంతంగా తీస్కెళ్తున్నాని ఆమె పేరెంట్స్‌ ఫిర్యాదు చేశారు. ‘మేం ఒకరంటే ఒకరికిష్టం. ఇష్టంతోనే ఇద్దరం ఇంట్లోంచి వెళ్లిపోతున్నాం’ పోలీసులతో వాదించా. అప్పుడు జరిగింది అసలు సీన్‌. నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి.. నాతో కాలు బయటపెట్టడానికి సిద్ధపడ్డ అమ్మాయి అడ్డంగా మాట మార్చేసింది. నా చెంప ఛెళ్లుమనిపించి ‘వీడే ప్రేమంటూ నా వెంటపడి మాయమాటలు చెప్పి నన్ను వేధిస్తున్నాడు. నాకిష్టం లేదని చెప్పినా నా వెనకాలే తిరుగుతున్నాడు’ అంది. నా కళ్లకు కమ్మిన ప్రేమ మైకం ఒక్కసారిగా దిగిపోయింది. తను నన్ను ప్రేమించిందని నా మనసుకు తెలుసు. మేం తిరిగిన చెట్టూచేమకు తెలుసు. అది నా నిరూపించుకోవడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు. తన్నులు తిని.. అందరి కాళ్లావేళ్లా పడి అక్కణ్నుంచి బయటపడ్డా.
వూళ్లొ పరువుపోయింది. బంధువులు, తెల్సినవాళ్లు నన్నో పనికిమాలినోడిగా జమ కట్టారు. డిగ్రీ ఫెయిలయ్యాను. నాతోపాటు చదువుకున్నవాళ్లంతా మంచి ఉద్యోగాల్లో స్థిరపడితే.. నేనేమో పూట గడవడానికి కూలిగా మారాను. చెడు స్నేహాలు.. చదువుకునే వయసులో ప్రేమతోనే నాకీ గతి పట్టిందని తెలిసొచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. మీరూ నాలా కావొద్దనే మీ ముందుకొచ్చా.

- కృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు