ప్లీజ్‌..నన్ను మరిచిపో..!

నా పేరు అవినాష్‌ (అసలు పేరు కాదు). మాది కరీంనగర్‌లోని ఓ పల్లెటూరు. పీజీ పూర్తయింది. ప్రభుత్వ ఉద్యోగ ....

Published : 20 Jan 2018 02:22 IST

మనసులో మాట
ప్లీజ్‌..నన్ను మరిచిపో..!

నా పేరు అవినాష్‌ (అసలు పేరు కాదు). మాది కరీంనగర్‌లోని ఓ పల్లెటూరు. పీజీ పూర్తయింది. ప్రభుత్వ ఉద్యోగ వేటలో ఉన్నానప్పుడు. మా ఊళ్లోనే స్నేహ (పేరు మార్చాం) అనే అమ్మాయి ఉండేది. సొంతూర్లో స్నేహితులయ్యాం. స్నేహ వాళ్ల అన్నయ్య కూడా నాకు మంచి ఫ్రెండ్‌. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఆ ప్రేమను వ్యక్తపరచడానికి ఏడాది పట్టింది. అది జులై మాసం. ఒక రోజు మెసేజ్‌ వచ్చింది. అందులో ‘ఐ లవ్‌ యు అవినాష్‌. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. అయినా సరే ఇన్ని రోజులు చెప్పలేకపోయాను..’ అని చెప్పింది. నేను వెంటనే రిప్లై ఇచ్చాను. అందులో ‘స్నేహ.. మీ అన్నయ్య నాకు మంచి స్నేహితుడు. మనిద్దరిదీ ఒకే కులం కాదు. పెద్దలు ఒప్పుకోరు. గొడవలు అవుతాయి. ప్రేమ పెళ్లి సాధ్యం కాదేమో’’నని మెసేజ్‌ పంపించాను. మళ్లీ తనే ‘నువ్వంటే నాకు ప్రాణం. ఎలాగోలా మా అన్నయ్యకు చెప్పి ఒప్పించు. తల్లిదండ్రులకు కూడా అన్నయ్యే సర్దిచెబుతాడు. మనం పెళ్లి చేసుకునే తీరాలి’ అంది. ఆ మెసేజ్‌లు చూసేసరికి.. నా మనసులోనూ ప్రేమ భావన బలంగా నాటుకుంది. ఆలోచనలో పడ్డాను. ఆమె మీద ఇష్టం రెట్టింపు అయ్యింది. తను డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌. పీజీ పూర్తయ్యాక ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. నాలుగేళ్లు సంతోషంగా సాగిపోయింది మా ప్రేమ. ఎక్కడున్నా పూలవనంలో ఉన్నట్లు ఉండేది. మాఇద్దరి మధ్య నడిచిన మాటలు కొలిస్తే... ఆకాశంలో నక్షత్రాలు సరిపోవేమో. హాయిగా సాగిపోతున్న మా ప్రేమ నావను ఓ అల కుదిపేసింది. గత ఏడాది తనకు పెళ్లి సంబంధం కుదిరింది. తను విషయం చెప్పి.. ఏడ్చింది. అదే రోజు వాళ్ల అన్నయ్యకు ఫోన్‌ చేసి.. మా ప్రేమ విషయాన్ని చెప్పాను. అప్పుడు వాళ్ల అన్నయ్య ‘మా ఇంట్లో కులాంతర వివాహం ఒప్పుకోరు. నువ్వు మా చెల్లిని మరిచిపో. లేదంటే నేను బతకను. మన స్నేహం ఇంతటితో తెగిపోతుంది’ అన్నాడు. మా ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పి.. ఒప్పించాను. స్నేహ వాళ్ల అన్నయ్యకు చాలాసార్లు ఫోన్లు చేసి.. బతిమాలాను. కానీ ప్రయోజనం లేదు. ఆ అలే మా ప్రేమ నావను ముంచెత్తే ఉప్పెనైంది. స్నేహతో ‘మా ఇంట్లో అమ్మానాన్నలు ఒకే. మీ ఇంట్లో అంగీకరించకపోయినా బయటికి వెళ్లిపోయి.. గుడిలో పెళ్లి చేసుకుందాం..’ అన్నాను. ‘వద్దు వద్దు.. మా అన్నయ్యను ఎలాగైనా కన్విన్స్‌ చేసి పెళ్లి చేసుకుందాం..’ అంది. రోజులు గడిచాయి. ఆ టెన్షన్‌ను భరించలేకపోయాను. ఎంగేజ్‌మెంట్‌ రోజున తన నుంచి మెసేజ్‌ వచ్చింది. ఫోన్‌లో ఏడ్చింది. ఆ విషయాన్నే వాళ్ల అన్నకు చెప్పాను. అతను ‘మాకు కులమే ముఖ్యం. నేనేమీ చేయలేను’ అన్నాడు. పెళ్లి రోజు కూడా ఫోన్‌ చేసి.. కన్నీళ్లు పెట్టుకుందామె. పెళ్లి జరిగిపోయింది. ‘నన్ను మరిచిపో. నువ్వు హ్యాపీగా ఉండు’ అని ఆఖరి మెసేజ్‌ పెట్టింది స్నేహ. తను లేని జీవితం నేను ఊహించుకోలేకపోతున్నాను. నాకు నేను నచ్చజెప్పుకొంటున్నాను. ఈ కుల జాడ్యం ప్రేమను ఓడించే రోజులు ఎప్పుడుపోతాయి?

- అవినాష్‌, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని