Gurpatwant Singh Pannun: పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్‌ రిపబ్లిక్‌ కోర్టు..!

గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర కేసులో అమెరికా వేగానికి చెక్‌ రిపబ్లిక్‌ కోర్టు బ్రేకులు వేసింది.  

Published : 07 May 2024 10:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఖలిస్థానీ ఉగ్రవాది, సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్ర కేసులో అమెరికా దర్యాప్తు సంస్థల ఉత్సాహానికి చెక్‌ రిపబ్లిక్‌లో బ్రేకులు పడ్డాయి. ఈ కేసులో నిందితుడు భారతీయుడు నిఖిల్‌ గుప్తాను వాషింగ్టన్‌కు అప్పగించే విషయమై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. అతడి అప్పగింతలో జాప్యం జరిగితే ప్రజాప్రయోజనాలేవీ దెబ్బతినవని వ్యాఖ్యానించింది. దీంతో న్యాయస్థానం ఈ అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే వరకు ఏమీ చేయలేమని ఆ దేశ జస్టిస్‌ మినిస్టర్‌ మార్కెటా ఆండ్రోవా భారత్‌కు చెందిన ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు.

19 జనవరి 2024లో తనను అమెరికాకు అప్పగించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ స్థానిక మున్సిపల్‌ కోర్టు, హైకోర్టు నిర్ణయాలను నిఖిల్‌ గుప్తా సవాలు చేశారు. ఆయన అత్యున్నత న్యాయస్థానంలో వీటిపై పిటిషన్‌ వేశారు. దీనిపై జనవరి 30 కోర్టు స్పందిస్తూ.. అమెరికా క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ వల్ల అందరికన్నా ఎక్కువగా నిఖిల్‌ గుప్తాకే నష్టం చేకూరుస్తుందని వ్యాఖ్యానించింది. ఆ తర్వాత గుప్తా పిటిషన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. ఆ నష్టాన్ని పూడ్చలేమని పేర్కొంది.

దీనిపై చెక్‌రిపబ్లిక్‌ అధికారులు స్పందిస్తూ..‘‘కింది కోర్టు నిర్ణయాలను సస్పెండ్‌ చేయడం అంటే.. అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో నిజానిజాలపై దృష్టిపెట్టిందని అర్థం. అది ఓ నిర్ణయానికి వచ్చే వరకు ఫిర్యాదుదారుడి ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా అడ్డుకొంటుంది’’ అని పేర్కొన్నారు. దీంతో పాటు ఈ అంశానికి సంబంధించి ఎటువంటి కాలపరిమితి లేదని ఆ దేశ జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. కేసులోని సంక్లిష్టతలు, న్యాయస్థానంపై పనిభారం అంశంపై ఇది ఆధారపడి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ కాల పరిమితిని అంచనావేయడం కష్టమవుతుందని పేర్కొన్నారు. 

చెక్‌ రిపబ్లిక్‌- అమెరికా మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌ అభ్యర్థన మేరకు గతేడాది జూన్‌ 30న ప్రాగ్‌లోకి అడుగుపెట్టిన నిఖిల్‌ గుప్తాను అక్కడి అధికారులు బంధించారు. అమెరికా పౌరుడు పన్నూ హత్యకు అతడు కిరాయి హంతకులను సిద్ధం చేసేందుకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానిక అధికారులు నిఖిల్‌ గుప్తా విషయంలో మానవ హక్కులను ఉల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి.  

భారత దర్యాప్తు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం: అమెరికా

పన్నూ హత్యకు కుట్ర కేసులో భారత్‌ చేపట్టిన దర్యాప్తు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. దీనిపై ఆ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ తన రోజువారీ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘‘వారు (భారత్‌) ఈ అంశంపై ఓ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది పనిచేస్తోంది. మేము దాని ఫలితాలు వచ్చే వరకు ఎదురు చూస్తాం. ఈ విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నామని మాత్రం స్పష్టంగా చెప్పగలను. వారు కూడా అలానే భావిస్తారని ఆశిస్తున్నాను. ఇక కెనడాలోని అంశాలపై అక్కడి అధికారులతో మాట్లాడాలని మీకు సూచిస్తాను. కేవలం ఇక్కడి విషయాలపైనే డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ అధికారులను అడగండి. నేను విదేశాంగ శాఖ పక్షాన మాత్రమే మాట్లాడతాను’’ అని సమాధానం ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని