Arya: ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్‌ను ఫైనల్‌ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..

అల్లు అర్జున్‌ హీరోగా డైరెక్టర్‌ సుకుమార్‌ తెరకెక్కించిన ‘ఆర్య’కు 20 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర సంగతులు మీ కోసం..

Published : 07 May 2024 10:01 IST

2004 మే 7.. ఇప్పటిలానే అప్పుడూ ఎండలు మండిపోతున్నాయి. స్కూళ్లూ కాలేజీలకు సెలవులిచ్చేశారు. ఓటీటీలు లేవు కాబట్టి ఇక వినోదమంటే థియేటర్లే. అలా ఆ రోజు విడుదలైన సినిమాల్లో ‘ఆర్య’ (Arya) ఒకటి. మార్నింగ్‌ షో డివైడ్‌ టాక్‌. ‘వన్‌సైడ్‌ లవ్‌’ కాన్సెప్ట్‌ కావడంతో ప్రేక్షకులూ వన్‌సైడ్‌ రిజల్ట్‌ ఇవ్వలేకపోయారు. కట్‌చేస్తే 125 రోజులు ప్రదర్శితమై, టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేసింది. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. అసలు ఈ కథ దర్శకుడు సుకుమార్‌ ఎవరి కోసం రాశారు? ముందుగా అనుకున్న టైటిలేంటి? చూద్దాం (#20 Years of Arya)..

‘దిల్‌’ సక్సెస్‌ సుకుమార్‌కు ప్లస్‌

కాకినాడలోని ఓ కాలేజీలో మ్యాథ్స్‌ లెక్చరర్‌గా పనిచేసే సుకుమార్‌కి (Sukumar) సినిమాలపై ఎంతో ఆసక్తి. ఆ ఇష్టంతోనే ఇండస్ట్రీలోకి వెళ్లి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవకాశం అందుకున్నారు. ఆ పని చేస్తూనే తనో కథ రాసుకున్నారు. అదే సమయంలో రాజు నిర్మాతగా, వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దిల్‌’కీ డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో వర్క్‌ చేశారు. ‘దిల్‌ సక్సెస్‌ అయితే నీకు డైరెక్షన్‌ ఛాన్స్‌ ఇస్తా. కథ సిద్ధం చేసుకో’ అని రాజు మాటిచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు రాజుని ‘దిల్‌ రాజు’ (Dil Raju)గా మార్చేసింది. ఆ విజయోత్సాహంలో ఉన్న ఆయన సుకుమార్‌ చెప్పిన కథ విన్నారు. ‘బాగుంది గానీ కమర్షియల్‌గా హిట్‌ కాదేమో’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. పలు చర్చల అనంతరం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

‘నచికేత’ అనుకున్నారు..

‘దిల్‌’ స్పెషల్‌ షోకి అల్లు అర్జున్‌ (Allu Arjun) కూడా వెళ్లారు. అతని చలాకీతనం, హాస్య చతురత చూసిన సుకుమార్‌ ‘నా హీరోలాంటి క్యారెక్టరే ఇతనిది’ అని అనుకున్నారు. మనసులో మాట దిల్‌ రాజుకి చెబితే ఆయన వెంటనే వెళ్లి అర్జున్‌తో మాట్లాడారు. ‘గంగోత్రి’ తర్వాత ఎన్నో కథలు విని విసిగిపోయిన ఆయన.. వీళ్లు చెప్పేదీ రొటీన్‌ స్టోరీనే అనుకుని వద్దన్నారు. ఎట్టకేలకు విన్నాక అదుర్స్‌ అన్నారు. అల్లు అరవింద్‌, చిరంజీవి సైతం ప్రాజెక్టుకు ఎస్‌ చెప్పారు. ఈ ట్రెండీ లవ్‌స్టోరీకి ‘నచికేత’ అని టైటిల్‌ పెట్టాలనుకున్నా చివరకు ‘ఆర్య’ని ఫిక్స్‌ చేశారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేయడమే కాదు.. ఓ సీన్‌లోనూ కనిపిస్తారు.

ఎక్కడా విన్నా అమలాపురం.. ఆహాపురమే!

2003 నవంబరు 19న సినిమా లాంఛనంగా ప్రారంభమైన ‘ఆర్య’ను 120 రోజుల్లో పూర్తి చేశారు. దేవిశ్రీ ప్రసాద్‌, సుకుమార్‌ కాంబో మొదలైందీ ఈ చిత్రంతోనే. ఇప్పటివరకూ వారి ఆల్బమ్స్‌ అన్నీ సూపర్‌ హిట్సే. ‘ఫీల్‌ మై లవ్‌’ అంటూ ప్రతి ప్రేమికుడు ఆ ప్రేమను ఫీలయ్యాడు.. ‘తకదిమితోం’ అంటూ చిందులు తొక్కాడు.. ‘అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం’ అంటూ అక్షరమాలకు కొత్త అర్థం చెప్పి, చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనూ ఆడించారు.. పాడించారు. ఈ మూవీని రూ.4 కోట్లతో నిర్మిస్తే, ఫుల్‌ రన్‌లో రూ.30 కోట్లు వసూలు చేసింది. మలయాళంలో డబ్‌ చేసి విడుదల చేస్తే.. రూ.35 లక్షల వరకూ వసూలు చేయడమే కాదు, అల్లు అర్జున్‌కు అక్కడ అభిమానగణమే ఏర్పడేలా చేసింది. ఉత్తమ దర్శకుడిగా తొలి చిత్రంతోనే సుకుమార్‌ ఫిల్మ్‌ఫేర్‌ అందుకున్నారు. ఇక ఉత్తమ స్క్రీన్‌ప్లే (సుకుమార్‌), స్పెషల్‌ జ్యూరీ (అల్లు అర్జున్‌), ఉత్తమ ఫైట్స్‌ (రామ్‌- లక్ష్మణ్‌), ఉత్తమ గాయకుడు (సాగర్‌) కేటగిరీల్లో నంది అవార్డులు లభించాయి. ‘ఆర్య’ తర్వాత అర్జున్‌- సుకుమార్‌- దేవీశ్రీ ప్రసాద్‌ కాంబినేషన్‌లో ‘ఆర్య 2’, ‘పుష్ప’ వచ్చాయి. ‘పుష్ప 2’ ఆగస్టు 15న విడుదల కానుంది.

అల్లరి నరేశ్‌ కోసం..

బాక్సాఫీస్‌ వద్ద ఇంత సక్సెస్‌ అయిన ఈ మూవీకి తొలుత అనుకున్న కథానాయకుడు ఎవరో తెలుసా? అల్లరి నరేశ్‌ (Allari Naresh). ఆయనను దృష్టిలో పెట్టుకుని సుకుమార్‌ ఈ కథను రాసుకున్నారట. ఏమైందో ఏమోగానీ అది ఆయన వరకూ వెళ్లలేదు. ఓ ఇంటర్వ్యూలో నరేశ్‌ మాట్లాడుతూ.. ‘‘సుకుమార్‌ ‘100%లవ్‌’ సినిమా తీస్తున్న సమయంలో నన్ను కలిశారు. ‘‘అల్లరి’లోని మీ నటన నన్ను ఆకట్టుకుంది. ‘ఆర్య’ కథ మీ కోసం రాసుకున్నా’’ అని చెప్పారు. ఎవరికి రాసి పెట్టి ఉన్న కథ వారి వద్దకే వెళ్తుంది. ఆయన దృష్టిలో పడ్డానంటే నటుడిగా నేనేదో చేస్తున్నట్లే లెక్క. ఆర్యగా అల్లు అర్జున్‌ కంటే బాగా ఎవరూ చేయలేరు’’ అని ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు