...అలాగైతేనే ప్రేమించండి

తూర్పుగోదావరి జిల్లా నాది. ప్రకాశం జిల్లాలో డీఈడీ చేయడానికి వెళ్లాను. అక్కడ సార్‌ తొలిరోజు అందరినీ పరిచయం చేసుకొమ్మని చెప్పారు. ఆ ప్రక్రియ సాగుతుండగా ఒక మధురమైన గొంతు ‘మే ఐ కమ్‌ ఇన్‌ సార్‌’ అంటూ అందరి చెవులనూ పలకరించింది

Published : 24 Feb 2018 01:38 IST

...అలాగైతేనే ప్రేమించండి
మనసులో మాట

తూర్పుగోదావరి జిల్లా నాది. ప్రకాశం జిల్లాలో డీఈడీ చేయడానికి వెళ్లాను. అక్కడ సార్‌ తొలిరోజు అందరినీ పరిచయం చేసుకొమ్మని చెప్పారు. ఆ ప్రక్రియ సాగుతుండగా ఒక మధురమైన గొంతు ‘మే ఐ కమ్‌ ఇన్‌ సార్‌’ అంటూ అందరి చెవులనూ పలకరించింది. ఆ శ్రావ్యమైన స్వరం విని గుమ్మం వైపు తలతిప్పని వారుంటే ఒట్టు. ఎవరీ అమ్మాయి అని చూడాలనుకున్న వారందరి ఆశలు అడియాశలయ్యాయి. ఆ అమ్మాయి ముఖానికి స్కార్ప్‌ కట్టుకొని వచ్చింది. నేను ఆ స్వరానికి ఫిదా అయిపోయాను. తన పేరు అయిషా. కొన్ని రోజులకు పరిచయం అయ్యింది. తన డ్రెస్‌, గాజులు, రింగులు ఇలా అన్నీ నాకు నచ్చేవి. తన మాటలు నన్ను వెంటాడేవి. తనంటే చాలా ఇష్టం ఏర్పడిపోయింది. మొదట స్నేహితులుగా దగ్గరయ్యాం. తర్వాత నా మనసులో మాట చెప్పాను. ఆమె ఇష్టాన్నీ చెప్పేసింది. ఇద్దరం బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి అప్పుడు ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అవుట్‌డోర్స్‌  టీచింగ్‌, ప్రాజెక్టు వర్క్స్‌... అంటూ మేం కలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉండేది. ప్రేమలో ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలైనా క్షణాల్లా గడిచిపోతాయి. ఇలా టీచర్‌ ట్రైనింగ్‌ రెండేళ్లు రెండు వసంతాల్లా కరిగిపోయాయి. ఇంతలో డీఎస్సీ-2014 నోటిఫికేషన్‌ వచ్చింది. ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని విజయవాడకు కోచింగ్‌ వెళ్లాను. రోజూ ఫోన్లో మాట్లాడుకునే వాళ్లం. డీఎస్సీలో పోస్టు సాధించలేకపోయాను. నా కలలు చెదిరిపోయాయి. జీవనం గడవడానికి ఒక పత్రికలో విలేకరిగా చేరాను. తనకు ఇంట్లో వేరే సంబంధం చూస్తున్నారని ఒకసారి తను చెప్పింది. ఏంకాదులే అని నేను ధైర్యం చెప్పాను. ఇంతలో అమ్మకు గుండె నొప్పి వచ్చింది. హాస్పిటల్‌ స్టంట్‌ వేయించాల్సి వచ్చింది. ఇలా వారం రోజులు అక్కడే ఉండిపోయాను. ఆ రోజు తను ఫోన్‌ చేసింది... ‘‘నువ్వు లేకుండా బతకలేను. ఇంట్లో నాకు వేరే పెళ్లి చేస్తున్నార’’ని ఏడ్చింది. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే తనకు సంబంధం వచ్చిన అబ్బాయి వాళ్ల ఫోన్‌ నంబర్‌ తీసుకొని మా ప్రేమ విషయం చెప్పాను. ఇక తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా ఎత్తడం లేదు. తన నుంచి కాల్‌ లేదు. నేను హాస్పిటల్‌ నుంచి అమ్మను తీసుకొని ఇంటికి వచ్చి... తన కోసం వాళ్ల ఊరెళ్లాను. వాళ్లంటికి తాళం వేసింది. తను ఆచూకి గురించి తన ఫ్రెండ్స్‌ అందరినీ అడిగాను. తెలియదన్నారు. తన అడ్రెస్‌ కోసం వెదకని ప్రదేశమంటూ లేదు. మూడేళ్లవుతోంది. తన ధ్యాసలోనే ఉండిపోయాను. తన కోసం ఎదురుచూసే నా కళ్లలో తడి ఆరిపోవడం లేదు. తనని తలవని క్షణం లేదు. ఉద్యోగం సాధించలేక, సరైన సమయానికి సరిగ్గా స్పందించలేక ప్రేమలో ఓడిపోయాను. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని పోగొట్టుకున్నాను. ప్రేమిస్తే సరిపోదు... దాన్ని దక్కించుకొనే ధైర్యం, సాహసం చేయగలగాలి. అప్పుడే ప్రేమించండి.

- రాజు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని