Vijayawada: చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో మావయ్య నిర్దోషి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Nov 2025 05:55 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

దిగువ కోర్టు తీర్పును పాక్షికంగా సవరించిన హైకోర్టు
మొదటి, రెండో దోషులకు జీవిత ఖైదు సమర్థన 

ఈనాడు, అమరావతి: ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి అపహరణ, హత్య కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు పాక్షికంగా సవరించింది. మొదటి దోషి మోర్ల శ్రీనివాసరావు, రెండో దోషి యంపరాల జగదీష్‌కు కింది కోర్టు విధించిన జీవిత ఖైదును సమర్థించింది. వారిరువురి అప్పీళ్లను కొట్టేసింది. మూడో నిందితుడు, నాగ వైష్ణవికి వరసకు మావయ్య అయిన పంది వెంకటరావు అలియాస్‌ కృష్ణ (ఏ3)ను నిర్దోషిగా ప్రకటించింది. అతడికి విజయవాడ కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి, జస్టిస్‌ ఎస్‌.సుబ్బారెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 

  • విజయవాడకు చెందిన పలగాని ప్రభాకరరావు తన మేనకోడలిని వివాహం చేసుకున్నారు. పిల్లలు పుట్టి చనిపోతుండటంతో నిజామాబాద్‌కు చెందిన నర్మదాదేవిని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె నాగవైష్ణవి జన్మించారు. నాగవైష్ణవి పుట్టాక ప్రభాకరరావు వ్యాపారం వృద్ధి చెందింది. ఆ పాపపై ఆయన మమకారం పెంచుకున్నారు. ఇది మొదటి భార్య కుటుంబంలో విభేదాలకు కారణమైంది. ప్రభాకరరావు మొదటి భార్య సోదరుడు పంది వెంకటరావు బావపై కక్ష పెంచుకున్నాడు. ఆస్తి అంతా రెండో భార్య పిల్లల పేరిట రాసేస్తారని అనుమానించాడు. నాగవైష్ణవిని హతమారిస్తే తప్ప తన అక్క కాపురం బాగుపడదని భావించాడు. ఆ చిన్నారి హత్యకు తన బంధువైన మోర్ల శ్రీనివాసరావుతో రూ.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. శ్రీనివాసరావు తన వద్ద పనిచేసే జగదీష్‌ సాయం తీసుకున్నాడు. 
  • 2010 జనవరి 30న నాగవైష్ణవి సోదరుడు తేజేష్‌గౌడ్‌తో కలిసి ఇంటి నుంచి కారులో బయలుదేరింది. ఇది గమనించిన శ్రీనివాసరావు, జగదీష్‌.. దారిలో వెనుక నుంచి వారి కారుపై రాళ్లతో దాడి చేశారు. డ్రైవర్‌ లక్ష్మణరావు కారు దిగి పరిశీలిస్తుండగా అతడిని కత్తులతో పొడిచారు. దీంతో భయపడిన చిన్నారి తేజ్‌ష్‌గౌడ్‌ కారులోంచి దూకి పారిపోయాడు. కత్తిపోట్లకు గురైన డ్రైవర్‌ను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే కన్నుమూశాడు. 
  • నాగవైష్ణవిని అపహరించిన నిందితులు గుంటూరు జిల్లా తాడేపల్లిలో మరో కారులోకి మారారు. చిన్నారి కేకలు వేస్తుండటంతో గొంతునొక్కారు. దీంతో వైష్ణవి కారులోనే చనిపోయింది. ఒక ప్లాస్టిక్‌ డ్రమ్ము కొని మృతదేహాన్ని అందులో వేసిన నిందితులు.. గుంటూరు శివారు ఆటోనగర్‌లోని శారదా ఇండస్ట్రీస్‌కు తీసుకెళ్లారు. ఆ డ్రమ్మును విద్యుత్‌ కొలిమిలో వేసి అధిక ఉష్ణోగ్రత వద్ద బూడిద చేసేశారు. తన కుమార్తె హత్య విషయం తెలిసిన ప్రభాకరరావు వెంటనే గుండె ఆగి మరణించగా.. కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే నాగవైష్ణవి తల్లి కన్నుమూశారు. బీ నాగవైష్ణవి హత్య ఘటనపై విచారణ జరిపిన విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు.. ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ 2018 జూన్‌ 14న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ దోషులు హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు వేశారు. తాజాగా జరిగిన తుది విచారణలో మూడో నిందితుడు పంది వెంకటరావు తరఫున న్యాయవాది ఎన్‌.రవిప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈ హత్యలో వెంకటరావు పాత్ర ఉన్నట్లు సాక్ష్యాలు, ఆధారాలు లేవని వాదించారు. అతనిని నిర్దోషిగా ప్రకటించాలని కోరారు. ఆ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు