Jogi ramesh: నెల్లూరు జైలుకు మాజీ మంత్రి జోగి రమేష్‌

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 04 Nov 2025 05:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఆయన సోదరుడు రాము కూడా అదే జైల్లో
తొలుత ఎక్సైజ్‌ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
ఇద్దరూ మద్యం సిండికేట్‌ నడిపారన్న ఏపీపీ
అర్ధరాత్రి తర్వాత సుదీర్ఘంగా సాగిన వాదనలు 
జోగి సోదరులకు 13 వరకు రిమాండ్‌
తెల్లవారుజామున న్యాయాధికారి ఉత్తర్వులు 
నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలింపు

నెల్లూరు సెంట్రల్‌ జైల్లోకి వెళ్తున్న జోగి రమేష్‌ 

ఈనాడు, అమరావతి: నకిలీ మద్యం కేసులో వైకాపా నేత, మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు రాములకు కోర్టు రిమాండ్‌ విధించడంతో పోలీసులు వారిద్దరినీ నెల్లూరు జైలుకు తరలించారు. జైలు అధికారులు రమేష్‌కు ఖైదీ నంబర్‌ 7177, రాముకు ఖైదీ నంబర్‌ 7178 కేటాయించారు. గతనెల ఇబ్రహీంపట్నంలో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసులో వీరిద్దరినీ ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం రాత్రి విజయవాడలోని ఎక్సైజ్‌ కోర్టులో హాజరుపరిచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కోర్టులో వాదనలు ప్రారంభమై సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల వరకు సాగాయి. దీనిపై ఉదయం 5 గంటలకు న్యాయాధికారి లెనిన్‌బాబు ఉత్తర్వులిచ్చారు.  

ఈనెల 13 వరకు రిమాండ్‌ విధించారు. నిందితులను నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతో వారిని మొదట విజయవాడలోని జిల్లా జైలుకు తీసుకువెళ్లిన అనంతరం నెల్లూరు సెంట్రల్‌ జైలుకు తరలించారు.

జనార్దన్‌రావు నుంచి జోగికి ముడుపులు

వైకాపా హయాంలో ఎన్డీపీఎల్‌ మద్యం అమ్మకాలకు సహాయ, సహకారాలు అందజేసినందుకు జోగి సోదరులకు ప్రధాన నిందితులు జనార్దన్‌రావు, జగన్మోహన్‌రావుల నుంచి ముడుపులు ముట్టాయని ఏపీపీ విజయలక్ష్మి కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల మధ్య ఎప్పటి నుంచో సంబంధాలు ఉన్నాయన్నారు. వీరు మొదట ఇబ్రహీంపట్నంలో సమీప బంధువైన బొల్లా శ్రీనివాస్‌ పేరిట స్వర్ణ బార్‌ను ప్రారంభించారని, తర్వాత దీని పేరును చెర్రీస్‌ బార్‌గా మార్చారని పేర్కొన్నారు. మద్యం సిండికేట్‌ ద్వారా దీనిని 2019 వరకు జోగి రమేష్, రాములు భాగస్వాములుగా నడిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత కొన్నాళ్లపాటు బార్‌ నిర్వహణ నిలిపేశారు.

సాక్షులను ప్రభావితం చేస్తారు..: వైకాపా ప్రభుత్వ హయాంలో ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో జనార్దన్‌రావు, జగన్మోహన్‌రావులు హైదరాబాద్‌లో మద్యం కొని, క్యాన్లలో నింపి ఇబ్రహీంపట్నం తరలించేవారని, ఇక్కడ సీసాల్లోకి నింపి అమ్మకాలు సాగించారని తెలిపారు. దీనికి సహాయ సహకారాలు అందించినందుకు జోగి సోదరులకు రెండు, మూడు నెలలకోసారి రూ.3-5 లక్షల వరకు ముడుపులు చెల్లించేవారని అన్నారు. ఇదే క్రమంలో జోగి సోదరుల ప్రోద్బలంతో ప్రధాన నిందితులు నకిలీ మద్యం తయారీని ప్రారంభించారని తెలిపారు. మరింత లోతుగా విచారించాల్సి ఉందని ఏపీపీ విజయలక్ష్మి వాదనలు వినిపించారు. వారికి రిమాండ్‌ విధించాలని లేనిపక్షంలో సాక్షులను ప్రభావితం చేస్తారని అభ్యర్థించారు. 

సీబీఐ విచారణ కోరారు

నకిలీ మద్యం వ్యవహారంపై వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో విచారణ చేయించాలని జోగి రమేష్‌ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేశారని ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. జోగిపై అక్రమంగా కేసు నమోదు చేశారని అన్నారు. సహ నిందితుల స్టేట్‌మెంట్ల ఆధారంగా జోగి సోదరులను అరెస్టు చేయడం తగదన్నారు. ఇలాగైతే సంబంధం లేని ఎవరినైనా నిందితులుగా చేర్చే అవకాశం ఉంటుందన్నారు.  

  • ప్రాసిక్యూషన్‌ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయాధికారి లెనిన్‌ బాబు.. నిందితులు జోగి రమేష్, జోగి రాములకు రిమాండ్‌ విధించారు. 
  • జోగి సోదరులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అరెస్టు చేసిన తర్వాత.. ఆదివారం సుదీర్ఘంగా విచారించినా జోగి రమేష్, రాము సహకరించలేదని, మరింత లోతుగా విచారించాల్సి ఉందని తెలిపారు. దీనిపై ప్రాసిక్యూషన్‌ కౌంటర్‌ దాఖలుకు వీలుగా కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. 

జోగి సోదరులకు కాకాణి భరోసా

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: జోగి రమేష్, రాములను సోమవారం రాత్రి 7.40 గంటలకు నెల్లూరు కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. వారిద్దరికీ న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధించడంతో విజయవాడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరుకు తీసుకువచ్చారు. జైలు అధికారులు వారికి ఖైదీ నంబర్లు 7177, 7178 కేటాయించారు. జైలు వద్ద మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి వారిని కలిశారు. అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని కాకాణి జోగి రమేష్‌కు భరోసా ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు