తుపానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ప్రభుత్వం అండగా నిలిచిందన్న సంతృప్తి బాధితుల్లో కలగాలి
తీర ప్రాంత గ్రామాల రక్షణకు బృహత్‌ ప్రణాళిక
తుపాను అనంతర పరిస్థితులపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్

మొంథా తుపాను ప్రభావం.. ప్రస్తుత పరిస్థితులపై సమీక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం బాధితులందరికీ అందేలా చూడాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన అన్నారు. తుపాను అనంతర పరిస్థితులపై మంగళగిరిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కాకినాడ కలెక్టర్, ఎస్పీ, డీఆర్‌వో, ఆర్డీవో, పడా ప్రాజెక్టు డైరెక్టర్, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాలు, విద్యుత్తు, వ్యవసాయశాఖల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలో తుపాను కారణంగా జరిగిన నష్టాలపై ఆరా తీశారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిధిలో మొత్తం 21 మండలాలు, ఏడు పురపాలక సంఘాలు తుపానుకు ప్రభావితమైనట్లు కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.

రక్షణ గోడ పూర్తయ్యేవరకు తాత్కాలిక చర్యలు

‘ఉప్పాడ తీర ప్రాంతంలోని సుబ్బంపేట వద్ద సముద్ర కోత నుంచి రక్షణకు రాళ్లతో తాత్కాలిక రక్షణ గోడ ఏర్పాటు చేశాం. ఇది సముద్రపు కోతను నిలువరించింది. మిగిలిన తీర ప్రాంత గ్రామాలకు కూడా రాళ్ల గోడ నిర్మించేలా చర్యలు తీసుకుంటాం. శాశ్వత రక్షణ గోడ నిర్మాణం పూర్తయ్యే వరకు ఇది తీర ప్రాంత గ్రామాలకు రక్షణ కల్పిస్తుంది. ఈ గ్రామాల రక్షణకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టాలి. ఏలేరు కాలువల గొర్రెకండె గట్టు బలహీనంగా ఉన్న చోట యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. మల్లవరం ప్రాంతంలో తుపాను కారణంగా నష్టపోయిన పత్తి రైతులకు న్యాయం జరిగేలా చూడాలి’ అని పవన్‌కల్యాణ్‌ కోరారు. పిఠాపురం నియోజకవర్గంలో కోతకు గురవుతున్న ఉప్పాడ, మూలపేట, కోనపాపపేట, అమీనాబాద్, సుబ్బంపేటల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయని అధికారుల ద్వారా ఉప ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. పిఠాపురం పట్టణ పరిధిలోని కరివేపాకుపేట ప్రాంతం వద్ద పల్లపు ప్రాంతంలో నిలిచిఉన్న నీటిని తక్షణమే బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.


రైతుల పక్షాన నిలవాలి

‘కష్టకాలంలో ప్రభుత్వం తోడుగా నిలిచిందన్న సంతృప్తి రైతుల్లో కలిగేలా చర్యలు ఉండాలి. నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రభుత్వం నుంచి పరిహారం అందాలి. పంట నష్టం అంచనాలు రూపొందించే సమయంలో రైతుల పక్షాన నిలిచి పక్కాగా నివేదికలు రూపొందించాలి. ఆస్తి నష్టం వివరాలు కూడా సిద్ధం చేయాలి. దెబ్బతిన్న ఇళ్లకు తక్షణమే పరిహారం చెల్లించే ఏర్పాట్లు చేయాలి. గ్రామాల్లో పల్లపు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలి. పాక్షికంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి’ అని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు