Chandrababu: గూగుల్‌ డేటా సెంటర్‌ రావడంలో మోదీ చొరవ

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 16 Oct 2025 03:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కేంద్ర మంత్రులు నిర్మల, అశ్వినీ వైష్ణవ్‌ సహకరించారు
దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇది 
ప్రధాని పర్యటనతో శ్రీశైలానికి మహర్దశ
టెలికాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు 

పౌరసేవలు, ఆర్టీజీఎస్‌పై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు

ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి గూగుల్‌ డేటా హబ్‌ రావటంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్‌ల చొరవ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖలో గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టనుందని, ఇది దేశంలోనే అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని చెప్పారు. ప్రధాని మోదీ రాకతో శ్రీశైల క్షేత్రానికి మహర్దశ రాబోతోందని... తిరుమల తరహాలో ఈ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. గురువారం రాష్ట్రంలో మోదీ పర్యటించనున్న నేపథ్యంలో మంత్రులు, ఉమ్మడి కర్నూలు జిల్లా కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు బుధవారం మాట్లాడారు. మోదీ పర్యటన, ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ‘రూ.13 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. కేంద్ర సహకారంతో అనేక పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రానికి లాభం చేకూరుతోంది. 1998లో మైక్రోసాఫ్ట్‌ రాకతో హైదరాబాద్‌లో ఐటీ ఎకో సిస్టం ఏర్పడి.. నాలెడ్జ్‌ ఎకానమీకి పునాది పడింది. గూగుల్‌ విశాఖ రావడంలో విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ ప్రధాన పాత్ర పోషించారు. గూగుల్‌ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరిపి, రాష్ట్రానికి వచ్చేలా చేశారు’ అని చంద్రబాబు వివరించారు. 

‘మోడల్‌ స్టేట్‌’గా నిలపాలి 

కూటమి నేతలంతా కలిసి ఓ మోడల్‌ స్టేట్‌గా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్నూలు సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.15 వేల వరకు ఆదా అవుతుందని చెప్పారు. గూగుల్‌ సంస్థను ఏపీకి తీసుకురావడంలో చంద్రబాబు, లోకేశ్‌ల కృషిని ఈ సందర్భంగా నేతలు ప్రశంసించారు. 


వైకాపా తప్పులు సరిచేయడానికే చాలా సమయం 

విభజనతో ఎదుర్కొన్న ఇబ్బందుల కంటే వైకాపా పాలకుల విధ్వంసంతోనే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందని చంద్రబాబు గుర్తుచేశారు. ‘పాలనాపరంగా వారు అనేక తప్పులు చేశారు. వాటిని సరిచేయడానికే చాలా సమయం పట్టింది. వైకాపా ప్రభుత్వం రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు ఐదేళ్లలో కనీసం రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదు. కానీ మనం సీమకు నీళ్లివ్వడంతోపాటు పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం. పర్యాటకానికి గమ్యస్థానంగా మారుస్తాం. తిరుపతి, శ్రీశైలం, గండికోట లాంటి పర్యాటక ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తున్నాం’ అని వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు