రాష్ట్రంలో ఇదేనా పారిశ్రామికాభివృద్ధి?

వైకాపా ప్రభుత్వం వచ్చాక 2020-21 సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పెట్టుబడి రూ.1,034 కోట్లేనని, నిర్దేశిత లక్ష్యంలో 13శాతం మాత్రమే చేరుకోగలిగిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ వెల్లడించారు.

Updated : 19 Jan 2022 03:41 IST

తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజం

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వం వచ్చాక 2020-21 సంవత్సరంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పెట్టుబడి రూ.1,034 కోట్లేనని, నిర్దేశిత లక్ష్యంలో 13శాతం మాత్రమే చేరుకోగలిగిందని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ వెల్లడించారు. ‘2018-19లో ఎంఎస్‌ఎంఈలకు రూ.3,443 కోట్ల పెట్టుబడి రాగా.. 93,240 మందికి ఉపాధి లభించింది. లక్ష్యాన్ని మించి పెట్టుబడులు వచ్చాయి. 2020-21లో 23,141 మందికి మాత్రమే ఉద్యోగాలిచ్చారు. అంటే 2018-19తో పోల్చితే.. 70వేల ఉద్యోగాలు తగ్గాయి.. ఇదేనా పారిశ్రామికాభివృద్ధి...’ అని ఆయన నిలదీశారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో మంగళవారం పట్టాభి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘జగన్‌ ప్రభుత్వ అవినీతి కారణంగానే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావడం లేదు. వారు చెబుతున్న అభివృద్ధి అంతా ‘సాక్షి’లో రాతలకే పరిమితం...’ అని విమర్శించారు.

* ‘సాక్షి’ పత్రికలో పట్టిక వేసి మరీ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఏపీకి రూ.96,400 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చినట్లు, తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్‌జీసీ ద్వారా రూ.78వేల కోట్ల పెట్టుబడితో 75వేల మందికి ఉపాధి కల్పించబోతున్నట్లు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఘనత సాధించినట్లు రాసుకొచ్చారు. అయితే వాస్తవాలు ఏమిటో ఓఎన్‌జీసీ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. అందులో... ‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సింగిల్‌ విండో విధానంలో అనుమతులివవ్వడంతో.. ఆయిల్‌, గ్యాస్‌ వ్యాపారంలో ఆన్‌ షోర్‌ కార్యకలాపాలపై రూ.10వేల కోట్లు, ఆఫ్‌ షోర్‌ కింద సముద్రంలో రిగ్గుల ఏర్పాటుకు రూ.68వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు 2017 జనవరి 28న ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఓఎన్‌జీసీ పేర్కొంది. దీనిపై అప్పటి సీఎం చంద్రబాబు, కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌, ఓఎన్‌జీసీ సీఎండీ దినేశ్‌ షరాఫ్‌ సమక్షంలో ఒప్పందం కూడా జరిగిందని వివరించింది. దీన్నిబట్టే ‘సాక్షి’లో ఏ స్థాయిలో అబద్ధపు రాతలు రాస్తున్నారో, ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతోంది.

* నిన్నగాక మొన్న సీఎం గుంటూరులో రిబ్బన్‌ కట్‌ చేసిన ఐటీసీ హోటల్‌ కూడా చంద్రబాబు తెచ్చిందే. ఐటీసీని ఒప్పించి.. 2016 ఏప్రిల్‌ 29న దీనికి శంకుస్థాపన చేశారని పట్టాభి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని