Andhra News: అమరావతి నిర్మాణంపై కదలిక!

హైకోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి నిర్మాణ పనుల్లో కొంత కదలిక వచ్చింది. మూడొంతులు పూర్తయిన ఏఐఎస్‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది.

Published : 22 Mar 2022 07:14 IST

త్వరలో ఏఐఎస్‌, ఎమ్మెల్యే క్వార్టర్ల పనులు ప్రారంభం

ఈనాడు, అమరావతి: హైకోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి నిర్మాణ పనుల్లో కొంత కదలిక వచ్చింది. మూడొంతులు పూర్తయిన ఏఐఎస్‌, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస సముదాయాల నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. వీటిని ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇప్పటికే బ్యాంకుల కన్సార్షియం నుంచి ఓ విడత రుణం అందింది. మిగిలిన మొత్తం త్వరలో రానుంది. గుత్తేదారుకు ఒకటి, రెండు రోజుల్లో బకాయిలు చెల్లించనున్నారు. తక్కువ నిధులతో పూర్తయ్యే నిర్మాణాలపై తొలుత సీఆర్‌డీఏ దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా వీటి పనులను తిరిగి ప్రారంభించనుంది. పనులు తిరిగి ప్రారంభించాలని సీఆర్‌డీఏ నిర్ణయించినందున ఇప్పటికే తుది విడత రుణం కోసం కన్సార్షియంకు లేఖ రాశారు. రూ.200 కోట్లు ఇచ్చేందుకు కన్సార్షియం ముందుకొచ్చింది. ఇందులో ఇప్పటికే రూ.95 కోట్ల వరకు వచ్చాయి. ఈ మొత్తంలో నుంచి పెండింగ్‌ బిల్లులను చెల్లించనున్నారు. త్వరలో మిగిలిన రూ.105 కోట్లు అందనుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నిధులతో ప్రస్తుతం పనుల వేగం పెంచాలని నిర్ణయించారు. ఇచ్చే రుణం అఖిల భారత సర్వీసు అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లకే సరిపోతుంది. మిగిలిన టైప్‌ 1, 2, నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాల నిర్మాణాలు 65 శాతం పూర్తయ్యాయి. వీటి పనులు తిరిగి ప్రారంభించేందుకు మరో మార్గంలో రుణం కోసం సీఆర్‌డీఏ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని