చెరువు చేనైంది

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలంలో అక్రమార్కులు చెరువులనే కబ్జాచేశారు. అధికార పార్టీ నేతల భాగస్వామ్యంతో

Updated : 27 Jun 2022 06:54 IST

ప్రకాశం జిల్లాలో 90 ఎకరాల నీటి వనరులు అన్యాక్రాంతం

నకిలీ పత్రాలతో 20 ఎకరాలను విక్రయించిన వైకాపా నేత

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు; కొనకనమిట్ల, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని కొనకనమిట్ల మండలంలో అక్రమార్కులు చెరువులనే కబ్జాచేశారు. అధికార పార్టీ నేతల భాగస్వామ్యంతో తమ వశం చేసుకొని చుట్టూ కంచె వేసి మరీ విక్రయాలు చేస్తున్నారు. చినారికట్ల, పెదారికట్ల గ్రామాల్లోని రెండు చెరువులకు సంబంధించి 90 ఎకరాల భూమి అన్యాక్రాంతం కాగా అందులో 70 ఎకరాల్లో పంటలు వేసేశారు. మరో 20 ఎకరాలను ఇతరులకు విక్రయించేశారు. దీంతో ఈ చెరువు కింద 450 ఎకరాల ఆయకట్టుకు మున్ముందు నీరు ఎలా అందుతుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. చినారికట్లలో జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో.. సర్వేనంబర్లు 490, 491లో మొత్తం 70 ఎకరాల్లో చెరువు ఉంది. ఇందులో 30 ఎకరాలు చెరువు నేల కాగా, మిగతాది పోరంబోకు భూమి. ఇందులో ఇప్పటికే 20 ఎకరాలను స్థానిక వైకాపా నేత నకిలీ పత్రాలు సృష్టించి విడగొట్టి విక్రయించాడు. కొన్నవారు చుట్టూ కంచె వేసి ప్రస్తుతం ఆ భూమిలో జామాయిల్‌, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఇక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలో పెదారికట్ల గ్రామంలోని సర్వే నంబర్లు 22, 23లో 121 ఎకరాల విస్తీర్ణంలో మరో చెరువు ఉంది. ఇందులో దాదాపు 70 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఈ ప్రాంతాల్లో ఎకరా రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ధర పలుకుతోంది. ఆ లెక్కన రూ.5 కోట్ల విలువైన భూములు కబ్జాదారుల పరమయ్యాయి.

అధికారుల ప్రేక్షకపాత్ర
చెరువు భూములు జలవనరుల శాఖ పరిధిలోకి వస్తాయని రెవెన్యూ అధికారులు, కాదు రెవెన్యూ అధీనంలోనే ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు పరస్పరం నెపం నెట్టుకుంటూ ఆక్రమణలపై ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఆ సర్వే నంబర్లలో చెరువు, పోరంబోకు భూమిగానే నమోదై ఉంది. స్థానికులు, అధికార పార్టీ నాయకులు కలిసి ఆక్రమించిన విషయం తెలిసినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు అక్రమార్కులు ఇప్పటికే పాసు పుస్తకాలు పొందారని, మూగజీవాలు చెరువుల వద్దకు వెళ్లేందుకు వీల్లేకుండా కంచెలు వేశారని స్థానికులు తెలిపారు. పెదారికట్లకు చెందిన రైతు బి.బాలయ్య మాట్లాడుతూ చెరువు మరమ్మతుకు నిధులు మంజూరైనప్పటికీ ఆక్రమణల కారణంగా పనులు చేయలేదని, ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. చినారికట్లకు చెందిన వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న ఒక్క చెరువూ కబ్జాల పాలవ్వడంతో పంటలకే కాదు, పశువులకూ నీరు లేకుండాపోతోందని వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు