Hardik Pandya: టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్‌

ఐపీఎల్ 2024 సీజన్‌ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్‌ అవకాశాలను కోల్పోయింది.

Updated : 04 May 2024 11:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబయి కథ ముగిసినట్లే. ప్లేఆఫ్స్‌ అవకాశాలు చేజారాయి. వాంఖడే మైదానం వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాను ఓడించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ, 170 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి 145 పరుగులకే ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (56), టిమ్‌ డేవిడ్ (24) కాస్త పోరాడారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య (1) బ్యాటింగ్‌లో తేలిపోయాడు. బౌలింగ్‌లో మాత్రం రెండు వికెట్లు పడగొట్టినా.. 44 పరుగులు సమర్పించాడు. జస్‌ప్రీత్ బుమ్రా (3/18) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతోపాటు కీలక బ్యాటర్లను ఔట్ చేశాడు. సొంతమైదానంలో వరుసగా రెండో ఓటమిని ముంబయి మూటగట్టుకోవడంతో హార్దిక్‌ కెప్టెన్సీపై తీవ్ర విమర్శలు రేగాయి. మ్యాచ్‌ అనంతరం పాండ్య మాట్లాడుతూ.. తమ జట్టు ప్రదర్శనపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టమేనని వ్యాఖ్యానించాడు. 

ముంబయి కథ ముగిసె!

‘‘చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మాత్రం ఈ ఓటమిపై మాట్లాడేందుకు ఏమీ లేదు. సరైన భాగస్వామ్యాలు నిర్మించకపోతే ఫలితం ఇలానే ఉంటుంది. వికెట్లను కోల్పోతూనే ఉన్నాం. మా బౌలర్లు మాత్రం అద్భుతంగా బంతులేశారు. మంచు ప్రభావం ఎక్కువగా ఉండే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం సులువే. కానీ, మేం మాత్రం దానిని అందిపుచ్చుకోలేదు. మిగతా మ్యాచుల్లోనూ మేం తీవ్రంగా పోరాడతాం. చివరి వరకూ విజయం కోసం శ్రమిస్తాం. ప్రస్తుతం క్లిష్టపరిస్థితుల్లో ఉన్నాం. తప్పకుండా మాకు మంచి రోజులు వస్తాయి. సవాళ్లను ఎదుర్కొనేందుకు మేమెప్పుడూ సిద్ధమే’’ అని పాండ్య తెలిపాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఇరు జట్లూ ఆలౌట్‌ కావడం ఐపీఎల్‌లో ఇది నాలుగోసారి. అంతకుముందు దిల్లీ - రాజస్థాన్ (2010లో), కోల్‌కతా - బెంగళూరు (2017లో), ముంబయి - హైదరాబాద్ (2018లో) మ్యాచుల్లో ఆలౌటయ్యాయి. 
  • కోల్‌కతా తరఫున ముంబయిపై నాలుగు వికెట్ల ప్రదర్శన చేసిన నాలుగో బౌలర్ మిచెల్ స్టార్క్ (4/33). ఈ జాబితాలో ఆండ్రి రస్సెల్ (5/15), సునీల్ నరైన్ (4/15, 4/20) ఉన్నారు.
  • కోల్‌కతాతో జరిగిన 33 మ్యాచుల్లో ముంబయి ఆలౌట్‌ కావడం నాలుగోసారి మాత్రమే. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆరు మ్యాచుల్లో లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి కేవలం ఒక్కసారి మాత్రమే గెలిచింది. ఐదు మ్యాచుల్లో ఓడింది.
  • వాంఖడేలో కోల్‌కతా 11 మ్యాచులు ఆడి రెండు విజయాలను మాత్రమే నమోదు చేసింది. మిగతా తొమ్మిదింట్లో ఓటమే ఎదురైంది. చివరి సారిగా 2012లో వాంఖడేలో కోల్‌కతా విజయం సాధించింది. 
  • ఒకే వేదికపై 50+ వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా బుమ్రా ఘనత సాధించాడు. వాంఖడేలో 51 వికెట్లను పడగొట్టాడు. అతడి కంటే ముందు నరైన్ (ఈడెన్‌ గార్డెన్స్) 69, లసిత్ మలింగ (వాంఖడే) 68, అమిత్ మిశ్రా (దిల్లీ) 58, చాహల్ (బెంగళూరు) 52 వికెట్లు తీశారు. 
  • జస్‌ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో అత్యధికసార్లు 3+ వికెట్ల తీసిన బౌలర్‌గా తన రికార్డును పదిలం చేసుకున్నాడు.  131 ఇన్నింగ్స్‌ల్లో 23సార్లు ఈ ఘనత సాధించగా.. చాహల్‌ 154 ఇన్నింగ్స్‌ల్లో 20 సార్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు.
  • ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా పీయూశ్‌ చావ్లా అవతరించాడు. ప్రస్తుతం 184 వికెట్లను పడగొట్టాడు. డ్వేన్ బ్రావోను (183)ను అధిగమించాడు. ఈ జాబితాలో యుజ్వేంద్ర చాహల్ (200) అందరికంటే ముందున్నాడు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని