Axis Bank credit cards: అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్‌ బ్యాంక్‌

యాక్సిస్‌ బ్యాంకు కస్టమర్లు కొందరు తమ క్రెడిట్‌ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. దీనిపై బ్యాంక్‌ స్పందించింది.

Updated : 28 Mar 2024 19:48 IST

Axis bank | ఇంటర్నెట్‌ డెస్క్‌: గత రెండు, మూడు రోజులుగా యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు వినియోగదారులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. తమ క్రెడిట్‌ కార్డుల్లో అనధికారిక లావాదేవీలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. తమ ప్రమేయం లేకుండా, ఓటీపీ ఎంటర్‌ చేయకుండానే ఈ లావాదేవీలు జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు. ఇందులో అంతర్జాతీయ లావాదేవీలు సైతం ఉంటున్నాయని సామాజిక మాధ్యమాల్లో స్క్రీన్‌షాట్లు సహా పోస్టులు పెడుతున్నారు.

ఎక్కడో కెనడాలో ఉబర్‌ ఈట్స్‌ వద్ద తన కార్డు వినియోగించినట్లు తనకు సందేశం వచ్చిందని సందీప్‌ శ్రీనివాస్‌ అనే యూజర్‌ పేర్కొన్నారు. తన పేరుపై  కొత్త కార్డు కూడా జారీ అయ్యిందని, అందులోనూ ఇలాంటి లావాదేవీనే జరిగిందని పోస్ట్‌ చేశాడు. ఎయిర్‌ ఫ్రాన్స్‌ వద్ద తన కార్డు వినియోగించినట్లు ఆదిల్‌ అనే మరో యూజర్‌ పేర్కొన్నాడు. ఈతరహా ఫిర్యాదుల నేపథ్యంలో ఇంటర్నేషనల్‌ లావాదేవీల ఆప్షన్‌ను టర్న్‌ ఆఫ్‌ చేసుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

మ్యూచువల్‌ ఫండ్స్‌లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్‌లైన్‌!

బ్యాంక్‌ ఏమంది?

సోషల్‌మీడియాలో యూజర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులపై యాక్సిస్‌ బ్యాంక్‌ స్పందించింది. ఈమేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ‘‘యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులు పూర్తి భద్రమైనవి. మా వ్యవస్థల్లో ఎలాంటి ఉల్లంఘనలూ జరగలేదు. కొందరు మర్చంట్స్‌ నుంచి అనధికారిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించాం. ఆ ఖాతాలను బ్లాక్ చేశాం. యూజర్లు కోల్పోయిన మొత్తాలు స్వల్పమైనవి. తిరిగి రాబట్టదగ్గవి. మా అత్యాధునిక లావాదేవీల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా లావాదేవీలపై మా నియంత్రణ కొనసాగుతుంది. యూజర్లు భయపడాల్సిన అవసరం లేదు’’ అని యాక్సిస్‌ బ్యాంక్‌ పేర్కొంది. అనధికారిక లావాదేవీలు గుర్తిస్తే తమకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని