Home loan: గృహ రుణాలపై బ్యాంకుల పండగ ఆఫర్లు.. పరిమిత కాలం మాత్రమే!

పండగ సీజన్‌ సందర్భంగా కొన్ని బ్యాంకులు గృహ రుణాల‌పై పండగ డిస్కౌంట్ ఆఫర్లను ఇస్తున్నాయి. పరిమితకాలపు ఆఫర్‌ కింద వడ్డీ, ప్రాసెసింగ్‌ ఫీజులో రాయితీ ఇస్తున్నాయి.

Updated : 21 Oct 2022 14:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్‌బీఐ సెప్టెంబరు నెలాఖరులో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 5.90 శాతానికి చేర్చింది. మే 2022 త‌ర్వాత రెపో రేట్లు స‌వ‌రించ‌డం ఇది నాలుగోసారి. రెపో రేటు పెరిగిన ప్రతిసారీ బ్యాంకులు, ఇత‌ర ఆర్థిక సంస్థలు అన్ని ర‌కాల రుణ వ‌డ్డీ రేట్లతో స‌హా గృహ రుణ వ‌డ్డీ రేట్లను కూడా పెంచుతున్నాయి. అయితే, పండగ సీజన్‌ సందర్భంగా కొన్ని బ్యాంకులు ఇప్పుడు గృహ రుణాల‌పై పండగ డిస్కౌంట్ ఆఫర్లను ఇస్తున్నాయి.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఈ పండగ సీజన్లో తమ గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ వంటి బ్యాంకింగ్‌ దిగ్గజాల కంటే కూడా తక్కువ వడ్డీకే గృహ రుణాలను అందిస్తున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (BOI) గృహ రుణ వడ్డీ రేట్లు 8.30% నుంచి ప్రారంభమవుతున్నాయి. రూ.1 లక్షకు ఈఎంఐ రూ. 755 నుంచి ప్రారంభమవుతుందని బ్యాంకు తెలిపింది.

BOI స్టార్‌ హోమ్‌ లోన్‌ ఆఫర్

ఈ ఆఫర్లో 30 ఏళ్ల వరకు రుణాన్ని తిరిగి చెల్లించే వ్యవధిని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అందిస్తోంది. వినియోగదారుడు రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యానికి అనుగుణంగా రుణ వ్యవధిలో వివిధ విభిన్న ఈఎంఐ ఎంపికలను కూడా పొందొచ్చు. అంతేకాకుండా రుణానికి ముందస్తు చెల్లింపు లేదా పాక్షిక-చెల్లింపు రుసుములు లేవు. రుణగ్రహీతలు తిరిగి చెల్లించిన వడ్డీ, వాయిదాలపై పన్ను మినహాయింపును పొందుతారు. 2022 డిసెంబరు 31 వరకు గృహ రుణ ప్రాసెసింగ్‌ ఛార్జీలను బ్యాంకు మాఫీ చేసింది. ఈ బ్యాంకు టాప్‌-అప్‌, ఫర్నీచర్‌ రుణాలను కూడా అందిస్తోంది. 

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఆఫర్‌

ఈ బ్యాంకు కూడా గృహ రుణ రేట్లను ఈ నెల ప్రారంభంలో తగ్గించింది. వడ్డీ రేట్లు 8.3% నుంచి ప్రారంభమవుతున్నాయి. పండగ ఆఫర్‌లో భాగంగా ఇప్పుడు వడ్డీ రేటును 8%కు తగ్గించింది. అయితే ఈ వడ్డీ రేటు మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉన్నవారికి మాత్రమే. 

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ఆఫర్‌

గృహ రుణాల్లో మార్కెట్‌ లీడర్లయిన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలు 8.40% వడ్డీతో గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ పండగ ఆఫర్‌లో భాగంగా.. ఎస్‌బీఐ గృహ రుణాలపై 0.25%, టాప్‌ అప్‌ రుణాలపై 0.15%, ఆస్తులు తాకట్టు పెట్టుకుని ఇచ్చే రుణాలపై 0.30% వరకు రాయితీలను అందిస్తోంది. 2023 జనవరి 31 వరకు గృహ రుణాలపై ప్రాసెసింగ్‌ రుసుములను కూడా మాఫీ చేసింది.

గమనిక: క్రెడిట్‌ స్కోరుపై ఆధారపడి రుణ మంజూరు, వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వినియోగదారులు తమ రుణాన్ని తక్కువ వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకుకు బదిలీ చేసుకోవచ్చు. అయితే, బదిలీపై కూడా ప్రాసెసింగ్ ఛార్జీలు లాంటివి ఉన్నందున వడ్డీ రేట్లలో కనీసం 0.75-1% వ్యత్యాసం ఉన్నప్పుడు మాత్రమే బదిలీ చేసుకోవడం మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని