Home loan: జీరో ప్రాసెసింగ్‌ ఫీజు.. 8.3% వడ్డీకే హోమ్‌లోన్‌

Bank of India home loan offer: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గృహ రుణాలపై వడ్డీ తగ్గించింది. ప్రాసెసింగ్‌ ఫీజు సైతం రద్దు చేసింది. మార్చి 31 వరకు ఈ ఆఫర్‌ ప్రకటించింది.

Published : 19 Mar 2024 19:52 IST

ముంబయి: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Bank of India) గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. 8.45 శాతంగా ఉన్న వడ్డీ రేటులో 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. తమ బ్యాంకులో తీసుకునే గృహ రుణాలపై వడ్డీ రేటు 8.3 శాతం నుంచి ప్రారంభం అవుతుందని బ్యాంక్‌ తెలిపింది. ప్రాసెసింగ్‌ ఫీజును సైతం రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఇది పరిమితకాలపు ఆఫర్‌ అని, ఈ నెలాఖరు వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

గృహ రుణాల జారీలో ముందు వరుసలో ఉన్న ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. తమ బ్యాంక్‌ మాత్రం అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తోందని బ్యాంక్‌ పేర్కొంది. ఈ వడ్డీ రేటుకు 30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుంటే రూ.లక్షకు రూ.755 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్‌ పేర్కొంది. రుణ ప్యాకేజీలో భాగంగా ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం కూడా అందిస్తున్నామని బ్యాంక్‌ పేర్కొంది.

Zomato: జొమాటో కొత్త సేవలు.. వెజిటేరియన్స్‌కు ఇక ప్రత్యేకంగా

సంప్రదాయ గృహ రుణాలతో పాటు రూఫ్‌ టాప్‌ సోలార్‌ ప్యానెల్స్‌కు సైతం రుణాలు అందిస్తున్నామని బ్యాంక్‌ తెలిపింది. 7 శాతం వడ్డీకే ఎటువంటి ప్రాసెసింగ్‌ ఫీజూ లేకుండా ఈ తరహా రుణాలు అందిస్తున్నట్లు బ్యాంక్‌ పేర్కొంది. గరిష్ఠంగా 120 నెలలకు గానూ ప్రాజెక్ట్‌ వ్యయంలో 95 శాతంగా రుణం పొందొచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ప్రభుత్వం నుంచి రూ.78 వేలు సబ్సిడీ సైతం పొందొచ్చని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని