Interest rates: వ్యక్తిగత రుణాలు ప్రియం కానున్నాయా? కారణం ఇదే!

Personal Loans: ఆర్‌బీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో వ్యక్తిగత రుణాలు ప్రియమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Published : 24 Nov 2023 14:06 IST

Personal Loans | ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తిగత రుణాలు (Personal Loans) ప్రియం కానున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భవిష్యత్‌లో ఈ తరహా రుణాల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) తీసుకున్న ఓ నిర్ణయమే ఇందుకు కారణం. ఆయా రుణాలపై రిస్క్‌ వెయిట్‌ను పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లు 30 నుంచి 40 బేసిస్‌ పాయింట్ల మేర పెరిగే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత రుణాలతో పాటు, కొత్తగా తీసుకునే రుణాలకూ ఈ పెంపు వర్తించనుంది. అయితే, బ్యాంకులు ఇంకా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు.

బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీలు (NBFC) వ్యక్తిగత రుణాలు ఇచ్చేందుకు ఉన్న నిబంధనలను ఆర్‌బీఐ ఇటీవల కఠినతరం చేసింది. హామీలేని వ్యక్తిగత రుణాలకు రిస్క్‌ వెయిట్‌ను 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. ఈ సవరించిన నిబంధనలు గృహ, విద్య, వాహన రుణాలకు వర్తించవు. పసిడి రుణాలకూ వర్తించవని స్పష్టం చేసింది. ఈ రుణాలకు యథాతథంగా 100 శాతం రిస్క్‌ వెయిట్‌ కొనసాగుతుందని తెలిపింది. అధిక రిస్క్‌ వెయిట్‌ ఉంటే.. బ్యాంకులు ఆయా హామీలేని వ్యక్తిగత రుణాల కోసం మరిన్ని నిధులను పక్కన పెట్టాల్సి వస్తుంది. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు, కొన్ని రకాల రిటైల్ రుణాలకు ఈ నిబంధన వర్తిస్తుంది.

ఈ క్రెడిట్‌ కార్డులు లైఫ్‌టైమ్‌ ఫ్రీ.. బెన్‌ఫిట్స్‌ ఇవే..!

ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో అదనపు నిధుల సమీకరణ భారాన్ని రుణగ్రహీతలకు బదిలీ చేయడం అనివార్యమని ఓ బ్యాంక్‌ ఉన్నతాధికారి ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రిస్క్‌ వెయిట్‌ వల్ల ఆ మేర రాబడి తగ్గిపోతుందని, కాబట్టి బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. ఈ పెంపు 30-40 బేసిస్‌ పాయింట్ల వరకు ఉంటుందన్నారు. ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా సైతం ఇటీవల ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. మార్కెట్‌ పరిస్థితు ఆధారంగా ఈ పెంపు ఉండొచ్చని మరో బ్యాంకర్‌ పేర్కొన్నారు. బ్యాంకులతో పాటు ఎన్‌బీఎఫ్‌సీలు సైతం ఆయా రుణాలపై వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది.

ప్రస్తుతం వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు బ్యాంకుల్లో 10.50 శాతం నుంచి 17 శాతం వరకు ఉన్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలైతే 10 శాతం నుంచి ఈ తరహా రుణాలు జారీ చేస్తున్నాయి. వ్యక్తుల అర్హత, రుణ మొత్తం, కాలవ్యవధిపై ఈ వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. అయితే, గృహ, విద్య, వాహన, బంగారం కుదువ పెట్టి తీసుకునే రుణాల్లో మాత్రం మార్పు ఉండకపోవచ్చు. ఆయా రుణాలకు సాధారణంగా పూచీకత్తు ఉంటుంది. దీంతో రిస్క్‌ వెయిట్‌ను ఆర్‌బీఐ అలాగే కొనసాగించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు జారీ చేస్తున్న వినియోగదారు రుణాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు