Vehicle Loan Default: వాహన రుణ ఈఎంఐలు డిఫాల్ట్‌ చేస్తున్నారా?

బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని కార్లు కొనుగోలు చేసేవారు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారు. అయితే, కొంత మంది రుణగ్రహీతలు ఈ రుణాలను సక్రమంగా చెల్లించలేరు, ఇటువంటి పరిస్థితుల్లో లోన్‌ డిఫాల్ట్‌ అయ్యే అవకాశం ఉంది, డిఫాల్ట్‌ అయితే ఎమవుతుందో ఇక్కడ తెలుసుకోండి.

Published : 12 May 2023 19:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశమంతటా కార్ల అమ్మకాలు కొన్ని సంవత్సరాల నుంచి గణనీయంగా పెరుగుతున్నాయి. వీటి కొనుగోళ్లకు బ్యాంకులు, అనేక రుణ సంస్థలు విరివిగా రుణాలందజేయడంతో అమ్మకాలు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. మధ్యతరగతిలో కూడా కార్లను కొనుగోలు చేసేవారు ఎక్కువయ్యారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ కార్లు బ్యాంకు రుణాలతో పొందినవే ఉంటున్నాయి. ఈ రుణాలను 3-7 సంవత్సరాల ఈఎంఐ సౌకర్యంతో బ్యాంకులు ఆఫర్‌ చేస్తాయి. కార్లను రుణంతో తీసుకునే వరకు బాగానే ఉంటుంది. కానీ, ఈఎంఐలు చెల్లించేటప్పుడు డిఫాల్ట్‌ కాకుండా చూసుకోవాలి. రుణం తీసుకున్న తర్వాత, తప్పనిసరిగా ఈఎంఐలను తిరిగి సరైన సమయానికి చెల్లించాలి. ఈఎంఐను ఆలస్యం చేసినా.. డిఫాల్ట్‌ చేసినా మీరు ఎదుర్కొనే కొన్ని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

లోన్‌ డిఫాల్ట్‌ అయితే..

కారు పొందే కలను నిజం చేసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. కానీ, రుణగ్రహీత అంగీకరించిన కారు రుణాన్ని తిరిగి చెల్లించడంలో పదేపదే విఫలమైనప్పుడు కారు లోన్‌ 'డిఫాల్ట్‌' అవుతుంది. రుణంతో కారు తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించడంలో విఫలం/ఆలస్యం అయితే అనేక పరిణామాలు ఉంటాయి. ఈ రుణం సురక్షితమైనది, తీసుకున్న రుణానికి కారు హామీగా ఉంటుంది. మీరు లోన్‌ పేపర్‌లపై సంతకం చేసేటప్పుడు, రుణానికి సంబంధించిన నిబంధనలు, షరతులను జాగ్రత్తగా పరిశీలించాలి. రుణాన్ని చెల్లించే బాధ్యతలను సక్రమంగా అమలు చేయాలి. ఈఎంఐ చెల్లింపులు కోల్పోతే, బ్యాంకు లేదా వారి రికవరీ ఏజెన్సీ నుంచి లోన్‌ కలెక్షన్‌ కాల్స్, లెటర్స్‌ వస్తాయి. వీటి వల్ల రుణగ్రహీతలు దైనందిన కార్యక్రమాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. రుణ ఒప్పందం ప్రకారం తిరిగి చెల్లించడంలో విఫలమైతే, బ్యాంకు మీ నుంచి కారును తిరిగి తీసుకుంటారు. కారును స్వాధీనం చేసుకునేటప్పుడు ఇంటికి వచ్చి తీసుకుని వెళ్లచ్చు లేదా మీరు ప్రయాణంలో ఉండగానే రోడ్‌ మీద కారును ఆపివేసి స్వాధీనం చేసుకోవచ్చు. ఇది ఎవరికైనా అవమానంగా ఉంటుంది. 

క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం

కారు రుణ ఈఎంఐ చెల్లింపులు ఆలస్యం జరిగితే మీ క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. క్రెడిట్‌ హిస్టరీలో స్కోరును ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఇది భవిష్యత్తు రుణ అవసరాల కోసం మీ క్రెడిట్‌ యోగ్యతను నిర్ణయించడంలో చెల్లింపు చరిత్ర ముఖ్యమైన అంశం. కొన్ని సందర్భాల్లో ఎక్కువ కాలం పాటు ఈఎంఐ చెల్లింపులను కోల్పోయినట్లయితే బ్యాంకు బకాయి ఉన్న మొత్తాన్ని తిరిగి పొందడానికి మీపై చట్టపరమైన చర్య తీసుకోవచ్చు. ఇంకా మిమ్మల్ని ప్రమాదకర రుణగ్రహీతగా చూడొచ్చు. కాబట్టి, ఆలస్య ఈఎంఐ చెల్లింపులు.. భవిష్యత్‌లో రుణాలకు ఆమోదం పొందే అవకాశాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. మీ క్రెడిట్‌ రికార్డ్‌ దెబ్బతిన్నప్పుడు తదుపరి 7 సంవత్సరాల వరకు వివిధ కొత్త రుణాలను పొందే అవకాశం తగ్గిపోతుంది. ఒకవేళ రుణం లభించినా కూడా వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. 

వడ్డీ

ఈఎంఐలు ఆలస్యమయితే వడ్డీ పెరిగిపోతుంది. అంటే, రుణానికి సంబంధించిన సమయంలో ఎక్కువ వడ్డీని చెల్లించవలసి ఉంటుంది. అలాగే, ఈఎంఐ చెల్లింపులు మిస్‌ అయితే బ్యాంకు జరిమానా ఛార్జీలు విధిస్తుంది. జరిమానాపై జీఎస్‌టీ అదనంగా విధిస్తారు.

రుణగ్రహీత ఏం చేయాలి?

రుణగ్రహీత కారు రుణ ఈఎంఐ చెల్లించడం ఆలస్యమయినప్పుడు బ్యాంకుకు కాల్‌ చేయండి. చెల్లింపుల్లో జాప్యానికి కారణాన్ని వివరించే అంశంలో నిజాయతీగా వ్యవహరించండి. మీరు చెప్పే కారణాలు ఇంతకు ముందు చాలా సార్లు వారు విని ఉండొచ్చు. మీరు నిజాయతీగా, సూటిగా ఉండడం వల్ల మీకు అనుకూలంగా పని చేయవచ్చు, పరస్పరం ప్రయోజనకరమైన సర్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా మీరు అనేక ఇతర ఎంపికలను ప్రయత్నించడం మంచిది. అవేంటంటే..

A) మీ కారు లోన్‌ వ్యవధిని పొడిగించడానికి బ్యాంకు ప్రతినిధితో మాట్లడడానికి ప్రయత్నించండి. ఉదా: రుణం తీసుకున్నప్పుడు 36 నెలల పాటు ఈఎంఐ చెల్లించే విధంగా కారు రుణం తీసుకున్నట్లయితే, దాన్ని 60 నెలలకు పొడిగించమని అభ్యర్థించవచ్చు. దీంతో నెలవారీ ఈఎంఐ మొత్తం తగ్గుతుంది. అయితే, కాలపరిమితి పెరిగినప్పుడు చివరి వరకు చెల్లించే వడ్డీ మొత్తం పెరుగుతుందని గమనించాలి.

B) బ్యాంకులో ఈఎంఐ చెల్లింపును వాయిదా వేయడానికి వీలుంటుందా అని అడగండి. ప్రస్తుత నెల ఈఎంఐ చెల్లింపును దాటవేసి, తర్వాతి నెలలో చేయడానికి మీకు అనుమతి లభించే అవకాశం ఉంది. చెల్లింపుల్లో ఒక నెల దాటవేయడం వల్ల మీకు అవసరమైన సౌలభ్యం లభిస్తుందని బ్యాంకును అభ్యర్థించండి.

C) ఆలస్య రుసుములు మీకు ఆర్థికంగా భారం అనిపిస్తే, ఈ రుసుములను మాఫీ చేయమని బ్యాంకును అడగండి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బ్యాంకులు వీటిని అంగీకరించొచ్చు.

కారు విక్రయం

రుణాన్ని తిరిగి చెల్లించడానికి మీకు కష్టంగా ఉన్నట్లయితే బ్యాంకును సంప్రదించి కారును విక్రయించొచ్చు. దీంతో రుణాన్ని పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ ముందస్తుగా చెల్లించడానికి డబ్బును ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా, మీరు రుణం చెల్లించలేని పరిస్థితుల్లో మీ వద్ద ఉన్న కారును వేరే కొనుగోలుదారునికి అప్పగించి, కారు రుణాన్ని కూడా ఆ వ్యక్తి పేరు మీద (బ్యాంకు అంగీకారంతో) మార్చవచ్చు. దీంతో రుణం తీర్చే సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

కారు వేలం

డిఫాల్ట్‌ లోన్‌ మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకోవడానికి బ్యాంకు కారును వేలం వేస్తుంది. వేలం వివరాలు ప్రచారం కూడా చేస్తాయి. వేలం ప్రక్రియ సహేతుకమైన పద్ధతిలో జరుగుతుంది. వేలం విషయాలను కస్టమర్‌కు కూడా తెలియజేస్తుంది. వేలం ప్రక్రియతో డిఫాల్ట్‌దారుని బాకీ తీరిపోయినట్లు కాదు. మొత్తం రుణ బకాయిలు వేలంలో రాని పక్షంలో మిగతా సొమ్ము కారు డిఫాల్ట్‌దారుడు చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ బకాయి కన్నా ఎక్కువ మొత్తానికి కారును అమ్మినా మిగిలిన సొమ్మును డిఫాల్ట్‌దారునకు బ్యాంకు చెల్లిస్తుంది. 

చివరిగా: వాహన రుణం తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించగలిగినంత మాత్రమే రుణం తీసుకోవడం మంచిది. ఈఎంఐ చెల్లింపు గడువును ప్రతి నెలలో మీరు చెల్లించడానికి అనుకూలంగా ఉన్న తేదీకి శాశ్వతంగా మార్చగలరేమో మీ బ్యాంకును అడగండి. దీని వల్ల ఆలస్య రుసుముల నుంచి తప్పించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని