Home Loan: గృహ రుణ చెల్లింపులను తక్కువ కాలానికి పరిమితం చేయడం ఎలా?

ఆర్‌బీఐ రెపోరేటు పెంపుదలతో గృహ రుణ వడ్డీ రేట్లు పెరిగాయి. దీంతో బ్యాంకులు ఈఎంఐ మొత్తాన్ని పెంచకుండా, ఈఎంఐల సంఖ్యను పెంచుతున్నాయి. దీంతో రుణం తీర్చే కాలవ్యవధి పెరుగుతుంది. కొన్ని చిట్కాల ద్వారా ఈ రుణ కాలవ్యవధిని ఎలా తగ్గించుకోవచ్చో చూడండి.

Published : 11 May 2023 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇతర రుణాలతో పోలిస్తే గృహ రుణాలు సుదీర్ఘకాల చెల్లింపులతో లభిస్తాయి. పెద్ద మొత్తంలో రుణం ఉండడం దీనికి కారణం. ఈఎంఐలను చెల్లించే రుణగ్రహీతలకు ఇది నెల నెలా ఒక ఆర్థిక భారంలా అనిపిస్తుంది. వడ్డీ భారం కూడా ఎక్కువే ఉంటుంది. రుణ కాలపరిమితి రుణగ్రహీత పదవీ విరమణకు మించి ఉంటే, అది ఆర్థిక ఇబ్బందులను సృష్టిస్తుంది. మీకు దీర్ఘకాలిక రుణం ఉన్నట్లయితే, అది ఇతర ఆర్థిక నిర్ణయాలు, పెట్టుబడులు చేసే మీ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. గత సంవత్సరం నుంచి ఆర్‌బీఐ రెపో రేటు పెంపుదల కారణంగా గృహ రుణం తిరిగి చెల్లించే కాలవ్యవధి పెరిగింది. వడ్డీ రేట్లు పెరగడంతో చాలా మంది రుణగ్రహీతలు (పెరిగిన కాలవ్యవధి కారణంగా) తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. గృహ రుణం తీరేటప్పటికి, చాలా మంది రుణగ్రహీతల పదవీ విరమణ వయసు మించిపోయే అవకాశం కూడా ఉంది.

వడ్డీ పెరుగుదల

సుదీర్ఘ రుణ కాలవ్యవధితో ప్రధాన ప్రతికూలత ఏంటంటే కాలక్రమేణా ఎక్కువ వడ్డీని చెల్లిస్తారు. ఎందుకంటే, ఎక్కువ కాలం గడిచే కొద్దీ వడ్డీ పెరుగుతుంది. మీరు దీర్ఘకాలిక రుణాన్ని కలిగి ఉన్నట్లయితే ఇది ఇతర ఆర్థిక నిర్ణయాలు, పెట్టుబడులు తీసుకునే మీ సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. ఏదేమైనా సుదీర్ఘ రుణ కాలవ్యవధిని నిర్వహించడం ఒక సవాలనే చెప్పాలి. అందుచేత మీ ఆదాయం, పొదుపు, ఖర్చులు, అప్పులను సమీక్షించడం ద్వారా రుణ కాలవ్యవధిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.

పాక్షిక చెల్లింపు

రుణానికి సంబంధించిన బకాయిలో అసలు మొత్తాన్ని పాక్షికంగా చెల్లింపులు చేయవచ్చు. దీన్ని రుణ వ్యవధిలో ఏ సమయంలోనైనా చేయవచ్చు. రుణంపై పాక్షిక చెల్లింపులు చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కాలక్రమేణా చెల్లించే వడ్డీ మొత్తాన్ని తగ్గించడంలో ఇది మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే వడ్డీ సాధారణంగా బకాయి బ్యాలెన్స్‌పై లెక్కిస్తారు. కాబట్టి, అసలు మొత్తాన్ని తగ్గించడం ద్వారా, వసూలు చేసే వడ్డీ మొత్తాన్ని కూడా తగ్గించుకోవచ్చు. ఇది రుణ వ్యవధిని తగ్గిస్తుంది. దీంతో త్వరగా రుణ విముక్తులు అవుతారు. అయితే, కొన్ని బ్యాంకులు ముందస్తు చెల్లింపులకు జరిమానాలు, రుసుములను వసూలుజేస్తాయి. పాక్షిక చెల్లింపుల విషయంలో రుసుముల వ్యవహారాన్ని గృహ రుణం తీసుకునేటప్పడే బ్యాంకుతో చర్చించాలి.

కాలవ్యవధి త్వరగా ముగియాలంటే..

మీరు ప్రతి సంవత్సరం లోన్‌ బ్యాలెన్స్‌లో 5% చెల్లిస్తే.. 20 సంవత్సరాల రుణాన్ని 12-13 సంవత్సరాలలో చెల్లించవచ్చు. ప్రతి సంవత్సరం ఒక అదనపు ఈఎంఐని ‘ప్రీపే’ చేయడం వల్ల రుణాన్ని 17-18 సంవత్సరాలలో ముగించవచ్చు. అంతేకాకుండా, మీ ఈఎంఐని ప్రతి సంవత్సరం 5% పెంచుకుంటే.. రుణం 13-14 సంవత్సరాల్లోపు పూర్తి అవుతుంది.

అదనపు ఆదాయ వనరులు

రుణాన్ని త్వరగా తీర్చాలంటే అదనపు ఆదాయాన్ని పెంచుకోవలసిందే కదా.. అందుకని పార్ట్‌టైమ్‌ ఉద్యోగం, సైడ్‌ బిజినెస్‌ను ప్రారంభించడం వంటివి ప్రయత్నించండి. మీ ఖర్చుల జాబితాను రూపొందించుకుని అనవసర ఖర్చులను తగ్గించుకోండి. తరచూ హోటళ్లకు వేళ్లేవారు వాటిని మానుకోవడం, అనవసర వస్తువుల కొనుగోళ్లను నివారించడం లాంటి చర్యల ద్వారా మీకు మీరే అదనపు ఆదాయాన్ని సృష్టించుకోవచ్చు. అంతేకాకుండా, మీ రుణ కాలపరిమితి ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటే, మీ పదవీ విరమణ పొదుపును ఈ రుణం తీర్చడానికి ఉపయోగించవచ్చు. అయితే ఇది మీ చివరి ప్రయత్నంగా ఉండాలి. పదవీ విరమణ పొదుపును తప్పనిసరి పరిస్థితులలోనే ఇటువంటి వాటికోసం ఉపయోగించాలి.

తక్కువ వడ్డీకి రుణ బదిలీ

మనం గృహ రుణాన్ని తీసుకున్న బ్యాంకు (కొత్తవారికి) వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు మీరు కూడా ఈ రుణాన్ని అదే వడ్డీకి మార్చమని అడిగినప్పుడు, మీ బ్యాంకు కొంత మొత్తాన్ని 'కన్వర్షన్ ఫీజు'గా చెల్లిచమని కోరవచ్చు. లేకపోతే మరొక బ్యాంకు మీ ప్రస్తుత రుణం కంటే కనీసం 1% తక్కువగా రుణాన్ని అందిస్తున్నప్పుడు, ఆ బ్యాంకుకు రుణాన్ని బదిలీ చేయవచ్చు. 15-20 ఏళ్ల పాటు కాలవ్యవధి ఉండే రుణం కాబట్టి, వడ్డీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. గృహ రుణాన్ని ఇలా బదిలీ చేయడం వల్ల తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని పొందే అవకాశం ఉంటుందా లేదా అని పరిశీలించాలి. తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని తిరిగి పొందడమే ఈ బదిలీ ఉద్దేశం. అయితే, మరో బ్యాంకుకు రుణాన్ని బదిలీ చేసేటప్పుడు రుణంపై ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలను దృష్టిలో పెట్టుకోవాలి.

నిరూపయోగ ఆస్తులు

మీ ఆస్తుల్లో అంతగా ఉపయోగం లేని ఆస్తులు.. అంటే పాత ఇల్లు, కారు, ఉపయోగించని ఇతర వస్తువులు వంటివి ఉంటే వాటి విక్రయానికి పూనుకోండి. ఇలా వచ్చిన సొమ్ముతో గృహ రుణంలో కొంత మొత్తమైనా చెల్లించి, బకాయిని తగ్గించుకోవచ్చు. ఇది మీ నెలవారీ ఖర్చులను తగ్గించడంలో, ఆర్థిక నిర్వహణను సులభతరం చేయడంలో మీకు సహాయపడుతుంది.

చివరిగా: వడ్డీ రేట్ల పెంపుతో మీ రుణంపై వడ్డీ మొత్తం, కాలవ్యవధి మరింత పెరగకుండా సరైన సమయంలో దిద్దుబాటు చర్యలు తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని