Home Loan: ఫిక్స్‌డ్‌ vs ఫ్లోటింగ్ వడ్డీ రేటు.. ఏది ఎంచుకోవాలి?

గృహ రుణానికి.. ఫిక్స్‌డ్‌, ఫ్లోటింగ్ వడ్డీ రేటులో ఏది ఎంచుకోవాలో ఇక్కడ చూడండి.

Published : 31 Oct 2023 18:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చాలామందికి జీవితంలో ఇల్లు కొనడం అనేది ఒక పెద్ద డ్రీమ్‌. బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత మీ జీవితంపై అనేక సంవత్సరాలు ఇంటి రుణ ప్రభావం ఉంటుంది. ఇంటి రుణం తీసుకునే సమయంలో ఫిక్స్‌డ్‌ లేదా ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని రుణాన్ని తీసుకోవచ్చు. ఈ రెండింటి మధ్య ఎంపిక వడ్డీ రేట్లో మార్పులు, వాటి తీరుతెన్నులనుపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది రుణగ్రహీతలు హైబ్రిడ్‌ విధానాన్ని ఎంచుకుంటారు. ఇక్కడ వారు నిర్దిష్ట కాలానికి ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటుతో ఇంటి రుణం ప్రారంభించి వడ్డీ రేటు తగ్గినప్పుడు ఫ్లోటింగ్‌ రేటుకు మారతారు. ఈ రెండు ఆప్షన్స్‌లో ఏది బెటర్‌ అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు.

ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటు

ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటు.. పేరులో సూచించినట్లుగా మార్కెట్‌ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా రుణ కాలవ్యవధి అంతా స్థిరంగా ఉంటుంది. వడ్డీ రేటు లోన్‌ ప్రారంభ సమయంలోనే సెట్‌ చేస్తారు. రుణ చెల్లింపుల వ్యవధి ముగిసేవరకు మారదు. రుణగ్రహీతలు చెల్లింపులు చేసేటప్పుడు ఈఎంఐలను దీర్ఘకాలం పాటు అంచనా వేసుకోవచ్చు. వడ్డీ రేట్ల కదలికల గురించి కచ్చితంగా తెలియని వారికి ఫిక్స్‌డ్‌ రేట్లు బెటర్‌ అని చెప్పొచ్చు. దీర్ఘకాలం పాటు ఒక స్థిరమైన బడ్జెట్‌కు స్థిరపడి ఆర్థిక ప్రణాళికను కోరుకునే వారికి ఫిక్స్‌డ్‌ రేటు అనుకూలంగా ఉంటుంది. ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు హోమ్‌ లోన్‌తో పోలిస్తే ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటు కొంచెం ఎక్కువే ఉంటుంది.

ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటు ఎంపిక

రుణం తీసుకునే సమయంలో వడ్డీ రేటు తక్కువగా ఉంటే.. మీరు దాని నుంచి ఎక్కువ ప్రయోజనం పొందాలనుకుంటే ఈ రకమైన వడ్డీ రేటు అనువైనది. ఉదాహరణకు కొన్ని ఏళ్ల క్రితం వడ్డీ రేట్లు 10-11% ఉండేవి. క్రమ క్రమంగా 7-8%కు పడిపోయాయి. ఫిక్స్‌డ్‌ రేటుతో రుణం తీసుకోవడానికి ఇలాంటి సమయం అనువైనదిగా పరిగణించవచ్చు. ఈ రేట్లు ఉన్నప్పుడు ఫిక్స్‌డ్‌ రేటు ఎంచుకుని ఉంటే ఆ తరవాత పెరిగిన వడ్డీ రేట్ల నుంచి వారికి ఉపశమనం లభించి ఉండేది. వడ్డీ ఆదా అయ్యేది. అలాగే, మీరు నిరంతరం మారుతున్న వడ్డీ రేట్లతో అసౌకర్యంగా ఉంటే, ఈ ఎంపిక మరింత స్థిరత్వాన్ని అందిస్తుంది.

ప్రయోజనాలు

ఇంటి రుణ ఈఎంఐ పెద్ద మొత్తం కాబట్టి, దీర్ఘకాలం పాటు ఒక ఈఎంఐ మొత్తానికి ఫిక్స్‌ అయిపోవచ్చు. మీరు మీ భవిష్యత్‌ ఖర్చులను సులభంగా ప్లాన్‌ చేసుకోవచ్చు, నెలవారీ బడ్జెట్‌ను నిర్వహించడం కూడా సులభం. అంతేకాకుండా మీ ఫైనాన్స్‌పై ఎక్కువ నియంత్రణను కలిగి ఉంటారు. 

నష్టాలు

ఫిక్స్‌డ్‌ వడ్డీ రేట్లు, ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్ల కంటే 1-2.50% అధికంగానే ఉంటాయి. కాబట్టి ఈఎంఐలు ప్రారంభం నుంచి అధికంగానే ఉంటాయి. అయితే, కొంత కాలం తరవాత మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గితే, ఫిక్స్‌డ్‌ రేట్లు ఉన్న రుణగ్రహీతలు మార్కెట్ రేటు కంటే ఎక్కువగా చెల్లించినట్టే. గడువుకు ముందే లోన్‌ను మూసివేయాలనుకుంటే, ప్రిన్సిపల్‌ బకాయిలో 2-2.50% మధ్య ముందస్తు చెల్లింపు/ప్రీ-క్లోజర్‌ ఛార్జీలుంటాయి. ఫిక్స్‌డ్‌ నుంచి ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లకు మారడానికి బ్యాంకులు రుణ మొత్తంలో 2% వరకు రుసుం వసూలు చేస్తాయి. ఇది ఆర్థికంగా భారమనే చెప్పొచ్చు. ఈ ఛార్జీలు బ్యాంకును బట్టి మారతాయి.

ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు

ఫ్లోటింగ్‌ వడ్డీ రేటును.. వేరియబుల్‌ వడ్డీ రేటు అని కూడా పిలుస్తారు. ఫ్లోటింగ్‌ రుణాలు బ్యాంకుకు సంబంధించిన బెంచ్‌మార్క్‌ రేటుతో అనుసంధానమయి ఉంటాయి. ఇవి మార్కెట్‌ వడ్డీ రేటుతో ముడిపడి ఉంటాయి. బెంచ్‌మార్క్‌ రేటులో మార్పు ఉంటే.. ఇంటి రుణంపై వడ్డీ రేటు కూడా దామాషా ప్రకారం మారుతుంది. ఇది ఆర్‌బీఐ రెపో రేటు లేదా బ్యాంకులు ఎంచుకున్న ఇతర బాహ్య బెంచ్‌మార్క్‌లు వంటి మార్కెట్‌ రేటులో హెచ్చుతగ్గులకు ప్రతిస్పందనగా కాలానుగుణంగా మారుతుంది. మీ ఇంటి రుణంపై వడ్డీ రేటు కూడా మారుతుంది. ఇది ఈఎంఐపై ప్రభావం చూపుతుంది. 

ఫ్లోటింగ్‌ వడ్డీ రేటు ఎంపిక

సాధారణంగా వడ్డీ రేట్లు కాలక్రమేణా తగ్గుతాయని మీరు ఆశించినట్లయితే, అటువంటి విషయంలో ఫ్లోటింగ్‌ రేటు లోన్‌ను ఎంచుకోవచ్చు. తద్వారా రుణ భారం తగ్గుతుంది. మీరు ఇంటి రుణ ఫ్లోటింగ్‌ వడ్డీ రేటులో ఉన్నవారైతే, పార్ట్‌-పేమెంట్‌ లేదా ప్రీ-క్లోజర్‌ ఛార్జీలు చెల్లించనవసరం లేదు. భవిష్యత్‌ రేట్లను అంచనా వేయడం కొద్దిగా కష్టమే. హౌసింగ్‌ లోన్‌ వడ్డీ రేట్లు మీ అంచనాలకు విరుద్ధంగా మారొచ్చు. దీని గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీరు ఫిక్స్‌డ్‌ రేటులో ఉంటే కాలపరిమితిని బట్టి కొంత రుసుములు చెల్లించి ఫిక్స్‌డ్‌ రేటు నుంచి ఫ్లోటింగ్‌ రేటు హౌసింగ్‌ లోన్‌కు మారొచ్చు.

ప్రయోజనాలు

వడ్డీ రేట్లు తగ్గుతున్న కాలంలో ఫ్లోటింగ్‌ రేట్లు ఉన్న రుణగ్రహీతలు తక్కువ నెలవారీ వాయిదాల నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఫ్లోటింగ్‌ రేట్లు సాధారణంగా సరళంగా ఉంటాయి. రుణగ్రహీతలు రీఫైనాన్సింగ్‌ అవసరం లేకుండానే మార్కెట్‌ రేటు తగ్గుదల ప్రయోజనాన్ని పొందేందుకు వీలుంటుంది. వడ్డీ రేట్ల గణనలో పారదర్శకత కూడా ఎక్కువే. వడ్డీ రేట్లు భవిష్యత్‌లో క్రమక్రమంగా తగ్గుతాయని భావిస్తే ఫ్లోటింగ్‌ రేటు ప్రయోజనకరంగా ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు ఈఎంఐల మొత్తాన్ని తగ్గించకుండా స్థిరంగా ఉంచినట్లయితే, రుణ కాలపరిమితి తగ్గించుకోవచ్చు. మీ రుణం త్వరగా పూర్తవుతుంది. వడ్డీ భారం కూడా తగ్గుతుంది.

నష్టాలు

ఫ్లోటింగ్‌ రేట్లు మార్కెట్‌ అస్థిరతకు గురవుతాయి. ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్లు పెరగొచ్చు. దీనివల్ల నెలవారీ బడ్జెట్‌ స్వరూపం మారిపోతుంది.

చివరిగా: ఫ్లోటింగ్‌, ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటు మధ్య నిర్ణయం మీ ఆర్థిక పరిస్థితి, తీసుకునే రిస్క్‌, మార్కెట్‌ పరిస్థితులు, వ్యక్తిగత ప్రాధాన్యాలు సహా వివిధ అంశాలపై ఆధారపడి ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు