Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో 30 సెకన్లలోనే ₹5 లక్షల వరకు పర్సనల్‌ లోన్‌

personal loans in Flipkart: ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్‌.. ఇకపై వ్యక్తిగత రుణాలూ మంజూరు చేయనుంది. రూ.5 లక్షల వరకు రుణాలను అందజేయనుంది.

Updated : 07 Jul 2023 16:42 IST

ముంబయి: ప్రమఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) ఇకపై వ్యక్తిగత రుణాలూ (personal loans) ఇవ్వనుంది. ఇందుకోసం యాక్సిస్‌ బ్యాంక్‌తో (Axis Bank) జట్టు కట్టింది. ఇప్పటికే ఈ రెండు సంస్థలూ కో బ్రాండెడ్‌ క్రెడిట్‌కార్డును తీసుకొచ్చాయి. తాజాగా పర్సనల్‌ లోన్‌ విభాగంలోకీ అడుగుపెట్టాయి. యాక్సిస్‌ బ్యాంక్‌కు చెందిన వ్యక్తిగత రుణాలను ఇకపై ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులు పొందొచ్చు. గరిష్ఠంగా మూడేళ్ల కాలవ్యవధిపై రూ.5 లక్షల వరకు రుణాలను తమ వేదికగా మంజూరు చేయనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ఓ ప్రకటనలో తెలిపింది. పర్సనల్‌ లోన్స్‌, క్రెడిట్‌ కార్డులు వంటి అన్‌ సెక్యూర్డ్‌ రుణాలపై ఓ వైపు ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తంచేస్తున్న వేళ ఫ్లిప్‌కార్ట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం.

మారుతున్న లైఫ్‌స్టయిల్‌కు అనుగుణంగా వినియోగదారుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే బై నౌ పే లేటర్‌ (BNPL), ఈఎంఐ (EMI), కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డు సౌకర్యాన్ని కల్పిస్తోందని ఆ సంస్థ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ధీరజ్‌ అనేజా తెలిపారు. ఇది వినియోగదారుల కొనుగోలు అవసరాలను సులువుగా తీర్చుకునేందుకు ఉపయోగపడుతుందని అనేజా పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల తమ రుణ వితరణ మరింత విస్తృతం కానుందని యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌, డిజిట్‌ అండ్‌ ట్రాన్సఫర్మేషన్‌ ప్రెసిడెంట్‌ సమీర్‌ శెట్టి తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్‌లో పర్సనల్‌ లోన్‌ కేవలం 30 సెకన్లలోనే మంజూరవుతుందని ఇరు సంస్థలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. దీనికి గానూ కస్టమర్‌ తన పాన్‌, పుట్టిన తేదీ, వృత్తి వివరాలు అందివ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు వ్యక్తికి ఎంత లోన్‌ మంజూరవుతుందో యాక్సిస్‌ బ్యాంక్‌ వెల్లడిస్తుంది. గరిష్ఠ పరిమితికి లోబడి మీకు కావాల్సినంత రుణం, కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. 6 నెలల నుంచి 36 నెలల వరకు కాలవ్యవధులు అందుబాటులో ఉంటాయి. రుణానికి సంబంధించిన పూర్తి వివరాలు, రీపేమెంట్‌ షెడ్యూల్‌ వంటి వివరాలను ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌కు 45 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని