Gautam Adani: అదానీ వార్షిక వేతనం రూ.10.41 కోట్లు.. సొంత ఎగ్జిక్యూటివ్‌ల కంటే తక్కువ!

Eenadu icon
By Business News Team Published : 08 Jun 2025 12:52 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Gautam Adani | ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలోని అత్యంత సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్న అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.10.41 కోట్ల వేతనం అందుకున్నారు. అయితే, దేశంలోని తోటి పారిశ్రామికవేత్తలు, తన గ్రూప్‌ కంపెనీల్లో పని చేస్తున్న కొంత మంది ఎగ్జిక్యూటివ్‌ల కంటే తక్కువ కావడం గమనార్హం. ఓడరేవులు, ఇంధన రంగాల్లో విస్తరించిన తొమ్మిది లిస్టెడ్‌ కంపెనీల్లో కేవలం రెండింటి నుంచి మాత్రమే ఆయన వేతనం తీసుకున్నారు. 2023-24లో రూ.9.26 కోట్లుగా ఉన్న ఈ మొత్తం 2024-25లో 12 శాతం పెరిగింది.  

గ్రూప్‌లో ప్రధాన సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (AEL) నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.26 కోట్లు అందుకున్నారు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాల రూపంలో మరో రూ.28 లక్షలు ఆయనకు లభించాయి. దీంతో ఆయన మొత్తం రూ.2.54 కోట్లు తీసుకున్నాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రూ.2.46 కోట్ల కంటే కొంచెం ఎక్కువ. మరో కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషనల్‌ ఎకనమిక్‌ జోన్‌ (APSEZ) నుంచి రూ.1.8 కోట్ల వేతనం, రూ.6.07 కోట్ల కమిషన్‌ (లాభాల్లో వాటా) తో కలిపి రూ.7.87 కోట్లు అందుకున్నారు. అంతకు ముందు ఏడాది ఈ మొత్తం రూ.6.8 కోట్లుగా ఉంది.

దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) వార్షిక వేతనం రూ.15కోట్లుగా ఉండేది. అయితే, కొవిడ్‌ తర్వాత ఆయన వేతనాన్ని తీసుకోవడం లేదు. ఇక భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత సునీత్‌ మిత్తల్‌ (2023-24లో రూ.32.27 కోట్లు), రాజీవ్‌ బజాజ్‌ (రూ.53.75 కోట్లు), పవన్‌ ముంజాల్‌ (రూ.109 కోట్లు), ఎల్‌అండ్‌టీ ఛైర్మన్‌ ఎస్‌.ఎన్‌. సుబ్రమణ్యం (76.25 కోట్లు), ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ (రూ.80.62కోట్లు) వేతనాలు అదానీ కంటే అధికంగా ఉన్నాయి. 

అదానీ గ్రూప్‌లోని కొందరు ఎగ్జిక్యూటివ్‌ల జీతాలు కూడా గౌతమ్‌ కంటే ఎక్కువ. ఏఈఎల్‌ సీఈఓ వినయ్‌ ప్రకాశ్‌ రూ.69.34 కోట్లు, అదానీ గ్రీన్‌ ఎనర్జీ సీఈఓ వినీత్‌ ఎస్‌.జైన్‌ రూ. 11.23 కోట్లు అందుకున్నారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం.. అదానీ సంపద విలువ 82.5 బిలియన్‌ డాలర్లు. హిండెన్‌బర్గ్‌ నివేదిక వల్ల ఆయన ఆస్తుల విలువ సుమారు 150 బిలియన్‌ డాలర్ల మేరకు తగ్గింది. అయినప్పటికీ గతేడాదిలో రెండు సార్లు ఆసియా అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఇక.. ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో ముకేశ్‌ అంబానీ 104 బిలియన్‌ డాలర్ల సంపదతో 17వ స్థానంలో, అదానీ 20వ స్థానంలో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు