Zero Interest: సున్నా వడ్డీ.. లాభమేనా?

పండగల నేపథ్యంలో ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు, షోరూముల్లో ఎక్కడ చూసినా రాయితీలే కనిపిస్తున్నాయి. గృహోపకరణాలు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా ఏది కొనాలన్నా సున్నా శాతం వడ్డీ (నో కాస్ట్‌ ఈఎంఐ)తో వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటోంది.

Updated : 27 Oct 2023 08:57 IST

పండగల నేపథ్యంలో ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లు, షోరూముల్లో ఎక్కడ చూసినా రాయితీలే కనిపిస్తున్నాయి. గృహోపకరణాలు, ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా ఏది కొనాలన్నా సున్నా శాతం వడ్డీ (నో కాస్ట్‌ ఈఎంఐ)తో వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటోంది. ఒక వస్తువును కొనాలనుకున్న చాలామంది ఈ నో కాస్ట్‌ ఈఎంఐనే ఎంచుకుంటున్నారు. దీన్ని ఎంచుకుంటే నిజంగా ఎలాంటి వడ్డీ భారం ఉండదా? తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలేమిటో చూద్దాం.

సున్నా శాతం వడ్డీ లేదా నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయాన్ని ఎంచుకుంటే వినియోగదారులు ఒక వస్తువును కొన్న వెంటనే దాని ధర మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి వడ్డీ భారం లేకుండా అసలు ధరనే నిర్ణీత వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ వాస్తవంగా వడ్డీ భారాన్ని రద్దు చేయడమేమీ ఉండదు. ఈ మొత్తాన్ని తయారీదారులు లేదా ఆ వస్తువులను విక్రయించే వారు భరిస్తారు. తమ వస్తువులను అధికంగా అమ్ముకునేందుకు వీలుగా ఉత్పత్తిదారులు ఇలాంటి వెసులుబాట్లను కల్పిస్తుంటారు.

సాధారణంగా పండగల సమయంలో వస్తువులపై కొంత రాయితీని ఇస్తుంటారు. నో కాస్ట్‌ ఈఎంఐ ఎంచుకున్న వినియోగదారులకు ఇలాంటి ప్రయోజనాలు లభించవు. ఆఫర్లను రద్దు చేసి, వస్తువు వాస్తవ ధరను ఈఎంఐ కిందకు మారుస్తారు. ఇంకొన్ని సందర్భాల్లో వడ్డీ భారాన్ని వస్తువుల ధరలో కలిపి, ఈఎంఐగా మారుస్తారు. నో కాస్ట్‌ ఈఎంఐని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలన్నీ జాగ్రత్తగా గమనించాలి. ఒక వస్తువును ఏ ధరకు విక్రయిస్తున్నారు, నో కాస్ట్‌ ఈఎంఐలో కొంటే ఎంతకు లభిస్తోంది అనే వివరాలు చూసుకోవాలి.

ఉదాహరణకు మీరు రూ.లక్ష విలువైన వస్తువు తీసుకున్నారనుకుందాం. సాధారణ ఈఎంఐని ఎంచుకుంటే వడ్డీ రేటు 12 శాతం వరకూ ఉంటుంది. ఆరు నెలలకు రూ.6,000 వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. విక్రేతలే ఈ భారాన్ని భరిస్తే.. ఈ వడ్డీ మొత్తాన్ని కొనుగోలుదారుడు చెల్లించక్కర్లేదు. కేవలం రూ.లక్ష చెల్లిస్తే చాలు. కొన్నిసార్లు ఇదే వస్తువుపై రూ.10వేల వరకూ రాయితీ ఉండొచ్చు. ఇలాంటి సందర్భాల్లో నో కాస్ట్‌ ఈఎంఐని ఎంచుకుంటే.. మొత్తం రూ.1,00,000 చెల్లించాల్సిందే. కొన్నిసార్లు వడ్డీని కలిపి ఈఎంఐ కిందకు మారుస్తారు.

ఎప్పుడంటే..

ఖరీదైన వస్తువులు కొని, మొత్తం ఒకేసారి చెల్లించలేని పరిస్థితులు ఉన్నప్పుడు నో కాస్ట్‌ ఈఎంఐని ఎంచుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసి, ఆ మొత్తాన్ని వాయిదాల కిందకూ మార్చుకోవచ్చు. కానీ, వాయిదాలు చెల్లించే వరకూ క్రెడిట్‌ కార్డు పరిమితి తగ్గిపోతుంది. దీనికి బదులుగా నో కాస్ట్‌ ఈఎంఐ ఎంచుకోవడం మంచిది. పైగా క్రెడిట్‌ కార్డు వాయిదాలకు 20 శాతం వరకూ వడ్డీ ఉంటుంది.

గుర్తుంచుకోండి..

  • కొన్ని సందర్భాల్లో నో కాస్ట్‌ ఈఎంఐ స్వల్పకాలిక గడువుతో వస్తాయి. దీనివల్ల వాయిదా మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ సకాలంలో వాయిదా చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది. జరిమానాలూ ఉంటాయి. నో కాస్ట్‌ ఈఎంఐని ఎంచుకునే ముందే ఎన్ని వాయిదాలు, ఎంత మొత్తం చెల్లించాలన్నది సరిగా చూసుకోవాలి.
  • వడ్డీ భారం లేదు కదా అని అనవసరమైన వస్తువులనూ కొనుగోలు చేస్తే..నెలనెలా చెల్లించడం కష్టం కావచ్చు.
  • కొన్ని కంపెనీలు మాత్రమే నో కాస్ట్‌ ఈఎంఐని ఇస్తుంటాయి. అదీ ఎంపిక చేసిన వస్తువులపైనే. కాబట్టి, కొనుగోలు చేసే ముందు ఈ వివరాలు పూర్తిగా             తెలుసుకోండి.
  • కొన్నిసార్లు డౌన్‌ పేమెంట్‌, ప్రాసెసింగ్‌  ఫీజుల రూపంలో కొంత మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఈ వివరాలను ముందే చూసుకోవాలి.
  • కొనాలనుకున్న వస్తువు ఆన్‌లైన్‌లో, షోరూంలో ఏ ధరకు దొరుకుతుందో చూడండి. నో కాస్ట్‌ ఈఎంఐ ఎంచుకోవడం వల్ల భారం అవుతుందా పరిశీలించండి. ఆ తర్వాతే కొనుగోలు చేయండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని