కారు రుణం తీసుకుంటున్నారా?

కొత్త కారు కొనాలనే ఆలోచనతో ఉన్నారా? రుణం ఎక్కడ తీసుకోవాలా అని చూస్తున్నారా? దీనికన్నా ముందు కొన్ని విషయాలను గమనించాల్సిన అవసరం ఉంది. అవేమిటో చూద్దామా...

Updated : 17 Nov 2023 10:35 IST

కొత్త కారు కొనాలనే ఆలోచనతో ఉన్నారా? రుణం ఎక్కడ తీసుకోవాలా అని చూస్తున్నారా? దీనికన్నా ముందు కొన్ని విషయాలను గమనించాల్సిన అవసరం ఉంది. అవేమిటో చూద్దామా...

కారు కొనాలి? అనే ప్రశ్న వేసుకుంటారు కానీ, ఎక్కడ, ఎంత రుణం తీసుకోవాలి, కారు కోసం అప్పు చేసేందుకు మనం సిద్ధంగానే ఉన్నామా అనే విషయాన్ని చాలా తక్కువమంది ఆలోచిస్తారు. కేవలం కారు కొనడానికే కాదు.. తీసుకోబోయే రుణానికీ ఒక కచ్చితమైన ప్రణాళిక ఉండాలి.

క్రెడిట్‌ స్కోరు ఉందా?

రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు బ్యాంకులు ముందుగా రుణగ్రహీత క్రెడిట్‌ స్కోరును విశ్లేషిస్తాయి. తక్కువ క్రెడిట్‌ స్కోరున్న వారికి అప్పు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావు. ముఖ్యంగా వాహన రుణాల విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉంటాయి. కాబట్టి, కారు కొనాలని అనుకున్న వెంటనే క్రెడిట్‌ స్కోరును గమనించాలి. అందులో ఏమైనా వ్యత్యాస్యాలుంటే వెంటనే సంబంధిత బ్యాంకు, క్రెడిట్‌ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లాలి. స్కోరు 750కి మించి ఉన్నప్పడే అనుకున్న అప్పు అందుకునేందుకు వీలవుతుంది.

పోల్చి చూడండి...

ముందుగా వివిధ బ్యాంకులు అందిస్తున్న రుణాలను, వాటి వడ్డీ రేట్లను పోల్చి చూడండి. బ్యాంకుల వెబ్‌సైట్లకు వెళ్లి, ఈ వివరాలు సులభంగానే తెలుసుకోవచ్చు. కారు రుణం సాధారణంగా ఏడేళ్లపాటు ఉంటుంది. కాబట్టి, రుణదాత విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. వాయిదా ఆలస్యం అయితే విధించే జరిమానాలతో పాటు, అన్ని రుసుముల గురించి అవగాహన పెంచుకోండి. ఎంత వరకూ రుణం ఇస్తున్నారో చూసుకోండి. కొన్ని బ్యాంకులు ఆన్‌రోడ్‌పై 100శాతం రుణం ఇస్తున్నాయి. మీ అర్హతను బట్టి, ఇలాంటివీ చూడొచ్చు. వీలైనంత వరకూ తక్కువ రుణం తీసుకోవడం ఎప్పుడూ మంచిదని గుర్తుంచుకోండి.

వడ్డీ రేట్ల సంగతి...

మీ వేతన ఖాతా లేదా పొదుపు ఖాతా ఉన్న బ్యాంకు నుంచి సులభంగా రుణం అందుకోవచ్చు. కానీ, మరో బ్యాంకుతో పోలిస్తే వడ్డీ రేటు కాస్త అధికంగా ఉందనకుందాం. అప్పుడు తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకు వైపే మొగ్గు చూపాలి. వడ్డీలో చిన్న వ్యత్యాసం మీ దీర్ఘకాలిక చెల్లింపులపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. వివిధ వడ్డీ రేట్ల ఆధారంగా ఈఎంఐ ఎంత చెల్లించాలో చూసుకోండి.  తక్కువ వడ్డీ ఉన్న బ్యాంకు నుంచే వాహన రుణం తీసుకోవడం ఎప్పుడూ మంచిది.

ఇప్పటికే రుణాలుంటే..

కొత్త అప్పు చేసే ముందు ఇప్పటికే ఉన్న రుణాల సంగతినీ చూడాలి. మీ ఆదాయం, రుణాలను తిరిగి చెల్లించే సామర్థ్యం చూసుకోవాలి. అధిక రుణ-ఆదాయ నిష్పత్తి క్రెడిట్‌ స్కోరును ప్రభావితం చేస్తుంది. కాబట్టి, కారు రుణం తీసుకునే ముందు చిన్న చిన్న రుణాలను తీర్చేయండి. అప్పుడు మీకు అప్పు ఎక్కువ లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రూ.50వేల లోపు వ్యక్తిగత రుణాలను తిరిగి చెల్లించేయండి.

మీ బ్యాంకు నుంచి మీకు ఇప్పటికే ముందస్తు మంజూరయ్యిందా ఒకసారి చూసుకోండి. అప్పుడు కారు కొనుగోలు మరింత సులభం అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని