టాపప్‌ రుణం తీసుకుంటున్నారా?

రుణం తీసుకొని, వాటికి క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్న వారికి బ్యాంకులు టాపప్‌ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. ఇలా ఇచ్చిన అప్పు అప్పటికే ఉన్న రుణం అసలుకు కలిపేస్తారు. అప్పుడు రుణ మొత్తం, వ్యవధి పెరుగుతుంది. ఇ

Updated : 06 Dec 2023 14:39 IST


ఇప్పటికే వ్యక్తిగత, గృహ, వాహన రుణాలున్నాయా? దీనిపై అదనంగా రుణం (టాపప్‌) తీసుకోవాలనే ఆలోచన ఉందా? ముందుగా ఈ వివరాలు తెలుసుకోండి.

రుణం తీసుకొని, వాటికి క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్న వారికి బ్యాంకులు టాపప్‌ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. ఇలా ఇచ్చిన అప్పు అప్పటికే ఉన్న రుణం అసలుకు కలిపేస్తారు. అప్పుడు రుణ మొత్తం, వ్యవధి పెరుగుతుంది. ఇప్పటికే రుణం తీసుకున్న వారికి మంచి చెల్లింపుల చరిత్ర ఉన్నప్పుడు బ్యాంకులు సులువుగా టాపప్‌ రుణాలను ఇచ్చేందుకు ముందుకు వస్తుంటాయి. ఎంత మేరకు టాపప్‌ ఇవ్వాలన్నది బ్యాంకులను బట్టి, రుణ గ్రహీత క్రెడిట్‌ స్కోరు, ఆదాయం, తిరిగి చెల్లించే స్తోమత ఆధారంగా మారుతూ ఉంటుంది. ఇప్పటికే ఉన్న అప్పులూ దీన్ని నిర్ణయిస్తాయి.
చాలా వరకూ టాపప్‌ రుణాలను తీసుకునేందుకు కొత్తగా దరఖాస్తు సమర్పించడం, అవసరమైన పత్రాలను ఇవ్వడంలాంటివి అవసరం ఉండవు. పరిశీలనా రుసుమూ వసూలు చేయవు. ఒకసారి ఈ రుణం ఇస్తామని బ్యాంకులు చెబితే ఎప్పుడైనా సరే దాన్ని తీసుకునే వీలుంటుంది.

గృహరుణంపై...

ఇంటి రుణం తీసుకొని, కొంత మొత్తం చెల్లించిన తర్వాత బ్యాంకులు దానిపై టాపప్‌ ఇచ్చేందుకు సిద్ధపడతాయి. సాధారణ గృహరుణంతో పోలిస్తే ఈ టాపప్‌ రుణానికి కాస్త అధిక వడ్డీ రేటు ఉండే అవకాశం ఉంది. ఈ రుణం తిరిగి చెల్లించాల్సిన వ్యవధి ప్రాథమిక రుణానికి అనుసంధానంగా ఉంటుంది. ఇలా తీసుకున్న మొత్తాన్ని ఇంటి మరమ్మతు, పిల్లల చదువుల ఖర్చు, అధిక వడ్డీ ఉన్న రుణాలను తీర్చేందుకు వాడుకోవచ్చు.

ఎప్పుడు తీసుకోవాలి?

వాస్తవంగా నిధుల అవసరం ఉన్నప్పుడు మాత్రమే గృహరుణం టాపప్‌ గురించి ఆలోచించాలి. దీనికి గృహరుణం కన్నా కాస్త అధిక వడ్డీ ఉంటుంది. అయినప్పటికీ, వ్యక్తిగత రుణాలతో పోలిస్తే తక్కువే.

అదే సమయంలో టాపప్‌ తీసుకోవడం వల్ల పడే అదనపు భారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. నెలనెలా ఈఎంఐని చెల్లించగలరా చూసుకోవాలి.
వడ్డీ రేటు తక్కువగానే ఉన్నప్పటికీ దీర్ఘకాలంపాటు చెల్లించినప్పుడు ఈ భారం అధికంగానే ఉండే ఆస్కారం ఉంది. అంటే, వడ్డీ రూపంలో మీరు చెల్లించే మొత్తం చాలా సందర్భాల్లో అసలుకు మించి పోవచ్చు. అధిక మొత్తంలో రుణం కావాలనుకున్నప్పుడు బ్యాంకుతో వడ్డీ రేటు విషయంలో బేరమాడండి. దీర్ఘకాలంపాటు కొనసాగే రుణాన్ని వదులుకోవడానికి రుణదాతలు అంత తేలిగ్గా ఇష్టపడరు.

క్రెడిట్‌ స్కోరు 750కి మించి ఉన్నప్పుడు బ్యాంకులు వడ్డీ రేటును తగ్గిస్తున్నాయి. ముందుగా ఈ వెసులుబాటును ఉపయోగించుకునేందుకు ప్రయత్నించండి. ఆ తర్వాతే టాపప్‌ రుణాన్ని తీసుకోవాలి. అప్పుడు టాపప్‌ రుణంపైనా ఆ మేరకు వడ్డీ తగ్గుతుంది.

వ్యక్తిగత రుణం ఉంటే...

వ్యక్తిగత రుణాలపై సాధారణంగా వడ్డీ రేటు 13-15 శాతం వరకూ ఉంటుంది. ఇంత అధిక వడ్డీకి తీసుకున్న రుణాలపై టాపప్‌ తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. వడ్డీ భారం అధికంగా ఉంటుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకూ ఈ రుణాలున్న వారు టాపప్‌ రుణానికి దూరంగా ఉండటమే ఉత్తమం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని