Gold Loan: అత్యవసరంలో పసిడి రుణం..

వ్యక్తిగత రుణాలకు నిబంధనలు కఠినతరం  అవడంతో అప్పు దొరకడం కాస్త కష్టమవుతోంది.అత్యవసర సందర్భాల్లో ఉన్న సులువైన మార్గం బంగారంపై రుణం తీసుకోవడం. ఈ నేపథ్యంలో ఈ అప్పు తీసుకునేటప్పుడు ఏం చూడాలి? అనే అంశాలను తెలుసుకుందాం.

Updated : 01 Dec 2023 07:53 IST

వ్యక్తిగత రుణాలకు నిబంధనలు కఠినతరం అవడంతో అప్పు దొరకడం కాస్త కష్టమవుతోంది.అత్యవసర సందర్భాల్లో ఉన్న సులువైన మార్గం బంగారంపై రుణం తీసుకోవడం. ఈ నేపథ్యంలో ఈ అప్పు తీసుకునేటప్పుడు ఏం చూడాలి? అనే అంశాలను తెలుసుకుందాం.

బంగారం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. సంపద, శ్రేయస్సు చిహ్నంగా దీన్ని భావిస్తుంటారు. అదే సమయంలో దీనికి ద్రవ్య విలువా ఉంటుంది. అందుకే, బంగారం ఆర్థిక భద్రతకు ఒక నమ్మకమైన ఆస్తిగా మారింది. పసిడి మనకు అందించే ప్రయోజనాల్లో రుణం తీసుకునే వెసులుబాటు కలిసొచ్చే అంశం.

రుణగ్రహీత తమ బంగారం (18-24 క్యారెట్ల) వస్తువులను తాకట్టు పెట్టి, రుణదాత నుంచి రుణం(Gold Loan) తీసుకోవచ్చు. ఇది పూర్తిగా సురక్షిత రుణంగా భావిస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తాము ఇచ్చిన అప్పు పూర్తిగా వసూలయ్యే వరకూ బంగారాన్ని హామీగా ఉంచుకుంటాయి. వ్యక్తిగత రుణాల్లాంటి వాటితో పోలిస్తే వీటిని పొందడం చాలా వేగం. సులభం.

 తక్షణమే: ఇతర ఆస్తుల మాదిరిగా కాకుండా, బంగారం త్వరగా నగదు రూపంలోకి మారుతుంది. అంటే వెంటనే దీన్ని నగదుగా మార్చుకోవచ్చు. తాకట్టు పెట్టి, అప్పు తీసుకోవచ్చు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మీకు రుణం అందుతుంది.

 రుణ మొత్తం: బంగారం విలువలో నిర్ణీత శాతాన్ని రుణంగా ఇస్తారు. బంగారం ధరలు సాధారణంగా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి, మీ బంగారంపై వచ్చే అప్పు మొత్తం అధికంగానే ఉంటుంది. మీ బంగారం విలువను క్రమం తప్పకుండా మూల్యాంకనం చేయడం ద్వారా అది ఎంత మొత్తం రుణం అందిస్తుందనే విషయంలో మీకు కొంత అవగాహన వస్తుంది.

 తక్కువ వడ్డీ: బంగారం రుణాలు సురక్షితం. కాబట్టి, రుణదాతలకు నష్టభయం తక్కువగా ఉంటుంది. ఇది వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డు రుణాలతో పోలిస్తే తక్కువ వడ్డీ రేటుకు లభిస్తుంది. రుణం ఇచ్చే సంస్థ నిబంధనలను బట్టి, ఇది మారుతుంది.

 క్రెడిట్‌ స్కోరు: రుణ చరిత్ర లేని వారు, తక్కువ క్రెడిట్‌ స్కోరున్న వారూ బంగారం రుణాలను తీసుకునేందుకు ఏ ఇబ్బందులూ ఉండవు. బలమైన క్రెడిట్‌ చరిత్ర లేకపోయినా బ్యాంకులు ఈ రుణాలను ఇస్తుంటాయి. ఈ రుణాన్ని సకాలంలో చెల్లించినప్పుడు మీ క్రెడిట్‌ స్కోరుపై సానుకూల ప్రభావం చూపుతుంది.

చెల్లింపులో సౌలభ్యం: అనేక సంస్థలు బంగారంపై తీసుకున్న రుణాలను సులభంగా చెల్లించేందుకు వెసులుబాటును ఇస్తున్నాయి. రుణగ్రహీతలు సాధారణ నెలవారీ వాయిదాలు (ఈఎంఐ)లను ఎంచుకోవచ్చు. లేదా వడ్డీని ముందస్తుగా చెల్లించేయొచ్చు. రుణ కాలం ముగిసే సమయానికి అసలు మొత్తాన్ని తీర్చేయొచ్చు. ఆర్థిక వ్యవహారాలను మరింత   సమర్థంగా నిర్వహించడంలో ఈ రుణాలు కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి, అవసరమైనప్పుడు ఈ రుణం తీసుకోవచ్చు.

ఇవీ చూడాలి..

  • బంగారంపై రుణాలు అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ కొన్ని పరిమితులూ ఉంటాయి.
  • మారుతున్న బంగారం ధరలు ఈ రుణాలపై ప్రభావం చూపిస్తాయి. ధరలలో గణనీయమైన తగ్గుదల ఉంటే.. రుణదాతలు అదనపు మొత్తాన్ని జమ చేయమనడం లేదా ఆ మేరకు బంగారం తాకట్టు పెట్టమని కోరవచ్చు.
  • రుణదాతలు బంగారం పూర్తి విలువపై రుణాలను అందించరు. బంగారం విలువలో కొంత శాతాన్ని మాత్రమే అందిస్తారు. ఇది సంస్థ, ప్రస్తుత నిబంధనల ప్రకారం 60 శాతం నుంచి 90 శాతం వరకూ ఉంటుంది.
  • మీరు రుణం కోసం హామీగా ఉంచిన బంగారాన్ని సురక్షితంగా భద్రపర్చేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయా లేదా చూసుకోండి.
  • చివరగా.. బంగారాన్ని కేవలం లాకర్లలో నిల్వ చేయడం, అలంకరణకు మాత్రమే ఉపయోగపడే లోహంగానే చూడకూడదు. ఆర్థిక సంక్షోభాల సమయంలో ఆదుకునే ఆర్థిక         పథకంగానూ భావించాలి.

భూషన్‌ పాడ్కిల్‌, సీనియర్‌ డైరెక్టర్‌, హెడ్‌ ఆఫ్‌ కన్జూమర్‌ ఇంటరాక్టివ్‌ ఇండియా, ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని