క్రెడిట్‌ స్కోరు పెంచుకుందామిలా

ఆర్థిక ప్రణాళికలో క్రెడిట్‌ స్కోరు ఎంతో కీలకంగా మారింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. మీ ఆర్థిక ఆరోగ్యం, బాధ్యతకూ ప్రతిబింబం. ఎప్పుడైనా అనివార్య కారణాలతో ఈ స్కోరు తగ్గొచ్చు.

Updated : 08 Dec 2023 03:15 IST

ఆర్థిక ప్రణాళికలో క్రెడిట్‌ స్కోరు ఎంతో కీలకంగా మారింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. మీ ఆర్థిక ఆరోగ్యం, బాధ్యతకూ ప్రతిబింబం. ఎప్పుడైనా అనివార్య కారణాలతో ఈ స్కోరు తగ్గొచ్చు. దీనికోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మళ్లీ మంచి స్కోరును సాధించేందుకు కొన్ని సూత్రాలు  పాటిస్తే చాలు.

క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉందంటే.. దానర్థం కొన్ని రోజులుగా మనం ఆర్థికంగా బాధ్యతగా లేమని. అప్పటికప్పుడు ఈ స్కోరు తగ్గడం అంటూ ఉండదు. తీసుకున్న రుణాలకు వాయిదాలను, క్రెడిట్‌ కార్డు బిల్లులను గడువు లోపు చెల్లించకపోవడంలాంటివి ఇందుకు కారణం అవుతాయి. రుణ వాయిదాలను ఎలా చెల్లిస్తున్నారన్నదాన్ని బట్టి, ఈ స్కోరు మారుతూ ఉంటుంది. అంతేకానీ ఒకే దగ్గర ఇది ఆగిపోదని గుర్తుంచుకోండి.

  • తక్కువగా ఉన్న స్కోరును మెరుగుపర్చుకోవడానికి ఉన్న ఏకైక మార్గం.. రుణ వాయిదా బాకీలను తీర్చేయడమే. అధిక సంఖ్యలో రుణాలు, క్రెడిట్‌ కార్డులు ఉంటే.. వాటన్నింటినీ ఒకే దగ్గరకు చేర్చేందుకు ప్రయత్నించండి. దీనివల్ల రుణాల సంఖ్య తగ్గుతుంది. దీన్ని సులభంగా తీర్చేసేందుకూ వీలవుతుంది. దీనికోసం మీ బ్యాంకులను సంప్రదించండి.
  • వాయిదాల చెల్లింపులో జాగ్రత్తగా ఉండండి. మీ నికర ఆదాయంలో 30శాతానికి మించకుండా వాయిదాలుండాలి. అప్పుడే మీ క్రెడిట్‌ స్కోరు పెరుగుతూ వస్తుంది. వాయిదాలను ఎప్పటికప్పుడు సకాలంలో చెల్లించండి.
  • అవసరం లేకున్నా అప్పు తీసుకోవడం, క్రెడిట్‌ కార్డులను వాడటం మంచిది కాదు. రుణం ఇస్తామంటూ వచ్చే ఫోన్లకూ సమాధానం ఇవ్వకూడదు. దీనివల్ల క్రెడిట్‌ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
  • హామీ లేని రుణాలు అధికంగా ఉంటే క్రెడిట్‌ స్కోరు తగ్గే ఆస్కారం ఉంటుంది. కాబట్టి, రుణాలను తీసుకునేటప్పుడు వ్యక్తిగత రుణాలతో పాటు, బంగారం తాకట్టు రుణాల్లాంటివీ ఉండేలా చూసుకోండి. ఇలా ఉన్నప్పుడు మీరు అప్పుల విషయంలో బాధ్యతగానే ఉన్నట్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు భావిస్తాయి.
  • మూడు నెలలకు మించి వాయిదాలు చెల్లించకపోతే.. బ్యాంకులు ఆ అప్పును ఎన్‌పీఏగా మారుస్తాయి. తర్వాత మనకు చిక్కులు తప్పవు. కాబట్టి, వీలైనంత వరకూ రుణ వాయిదాలను ఎక్కువ రోజులు చెల్లించకుండా ఉండకూడదు.
  • అనుకోని పరిస్థితుల్లో వాయిదాలు చెల్లించడం వీలు కాకపోతే.. బ్యాంకులు సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని సూచిస్తుంటాయి. సాధ్యమైనంత వరకూ ఇది చివరి అవకాశంగానే చూడాలి. బ్యాంకు అడగగానే దీనికి అంగీకరించకూడదు. సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఏమాత్రం ఇష్టపడవు.
  • కొన్నిసార్లు మనం పొరపాటేమీ చేయకున్నా స్కోరు తగ్గుతూ వస్తుంది. ఇలాంటప్పుడు మీ క్రెడిట్‌ నివేదికను ఒకసారి నిశితంగా పరిశీలించండి. మీకు సంబంధం లేని రుణాలేమైనా ఉన్నాయా చూసుకోండి. అలాంటివి గమనిస్తే వెంటనే బ్యాంకు, క్రెడిట్‌ బ్యూరోలకు ఫిర్యాదు చేయండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని