Credit Score: మంచి క్రెడిట్‌ స్కోరు కోసం..

ఒక వ్యక్తి ఆర్థికంగా ఎంత కచ్చితంగా ఉన్నారో తెలుసుకునేందుకు వారి క్రెడిట్‌ నివేదిక/స్కోరును గమనిస్తే చాలు. 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోరుంటే..

Updated : 13 Jan 2024 14:47 IST

క వ్యక్తి ఆర్థికంగా ఎంత కచ్చితంగా ఉన్నారో తెలుసుకునేందుకు వారి క్రెడిట్‌ నివేదిక/స్కోరును గమనిస్తే చాలు. 750 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోరుంటే.. మెరుగైన పరిస్థితిలో ఉన్నట్లే. కొత్త రుణాలు తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకులు దరఖాస్తులను సులభంగా పరిష్కరిస్తాయి. క్రెడిట్‌ స్కోరు సరిగా లేకపోతే.. రుణదాతలు దరఖాస్తును తిరస్కరించడం లేదా సహ-రుణగ్రహీత కోసం కోరడంలాంటివి అడగొచ్చు. మరీ తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉంటే.. రుణదాత మిమ్మల్ని అధిక రిస్కు ఉన్న రుణగ్రహీతగా పరిగణిస్తారు. రుణం ఇచ్చినా అధిక వడ్డీ రేటు వసూలు చేసే అవకాశముంది. మంచి క్రెడిట్‌ స్కోరున్నప్పుడు రుణగ్రహీత కాస్త తక్కువ వడ్డీకి రుణాన్ని పొందే వీలుంటుంది. అధిక క్రెడిట్‌ స్కోరు లేనప్పుడూ బ్యాంకులు కొన్నిసార్లు అధిక వడ్డీని వసూలు చేస్తుంటాయి. కాబట్టి, మంచి క్రెడిట్‌ స్కోరు కోసం ఏం చేయాలంటే..

  • తక్కువ క్రెడిట్‌ పరిమితితో ప్రాథమిక క్రెడిట్‌ కార్డును పొందండి. దీనిద్వారా మీ క్రెడిట్‌ స్కోరును నిర్మించేందుకు మొదటి అడుగు పడుతుంది. మీ వేతనం ఖాతా ఉన్న బ్యాంకు నుంచి సులభంగానే కార్డును తీసుకోవచ్చు. ఒకసారి కార్డును పొందిన తర్వాత దాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి.
  • మీ బాకీలను సకాలంలో చెల్లించండి. మీ క్రెడిట్‌ వినియోగాన్ని అందుబాటులో ఉన్న పరిమితిలో 30 శాతం మించకుండా చూసుకోండి. కార్డు బిల్లును ఎప్పటికప్పుడు తీర్చేయడం ద్వారా ఆరోగ్యకరమైన క్రెడిట్‌ చరిత్ర సాధ్యమవుతుంది.  
  • కొన్నిసార్లు క్రెడిట్‌ కార్డును ఇవ్వకపోవచ్చు. ఇలాంటప్పుడు కొంత ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, దానికి అనుబంధంగా క్రెడిట్‌ కార్డును తీసుకోవచ్చు. కార్డును వాడటం అలవాటయ్యాక సాధారణ క్రెడిట్‌ కార్డును తీసుకోవాలి.
  • ఎలక్ట్రానిక్‌ పరికరాలను రుణాల ద్వారా తీసుకునేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలున్నాయి. ముందుగా మీరు తక్కువ విలువైన పరికరాన్ని రుణంపై తీసుకోండి. ఉదాహరణకు మొబైల్‌ ఫోనును కొనుగోలు చేసి 6 లేదా 8 నెలల్లో వాయిదాలను చెల్లిస్తే.. మంచి  స్కోరు సాధ్యమవుతుంది.  
  • రుణాల కోసం దరఖాస్తు చేసేటప్పుడు, వాటిని తిరిగి చెల్లించే శక్తి గురించి తెలుసుకోవాలి. అప్పు తీసుకునే ముందు మీ అవసరాలను అంచనా వేయండి. మీ బాకీలను సకాలంలో తిరిగి చెల్లించండి. క్రెడిట్‌ స్కోరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. ఏదైనా తప్పులుంటే వెంటనే సరిచేసుకునేందుకు వీలవుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని