క్రెడిట్‌ కార్డు.. ఇలా వాడుదాం

ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి.. క్రెడిట్‌ కార్డుల వినియోగదారులను ఆకర్షించేది ఇదే. వెసులుబాటు ఉంది కదా అని అవసరానికి మించి వాడితే అప్పుల ఊబిలోకి నెట్టేసే ప్రమాదమూ ఉంది.

Updated : 02 Feb 2024 04:42 IST

దేశంలో క్రెడిట్‌ కార్డుల విస్తృతి ఒక్కసారిగా పెరిగింది. బ్యాంకులు సులభంగా క్రెడిట్‌ కార్డులను జారీ చేస్తుండటంతో 10 కోట్లకు పైగా క్రెడిట్‌ కార్డులు ఇప్పుడు వినియోగంలోకి వచ్చాయి. డిజిటలీకరణ పెరగడం, విస్తృతమైన ఆఫర్లు లభిస్తుండటంతో చాలామంది వీటిని తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే క్రెడిట్‌ కార్డులున్న, కొత్తగా తీసుకోవాలనుకుంటున్న వారూ వీటిని ఉపయోగించే టప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకుందాం.

ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి.. క్రెడిట్‌ కార్డుల వినియోగదారులను ఆకర్షించేది ఇదే. వెసులుబాటు ఉంది కదా అని అవసరానికి మించి వాడితే అప్పుల ఊబిలోకి నెట్టేసే ప్రమాదమూ ఉంది. కాబట్టి, ఖర్చు చేయడంలోనూ నియంత్రణ పాటించాలి.

తగిన కార్డు ఎంపిక..

భారతీయ మార్కెట్‌లో క్రెడిట్‌ కార్డులు తీసుకోవడం ఏమంత కష్టం కాదు. ఏ కార్డు ఎంచుకోవాలన్నదే క్లిష్టమైన ప్రక్రియ. అందుబాటులో ఉన్న క్రెడిట్‌ కార్డులలో మీ అవసరాలకు ఏది సరిపోతుందో చూసుకోండి. తగిన సమాచారంతో నిర్ణయం తీసుకోవాలి. కార్డును వినియోగించేది మీరు. మీ అవసరాలేమిటి, అందుకు అది ఎంతమేరకు సరిపోతుందనేది చూసుకున్నాకే ఎంపిక చేసుకోండి.

అర్థం చేసుకోండి..

ఆర్థిక ఉత్పత్తి ఏదైనా సరే.. దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే మంచి ఫలితాలు పొందగలం. క్రెడిట్‌ కార్డూ ఇందుకు మినహాయింపేమీ కాదు. కార్డు తీసుకున్నప్పుడు దానికి వర్తించే రుసుములు ఏమిటి? వాటిని నివారించేందుకు ఉన్న మార్గాలు, షరతుల గురించి తెలుసుకోవాలి. కార్డుతో పాటు వచ్చే సమాచారాన్ని పూర్తిగా చదవండి. అప్పుడే క్రెడిట్‌ కార్డు గురించి పూర్తి అవగాహన వస్తుంది. కార్డు ఉచితం అంటే.. ఎలాంటి రుసుములూ ఉండవనుకోవద్దు.. ఏడాదికి నిర్ణీత మొత్తం ఖర్చు చేసినప్పుడే ఈ వెసులుబాటు ఉంటుంది. వార్షిక రుసుములు, ఆలస్యపు చెల్లింపు, విదేశీ లావాదేవీలు ఇలా ప్రతిదానికీ ఒక రుసుము ఉంటుంది. వీటన్నింటి గురించీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీ క్రెడిట్‌ కార్డుకు చెల్లించే ప్రతి రుసుమూ మీ నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తుందని మర్చిపోవద్దు.

అనుకోని ఖర్చులకు..

ఆర్థిక నిర్వహణలో బడ్జెట్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అనుకోని ఖర్చులకు క్రెడిట్‌ కార్డు వాడకం అనివార్యం కావచ్చు. కొన్నిసార్లు అవసరమైన ఖర్చులకూ దీన్ని వాడుకుంటాం. ముఖ్యంగా రివార్డు పాయింట్లను దృష్టిలో పెట్టుకొని కార్డు ద్వారా చెల్లిస్తుంటాం. నగదు వెనక్కి ప్రయోజనాలూ అందుతాయి. వీటి మాయలో పడి, కొన్నిసార్లు వాస్తవ ఖర్చుకు మించి అధిక వ్యయానికి దారి తీయొచ్చు. కాబట్టి, నెలవారీ ఖర్చులకు డెబిట్‌ కార్డును వినియోగించడమే ఉత్తమం. అనుకోని ఖర్చులకు మాత్రమే క్రెడిట్‌ కార్డును వినియోగించాలి.

పరిమితిని ఏర్పాటు చేయండి..

దేశీయ, అంతర్జాతీయ లావాదేవీల కోసం విభిన్న వ్యయ పరిమితులను ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల కార్డు మోసాలను నియంత్రించడంతోపాటు, అధికంగా కొనుగోళ్లను నియంత్రించేందుకూ వ్యయ పరిమితి తోడ్పడుతుంది. అవసరం లేని సందర్భాల్లో అంతర్జాతీయ లావాదేవీలను పూర్తిగా నిష్క్రియం చేయండి. దీనివల్ల కార్డు పోయినా ఇబ్బంది ఉండదు.

సకాలంలో చెల్లింపులు..

కార్డు బిల్లులను సకాలంలో చెల్లించకపోతే..30 శాతం వరకూ వడ్డీ విధించే అవకాశాలున్నాయి. పైగా అపరాధ రుసుములు ఉంటాయి. క్రెడిట్‌ స్కోరుపైనా దీని ప్రభావం పడుతుంది. కాలక్రమేణా ఇవి పెద్ద మొత్తంగా మారే అవకాశం ఉంది. కనీస బకాయి మొత్తం అనే ఆకర్షణలో చిక్కుకుపోవద్దు. సాధ్యమైనంత వరకూ పూర్తి బిల్లును చెల్లించడమే మేలు.

నగదు తీయొద్దు..

క్రెడిట్‌ కార్డులతో నగదును తీసుకున్నప్పుడు 24-36 శాతం వరకూ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వడ్డీ తక్షణమే అమల్లోకి వస్తుంది. కాబట్టి, కొనుగోళ్లకు తప్ప నగదు కోసం క్రెడిట్‌ కార్డులను  వాడకపోవడమే మంచిది.

రివార్డు పాయింట్లు..

క్రెడిట్‌ కార్డులు రివార్డు పాయింట్లను అందిస్తాయి. వీటి గడువు ముగిసే లోపే వినియోగించుకునేందుకు ప్రయత్నించండి. కొనుగోళ్లు, ప్రయాణం, ఇతర ఆకర్షణీయమైన ఆఫర్ల ద్వారా వచ్చే రివార్డు పాయింట్లు, నగదు వెనక్కిలాంటివి మీకు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయి. బాధ్యతాయుతంగా వినియోగించినప్పుడు క్రెడిట్‌ కార్డులు పలు ప్రయోజనాలను అందిస్తాయి. ఖర్చుల ప్రణాళికలను సిద్ధం చేసుకొని, ఆర్థిక క్రమశిక్షణ పాటించినంతకాలం ఇవి మనకు ఉపయోగమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని