వాలెట్‌ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు

రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) అంతర్భాగంగా మారింది. ఎన్‌పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి.

Published : 19 Apr 2024 00:03 IST

రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) అంతర్భాగంగా మారింది. ఎన్‌పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. యూపీఐ చెల్లింపుల విధానంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ, ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ)లను అందిస్తున్న సంస్థల వాలెట్లలో ఉన్న డబ్బుతో యూపీఐ చెల్లింపుల విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది.  ఇక నుంచి పీపీఐలను థర్డ్‌ పార్టీ అప్లికేషన్‌లతో అనుసంధానం చేసేందుకూ వీలు కల్పించాలని ప్రతిపాదించింది.

ప్రీ పెయిడ్‌ చెల్లింపు సాధనాల్లో (పీపీఐ) ముందుగానే మనం కొంత డబ్బును జమ చేసి పెట్టుకోవచ్చు. వీటిని వాలెట్లు, లేదా ప్రీ పెయిడ్‌ కార్డులుగా చెప్పొచ్చు. వీటిద్వారా యూపీఐ, ఆన్‌లైన్‌ లావాదేవీలకు చెల్లింపులు చేయొచ్చు. పీపీఐలో ఉన్న డబ్బు మేరకు బ్యాంకు ఖాతాతో సంబంధం లేకుండా ఖర్చు చేయొచ్చు. ఇప్పటివరకూ పీపీఐ అందిస్తున్న సంస్థకు చెందిన యూపీఐ ద్వారానే ఈ చెల్లింపులు చేసేందుకు వీలవుతుంది. ఇక నుంచి ఈ పీపీఐలకు ఏదైనా యూపీఐ అప్లికేషన్‌ను అనుసంధానం చేసి, చెల్లింపులు చేసేందుకు వీలవుతుందన్నమాట. దీనివల్ల పీపీఐ వినియోగదారులకు మరింత సౌలభ్యం రానుంది.
వాలెట్‌, యూపీఐ యాప్‌ వేర్వేరు కంపెనీలకు చెందినవి అయినప్పటికీ, వినియోగదారులు తమ వాలెట్‌లలో దేనినైనా సరే యూపీఐ యాప్‌లతో అనుసంధానం చేయడానికి వీలవుతుంది. చెల్లింపులనూ చేయొచ్చు. దీనర్థం.. పీపీఐ వాలెట్‌ను అందిస్తున్న సంస్థపైనే పూర్తిగా ఆధారపడాల్సిన అవసరం లేదు. వినియోగదారులు తమ వాలెట్‌లో ఉన్న మొత్తాన్ని ఇతర యూపీఐ అప్లికేషన్‌లతోనూ ఉపయోగించుకోవచ్చన్నమాట. ఉదాహరణకు ఫోన్‌పే వాలెట్‌లో మీరు కొంత మొత్తం వేశారనుకుందాం. ఇప్పుటివరకూ ఆ సంస్థ యూపీఐని వాడినప్పుడే ఈ మొత్తాన్ని చెల్లింపుల కోసం వాడుకునే వీలుంటుంది. ఇప్పుడు ఇతర యూపీఐ యాప్‌లు వాడి, ఫోన్‌పే వాలెట్‌లోని డబ్బుతో చెల్లింపులు చేయొచ్చు. దీనివల్ల వినియోగదారులకు డిజిటల్‌ చెల్లింపుల విషయంలో కొత్త వెసులుబాటు లభించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని