దీర్ఘకాలంలో అధిక రాబడి

బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ‘బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ మల్టీ అస్సెట్‌ అలకేషన్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 27వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది.

Published : 17 May 2024 00:31 IST

జాజ్‌ ఫిన్‌సర్వ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ‘బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ మల్టీ అస్సెట్‌ అలకేషన్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 27వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.500 పెట్టుబడి పెడితే సరిపోతుంది. అన్ని రకాలైన ఆస్తుల్లో పెట్టుబడి అవకాశాలను గుర్తించి అధిక ప్రతిఫలాన్ని ఇచ్చే ఆస్తులపై పెట్టుబడి పెట్టటం దీని లక్ష్యం. ఈక్విటీతో పాటు రుణ పత్రాలు, రీట్‌, ఇన్విట్‌లు, బంగారం ఈటీఎఫ్‌, వెండి ఈటీఎఫ్‌... తదితర ఆస్తులను పెట్టుబడి కోసం పరిగణనలోకి తీసుకుంటారు. పెట్టుబడుల్లో వైవిధ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తక్కువ నష్టభయంతో దీర్ఘకాలంలో మెరుగైన ప్రతిఫలాన్ని సాధించే అవకాశం ఉంటుంది.


ప్రత్యేక సందర్భాల్లో

కొన్ని సందర్భాలను, ప్రత్యేక అవకాశాలను గుర్తించి పెట్టుబడి పెట్టటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో శ్యాంకో మ్యూచువల్‌ ఫండ్‌ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. శ్యాంకో స్పెషల్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌ పేరుతో వచ్చిన ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 31 వరకూ అందుబాటులో ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.5,000. నిఫ్టీ 500 టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. కంపెనీల విలీనం, విభజన, కంపెనీల కొనుగోళ్లు- అమ్మకాలు...తక్కువ మార్కెట్‌ విలువ గల హోల్డింగ్‌ కంపెనీలు, టెక్నాలజీతో అనూహ్యమైన మార్పులు తీసుకువచ్చే కంపెనీలు... తదితర ప్రత్యేకతలు/సందర్భాలను గుర్తించి లాభదాయకమైన రీతిలో పెట్టుబడులు పెట్టటం ఈ పథకం వ్యూహం. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. కేవలం కొన్ని రంగాలకు లేదా కొన్ని విభాగాలకు చెందిన కంపెనీలపైనే పెట్టుబడి పెట్టకుండా వృద్ధి ప్రాతిపదికగా ఎంచుకోవటం ఇలాంటి పథకాల ప్రధానోద్దేశం. కొంత నష్టభయం భరించగల మదుపరులు వీటిని పరిశీలించవచ్చు.


బ్యాంకుల్లో మదుపు

డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఒక ఇండెక్స్‌ పథకం అందుబాటులోకి వచ్చింది. ‘డీఎస్‌పీ నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ పథకం నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌లో ఉన్న కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 27న ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.100. బ్యాంక్‌ నిఫ్టీ గత నాలుగేళ్లలో నిఫ్టీ 50 కంటే మెరుగైన పనితీరు ప్రదర్శించింది. కానీ ఇటీవలి కాలంలో బ్యాంక్‌ నిఫ్టీ స్తబ్దుగా ఉంది. ఈ తరుణంలో దీనిపై పెట్టుబడి పెట్టటం ద్వారా దీర్ఘకాలంలో మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకొని ఈ కొత్త పథకాన్ని డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు