ప్రత్యేక ఎఫ్‌డీల్లో జమ చేస్తారా?

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేసే వారిని ఆకర్షించేందుకు ప్రముఖ బ్యాంకులు ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇందులో కొన్ని పథకాల గడువు జూన్‌ 30తో ముగియనుంది. వీటి గురించి తెలుసుకుందాం.

Updated : 07 Jun 2024 00:47 IST

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేసే వారిని ఆకర్షించేందుకు ప్రముఖ బ్యాంకులు ప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇందులో కొన్ని పథకాల గడువు జూన్‌ 30తో ముగియనుంది. వీటి గురించి తెలుసుకుందాం.

ఐడీబీఐ బ్యాంక్‌: ఈ బ్యాంకు అందిస్తున్న ప్రత్యేక పథకం పేరు ఉత్సవ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌. ఇందులో 300 రోజుల వ్యవధికి సాధారణ ప్రజలకు 7.05 శాతం, 375 రోజుల వ్యవధి డిపాజిట్లకు 7.1 శాతం, 444 రోజుల వ్యవధి డిపాజిట్లపై 7.2 శాతం వడ్డీని ఇస్తోంది. 60 ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్లకు అర శాతం వడ్డీ అధికంగా చెల్లిస్తోంది. 
ఇండియన్‌ బ్యాంక్‌: ఇండ్‌ సుప్రీం పేరుతో ఈ బ్యాంకు అందిస్తోన్న 300 రోజుల వ్యవధి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 7.05 శాతం వడ్డీ అందుతుంది. సీనియర్‌ సిటిజన్లకు 7.55 శాతం, సూపర్‌ సీనియర్‌ (80 ఏళ్లు దాటిన వారికి) సిటిజన్లకు 7.80 శాతం వడ్డీనిస్తోంది. 400 రోజుల వ్యవధి డిపాజిట్‌పై సాధారణ ప్రజలకు 7.25 శాతం, సీనియర్లకు 7.75, సూపర్‌ సీనియర్లకు 8 శాతం చొప్పున వడ్డీనిస్తోంది.
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: అమృత్‌ కలశ్‌ పేరుతో అందిస్తున్న ఈ పథకం ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకూ అందుబాటులో ఉంటుంది. 400 రోజుల వ్యవధితో ఉన్న ఈ పథకం 7.10 శాతం వడ్డీని చెల్లిస్తుంది. సీనియర్లకు 7.60 శాతం వడ్డీనిస్తోంది. ఇప్పటికే ఈ పథకం గడువును బ్యాంకు పలుమార్లు పొడిగించింది.


అన్ని రకాల షేర్లలో..

మోతీలాల్‌ ఓస్వాల్‌ మల్టీ క్యాప్‌ ఫండ్‌ అనే పథకాన్ని మోతీలాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 11 వరకూ అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాలి. నిఫ్టీ 500 మల్టీ క్యాప్‌ 50-25-25 ఇండెక్స్‌ టీఆర్‌ఐ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ఈ పథకం కింద సమీకరించిన నిధులను కనీసం 25 శాతం చొప్పున లార్జ్, మిడ్, స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందిన షేర్లపై మదుపు చేయాల్సి ఉంటుంది. ఈ మూడు తరగతులకు చెందిన దాదాపు 35 షేర్లతో పోర్ట్‌ఫోలియోను రూపొందించే అవకాశం ఉంది. ప్రధానంగా ‘ఫోకస్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ విధానాన్ని అనుసరిస్తారు.
 ఏదో ఒక తరగతికి చెందిన షేర్లకే పెట్టుబడిని పరిమితం చేయకుండా, మూడు ప్రధాన విభాగాల్లో పెట్టుబడులు ఉండాలని ఆశించే మదుపరులకు మల్టీ క్యాప్‌ పథకాలు     అనువుగా ఉంటాయి.  


తయారీ రంగంలో...

మహీంద్రా మనులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి పెట్టడం ద్వారా లాభాలు ఆర్జించే లక్ష్యంతో ఒక కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. మహీంద్రా మనులైఫ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 14 తేదీ వరకూ ఉంటుంది. కనీస పెట్టుబడి రూ.1,000. ఏటేటా అధిక ఆర్థికాభివృద్ధిని నమోదు చేస్తూ ముందుకు సాగుతున్న మనదేశంలో ఉత్పత్తి రంగం పాత్ర క్రమేణా పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ రంగానికి చెందిన కంపెనీలు అధిక ఆదాయాలు, లాభాలు ఆర్జించే అవకాశం ఏర్పడింది. ఈ తరహా కంపెనీలపై పెట్టుబడి లాభదాయకంగా ఉంటుందని అంచనా. అందువల్ల ఉత్పత్తి రంగానికి ప్రత్యేకించిన పథకాన్ని మహీంద్రా మనులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకువచ్చినట్లు స్పష్టమవుతోంది. ఉత్పత్తి రంగం వృద్ధిపై మదుపరులకు విశ్వాసం ఉంటే ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని