Renovation Loan: ఇంటి పునరుద్ధరణ కోసం రుణం... ఎలా తీసుకోవచ్చంటే?

ఇప్పటికే ఉన్న ఇంటిని ఆధునీకరించడానికి, పునరుద్ధరించడానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి, ఈ రుణాలకు సంబంధించిన నియమ నిబంధనలు ఇక్కడ తెలుసుకోండి.

Published : 21 Sep 2023 19:31 IST

సొంత ఇల్లు కలను సాకారం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. అయితే ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అందులో నివసించే వారికి అవసరాలు పెరుగుతాయి. ఇందుకుగాను అదే ఇంటిలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటారు. దీనికి యజమానులకు ఖర్చవుతుంది. దీని కోసం బ్యాంకుల నుంచి పునరుద్ధరణ రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు, నాన్‌ - బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)లు, హౌసింగ్‌ ఫైనాన్స్ కంపెనీ (హెచ్‌ఎఫ్‌సీ)లు తమ సాధారణ ఇంటి రుణాలలో భాగంగా ఇంటి పునరుద్ధరణ రుణాలను అందిస్తున్నాయి.

మార్పులు, ఉపయోగాలు

వంట గది, బాత్రూమ్‌ రీమోడలింగ్‌, కొత్త గది నిర్మాణం లాంటివి చేయొచ్చు. మెరుగైన లైటింగ్‌ కోసం వెంటిలేషన్‌లో మార్పులు చేయొచ్చు. ప్లంబింగ్‌ లేదా ఎలక్ట్రికల్‌ సిస్టమ్‌లను ఆధునీకరించొచ్చు. భవిష్యత్తులో ఇంటిని విక్రయించాలనుకుంటే, ఈ పునరుద్ధరణ వల్ల ఇంటి ఆకర్షణ పెరిగి, విలువ పెరుగుతుంది. ఇంటిని పునరుద్ధరించడం మీ జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, ఇంటి విలువను పెంచడానికి గొప్ప మార్గం.

జాగ్రత్తలు

ఇంటి పునరుద్ధరణ రుణాన్ని ఎంచుకునే సమయంలో వడ్డీ రేట్లు, రీపేమెంట్‌ నిబంధనలు, రుణంతో ముడిపడి ఉన్న రుసుములతో సహా రుణానికి సంబంధించిన నిబంధనలు, షరతులను పరిశీలించాలి. కొత్త ఇంటిని నిర్మించేటప్పుడు ఎంత అవుతుంది అనేది స్పష్టంగా తెలిసినా, ఇంటి పునరుద్ధరణ విషయంలో వ్యయాలు అంతుచిక్కకుండా ఉంటాయి. కాబట్టి, ఇంటి యజమానులు పునరుద్ధరణ ప్రాజెక్ట్‌కు సంబంధించి మొత్తం వ్యయం, ఎంత డబ్బు అవసరమో అవగాహన కలిగి ఉండాలి.

రుణ ఎంపిక

ఇంటి పునరుద్ధరణ కోసం... వ్యక్తిగత రుణాలు, పునరుద్ధరణ రుణం, టాప్‌ - అప్‌ రుణాలు వంటి ఆప్షన్లు ఉన్నాయి. వ్యక్తిగత రుణాలను ఎలాంటి అవసరానికైనా ఉపయోగించవచ్చు, కానీ వడ్డీ ఎక్కువ. ఇంటి పునరుద్ధరణ రుణం సాధారణంగా హోమ్‌ లోన్‌ తరహా వడ్డీ రేట్లలో అందుబాటులో ఉంటుంది.

రుణం

ఇంటి పునరుద్ధరణ కోసం రూ.25 వేల నుంచి రూ.50 లక్షల వరకు రుణం పొందవచ్చు. రుణ సంస్థలు, పునరుద్ధరణ వ్యయంలో 70% - 90% వరకు అందిస్తాయి. బ్యాంకుకు సంబంధించిన నియమ నిబంధనలు, రుణ గ్రహీత క్రెడిట్‌ యోగ్యతను బట్టి రుణం అందుతుంది. రుణం అందచేసేటప్పుడు మొత్తం ఇంటి (ఆస్తి) విలువను బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటాయి. రుణగ్రహీతలు లోన్‌ తీసుకునే ముందు వివిధ బ్యాంకుల నుంచి రుణ ఆఫర్లను సరిపోల్చుకోవాలి.

క్రెడిట్‌ స్కోరు

రుణాలకు క్రెడిట్‌ స్కోరు చాలా ముఖ్యం. 700 అంతకంటే ఎక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వ్యక్తులను బ్యాంకులు విశ్వసనీయ రుణగ్రహీతలుగా పరిగణిస్తాయి. కానీ, క్రెడిట్‌ స్కోరు 600, ఇంతకంటే తక్కువ ఉన్నవారు కూడా ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకుతో ఉన్న సంబంధాన్ని బట్టి రుణ ఆమోదం ఉంటుంది.

వడ్డీ రేట్లు

సాధారణంగా, బ్యాంకులు హోమ్ లోన్ ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లతో సమానంగా పునరుద్ధరణ రుణాలపై వడ్డీని వసూలు చేస్తున్నాయి. అయితే, రుణ దరఖాస్తుదారుడి క్రెడిట్‌ స్కోరు, రుణ మొత్తం, అతడు చేసే వృత్తి (ప్రోఫైల్‌)తో సహా అనేక అంశాలపై వడ్డీ రేట్లు ఆధారపడి ఉంటాయి. బ్యాంకును బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. ఈ వడ్డీ రేట్లు సాధారణంగా 7% - 9% వరకు ఉంటాయి. మహిళలు ఇంటి యజమాలుగా లేదా ఉమ్మడి యజమానులు అయితే చాలా బ్యాంకులు 0.05% నుంచి 0.10% వరకు రాయితీ అందిస్తాయి.

రుణ చెల్లింపులు, మారటోరియం

రుణగ్రహీతలు రుణాన్ని తిరిగి చెల్లించే కాలవ్యవధిని 5 - 20 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. ఈ రుణాలు 3 - 6 నెలల మధ్య మారటోరియం వ్యవధితో లభిస్తాయి.

ప్రాసెసింగ్‌, ప్రీ-క్లోజర్‌ ఛార్జీలు

ఈ రుణాలపై బ్యాంకులు ప్రాసెసింగ్‌ ఫీజును (రుణ మొత్తంపై) 0.25% నుంచి 3% వరకు వసూలు చేస్తాయి. కానీ, కొన్ని బ్యాంకులు ప్రభుత్వ రంగంలో పనిచేసే రుణగ్రహీతలకు ఈ రుసుమును మాఫీ చేశాయి. ఫ్లోటింగ్‌ వడ్డీపై ప్రీ - క్లోజర్‌ ఛార్జీ ఉండదు.

అర్హతలు

ఈ రుణాన్ని పొందడానికి తప్పనిసరిగా భారతదేశ నివాసి అయి ఉండాలి, కనీస వయసు 21 సంవత్సరాలు. మెరుగైన క్రెడిట్‌ స్కోరుతో పాటు ఆదాయం, ఉపాధికి సంబంధించిన రుజువును అందించాల్సి ఉంటుంది. ఇంటి మరమ్మత్తు కొటేషన్‌, ఆస్తి యాజమాన్య రుజువులను రుణ సంస్థలకు అందించాల్సి ఉంటుంది. మీరు ఎంచుకునే లోన్‌ రకాన్ని బట్టి రుణ అర్హత ప్రమాణాలు మారుతూ ఉంటాయి.

సెక్యూరిటీ, హామీ

ఇంటి పునరుద్ధరణ రుణాలకు పూచీకత్తు అవసరం లేదు. అయితే, ఎక్కువ మొత్తంలో రుణం తీసుకున్న రుణగ్రహీతలను బ్యాంకులు హామీగా ఏదైనా సెక్యూరిటీని అడగొచ్చు. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పత్రాలు, ఎల్‌ఐసీ, కిసాన్‌ వికాస్‌ పత్రాలు, మ్యూచువల్‌ ఫండ్‌లకు సంబంధించిన పత్రాలను సెక్యూరిటీగా తాకట్టు పెట్టవచ్చు. హామీ ఉన్నప్పుడు తక్కువ వడ్డీ రేట్లకు రుణం లభించే అవకాశం ఉంది.

పన్ను ప్రయోజనాలు

ఈ రుణం తీసుకున్నవారు సెక్షన్‌ 24(బీ) ప్రకారం ఆర్థిక సంవత్సరానికి రూ.30,000 వరకు తిరిగి చెల్లించిన వడ్డీని పన్ను మినహాయింపు పొందొచ్చు. మొత్తంగా, ఇంటి కొనుగోలు/పునరుద్ధరణ రుణాలపై వడ్డీ చెల్లింపులు కలిపి రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేయొచ్చు. రూ.30,000 వడ్డీపై సంవత్సరానికి రూ.10,300 వరకు పన్ను ఆదా అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని