గోల్డెన్‌ ఇయర్స్‌ ఎఫ్‌డీ గడువు పొడిగించిన ఐసీఐసీఐ

ప్రముఖ ప్రైవేట్‌ రంగ బ్యాంకు ఐసీఐసీఐ..సీనియర్‌ సిటిజన్స్‌కు ఉద్దేశించిన గోల్డెన్‌ ఇయర్స్‌ ఎఫ్‌డీ గడువును పొడిగించింది.

Published : 08 Apr 2023 17:34 IST

దిల్లీ: సీనియర్‌ సిటిజన్స్‌ కోసం ఉద్దేశించిన గోల్డెన్‌ ఇయర్స్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం గడువును ఐసీఐసీఐ పొడిగించింది. ఈ పథకంలో డిపాజిట్‌ చేసే గడువును 2023 అక్టోబర్‌ 31 వరకు పెంచుతున్నట్లు తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ స్కీమ్‌లో డిపాజిట్‌ చేసే గడువు ఈ నెల 7వ తేదీన ముగిసిన నేపథ్యంలో గడువు పొడిగింపు నిర్ణయం తీసుకుంది. సీనియర్‌ సిటిజన్లు 5 సంవత్సరాల ఒక రోజు నుంచి 10 సంవత్సరాల కాలపరిమితి వరకు ఐసీఐసీఐ బ్యాంకు ‘గోల్డెన్‌ ఇయర్స్‌ ఎఫ్‌డీ’పై 7.50% వడ్డీ రేటును అందుకుంటారు. సాధారణంగా సీనియర్‌ సిటిజన్లు అన్ని బ్యాంకుల్లానే ఐసీఐసీఐ బ్యాంకులో కూడా 0.50% వడ్డీ రేటును అదనంగా పొందుతారు. కానీ, ఈ ‘గోల్డెన్‌ ఇయర్‌ ఎఫ్‌డీ’పై 0.10% వడ్డీని అదనంగా పొందుతారు.

రెన్యువల్‌ డిపాజిట్లపై కూడా ఈ రేటు అందుబాటులో ఉంటుంది. రూ.2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా తెరిచిన సింగిల్‌ ఎఫ్‌డీకి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ ఎఫ్‌డీని గడువు తేదీలోపు ఉపసంహరించుకుంటే బ్యాంకు 1% జరిమానా విధిస్తుంది. వినియోగదార్లు బ్యాంకు ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి లేదా బ్రాంచ్‌ను సంప్రదించి ఎఫ్‌డీ తెరవొచ్చు. మరోవైపు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సీనియర్‌ సిటిజన్ల ప్రత్యేక టర్మ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘ఎస్‌బీఐ వియ్‌కేర్‌ ఎఫ్‌డీ’ పథకాన్ని తెరవడానికి గడువును 2023, జూన్‌ 30 వరకు పొడిగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని