Car Loans: సెకండ్‌ హ్యాండ్‌ కార్ల రుణాలపై బ్యాంకుల వడ్డీ రేట్లు ఎంతెంత?

కొంత కాలం నుంచి సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కొనుగోళ్లు బాగా పెరిగాయి, వీటి కొనుగోళ్లపై బ్యాంకులు కూడా వేగంగా రుణాలిస్తున్నాయి. ఈ రుణాలపై వివిధ బ్యాంకులు ఎంతెంత వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయో ఇక్కడ చూడండి.

Published : 24 Jul 2023 14:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వ్యక్తిగత రవాణాకు మునుపటితో పోలిస్తే ప్రాధాన్యం పెరిగింది. దీంతో కార్ల వినియోగమూ పెరిగింది. కొత్త కారు కోనుగోలు చేయలేనివారు పాత (సెకండ్‌ హ్యాండ్‌) కార్లను కొనేవారి సంఖ్య బాగా పెరిగింది. దీనికంటూ గణనీయమైన మార్కెట్‌ ఏర్పడడంతో రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు, ఎన్‌బీఎస్‌సీలు బాగానే ఆసక్తి చూపుతున్నాయి. తగినంత నగదు చేతిలో లేనివారు..కొత్త కారుకు బదులు, పాత కారుని బ్యాంకు రుణాలతో సులభంగా పొందొచ్చు. కొన్ని బ్యాంకులు ఈ రుణం తీర్చడానికి 7 ఏళ్ల కాలవ్యవధిని ఇవ్వడమే గాక, కారు విలువలో 80% వరకు రుణాన్ని అందిస్తున్నాయి.

అనుకూలతలు

రెండేళ్ల పాత వాహనం కొత్త దానికంటే 20-30% చౌకగా ఉంటుంది. చాలా కార్ల కంపెనీలు Pre-owned విభాగాలను కలిగి ఉన్నాయి. తగిన అర్హతలు ఉన్నవారికి రుణం ఇవ్వడానికి కొన్ని బ్యాంకుల ప్రతినిధులు అక్కడే అందుబాటులో ఉంటారు. కొన్ని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)లు సెకండ్‌ హ్యాండ్‌ కార్లపై జీరో డౌన్‌ పేమెంట్‌ వంటి లాభదాయకమైన రేట్లు, డీల్‌లను అందిస్తున్నాయి. కొత్త కారు రుణంతో పోలిస్తే.. పాత కారు రుణం తక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి, ఈఎంఐ కూడా తక్కువే. రుణం కోసం దరఖాస్తు చేయడం సులభమే, ఆన్‌లైన్‌లో ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. కారు విలువ తక్కువ కాబట్టి బీమా కూడా తక్కువే ఉంటుంది.

ప్రతికూలతలు

కొత్త కారు రుణంతో పోలిస్తే.. పాత కారు రుణానికి బ్యాంకులు విధించే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కోసం కనీస వడ్డీ రేటు 9.25% నుంచి ప్రారంభమైతే.. కొన్ని బ్యాంకులు సంవత్సరానికి 16.30% వడ్డీని సైతం విధిస్తున్నాయి. ఇదే కొత్త కారుకు అయితే, వడ్డీ రేట్లు 8.6 శాతంతో ప్రారంభమవుతాయి. పాత వాహనం విలువలో 60-85% వరకు మాత్రమే రుణంగా లభిస్తుంది. ఇదే కొత్త కారు విషయంలో అయితే 85-100% రుణం లభిస్తుంది. ఉపయోగించిన కారుకు తరుగుదల ఎక్కువే ఉంటుంది కాబట్టి, రుణం ఇచ్చే విషయంలో బ్యాంకులు తగిన ప్రమాణాలు చూస్తాయి. కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకులు 3 సంవత్సరాలు కన్నా ఎక్కువ వయసున్న కారుకు రుణాన్ని అందించవు. రుణ మొత్తంలో బీమా కవరేజీ ఉండదు. బీమా వేరేగా తీసుకోవాలి.

రుణ అర్హతలు

ఈ కారు రుణాలకు.. ఉద్యోగాలు చేసేవారికి, స్వయం ఉపాధి పొందేవారికి అర్హత ప్రమాణాలు మారుతూ ఉంటాయి. ఉద్యోగం చేసేవారికి వయో పరిమితి 21-65 సంవత్సరాలు. కనీస ఆదాయం నెలకు రూ.15 వేలు ఉండాలి. ప్రస్తుత సంస్థలో కనీసం ఒక సంవత్సరం పాటు పని చేస్తూ ఉండాలి. స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు వయోపరిమితి 25-65 సంవత్సరాలు. ఏడాదిలో తన వృత్తి ద్వారా కనీసం రూ.1.5 లక్షల లాభం పొందాలి. 3 సంవత్సరాల పాటు ఒకే రకమైన వ్యాపారంలో ఉండాలి. ఈ క్రమంలో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కొనుగోలుపై బ్యాంకులు విధించే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్‌ ఫీజులు, రుణ కాలవ్యవధిని కింది పట్టికలో పొందుపరిచాం. ఆ వివరాలు ఇవే..

నోట్‌: ఈ డేటా 2023 జులై 19 నాటిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని