Home Loans: గృహ రుణానికి సహ-దరఖాస్తుదారునితో వెళ్లడం మంచిదేనా?

గృహ రుణాన్ని ఒకరి పేరుమీదే కాకుండా ఉమ్మడిగా కూడా తీసుకోవచ్చు. సహ-దరఖాస్తుదారుకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

Updated : 03 Nov 2022 16:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంత నివాసాన్ని కొనుగోలు చేయాలనుకున్నా.. నిర్మించాలనుకున్నా భారీ మొత్తమే అవసరం పడుతుంది. ఎవరైనా తమ జీవితంలో ఎక్కువ పెట్టుబడి పెట్టేది ఇంటి మీదే. ఈ భారీ పెట్టుబడికి రుణం తీసుకోవడం తప్పనిసరి. ఎక్కువ మంది బ్యాంకు రుణాల ద్వారా ఇంటి కొనుగోలుకు ప్రయత్నిస్తుంటారు. బ్యాంకులు కూడా రుణగ్రహీత ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఈ రుణాలను విరివిగానే మంజూరు చేస్తున్నాయి. అయితే, ఈ రుణం పొందడానికి వ్యక్తి ఆర్థిక సామర్థ్యం సరిపోతుందా అంటే చాలా కష్టమనే చెప్పొచ్చు. ఇళ్ల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. అందువల్ల గృహ-రుణానికి సహ-దరఖాస్తుదారుతో (జాయింట్‌గా) వెళ్లడం మంచిది.

రుణ అర్హత

గృహ రుణ దరఖాస్తులను పరిశీలించేటప్పుడు బ్యాంకులు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. వాటిలో ప్రధానమైనవి.. రుణగ్రహీత ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, క్రెడిట్‌ ప్రొఫైల్‌, గృహ రుణ ఈఎంఐలు గడువులో చెల్లించే స్థోమత, మొదలైనవి. ఇటువంటి సందర్భాల్లో మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్న, అలాగే సంపాదిస్తున్న కుటుంబ సభ్యుడిని సహ-దరఖాస్తుదారుగా చేర్చడం వల్ల రుణ అర్హత పెరుగుతుంది. తగిన సౌకర్యాలు ఉన్న నివాసాన్ని కొనుగోలు చేయొచ్చు. భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ఈఎంఐలు చెల్లించడం కూడా తేలిక.

రుణ గ్రహీతల వయసు

కొంత మంది రుణగ్రహీతలు 65 సంవత్సరాల వయసులోపు రుణాన్ని తిరిగి చెల్లించవలసి ఉంటుంది. దరఖాస్తు సమయంలో 60 ఏళ్లకు చేరుకునే రుణ దరఖాస్తుదారులు వయసు రీత్యా తిరస్కరణకు గురవుతారు. లేదా తక్కువ కాలపరిమితి ఎంచుకోమని బ్యాంకులు చెబుతాయి. యువ సహ-దరఖాస్తుదారుని చేర్చుకోవడం వల్ల అటువంటి రుణగ్రహీతలు ఎక్కువ కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. పెద్ద వయసుదారుకి దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే.. యువ సహ-దరఖాస్తుదారుడు రుణానికి బాధ్యత వహిస్తారు.

సహ-దరఖాస్తుకు అర్హత

గృహ రుణ అర్హతను పొందే ఆదాయమున్న ఇద్దరు లేదా గరిష్ఠంగా ఆరుగురు వరకు కుటుంబ సభ్యులు భాగస్వామ్య బాధ్యతతో ఉమ్మడి గృహ రుణాన్ని పొందేందుకు బ్యాంకులు అనుమతిస్తున్నాయి. సాధారణంగా జీవిత భాగస్వామి లేదా ప్రాథమిక దరఖాస్తుదారుని కుటుంబ సభ్యులను సహ-దరఖాస్తుదారుగా బ్యాంకులు పరిగణిస్తాయి. అయితే, కొన్ని బ్యాంకులు.. తోబుట్టువులు, అవివాహత భాగస్వాములను ఆమోదించవు.

ఆదాయ పన్ను ప్రయోజనాలు

గృహ రుణం తిరిగి చెల్లింపునకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది. ఆస్తికి స‌హ‌-య‌జ‌మాని అయిన ప్రతి స‌హ‌-రుణ‌గ్రహీతకు, ఒక ఆర్థిక సంవత్సరంలో గృహ రుణ వ‌డ్డీ చెల్లింపుపై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్షన్‌ 24బి కింద రూ. 2 లక్షల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ప్రయోజనం ఉంటుంది. అదే విధంగా, ప్రతి ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు అసలు చెల్లింపుపై సెక్షన్‌ 80సి కింద పన్ను మినహాయింపునకు అర్హత ఉంటుంది. దరఖాస్తుదారు, సహ-దరఖాస్తుదారులు ఇద్దరూ రుణ చెల్లింపులో వారి వాటా ప్రకారం స్వతంత్రంగా ఈ పన్ను ప్రయోజనాలను పొందొచ్చు.

మహిళలు

సహ-దరఖాస్తుదారు మహిళ అయితే గృహ రుణ వడ్డీ రేట్లలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రాయితీలు ఇస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ కలిపి ఒకే ఇంటికి రుణం తీసుకోవడం ఇప్పుడు సాధారణం.

సహ-దరఖాస్తులో ప్రతికూలతలూ ఉన్నాయ్‌

రుణం చెల్లింపు బాధ్యత

గృహ రుణాలలో ప్రాథమిక దరఖాస్తుదారుడు, సహ-దరఖాస్తుదారులు రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించే బాధ్యతను కలిగి ఉంటారు. రుణం చెల్లింపునకు వీరిలో ఒక్కరు సరైన బాధ్యత వహించకపోయినా, ఈఎంఐలు ఆలస్యం చేసినా.. క్రెడిట్‌ రిపోర్ట్‌లో బ్యాంకులు డిఫాల్ట్‌గా నమోదు చేస్తాయి. కాబట్టి, ఒకరి వల్ల అందరి క్రెడిట్‌ స్కోరూ ప్రతికూలకంగా మారుతుంది.

విభేదాలు

కుటుంబ సభ్యులైనా కూడా దరఖాస్తుదారుల మధ్య ఏవైనా విభేదాలు, సమస్యలు తలెత్తితే రుణాన్ని తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. భార్యాభర్తల ఉమ్మడి రుణం అయితే, విడాకులు లాంటి సమస్యలున్నప్పుడు, జీవిత భాగస్వామి మరణించినప్పుడు ఈ ఉమ్మడి ఆస్తి, రుణ చెల్లింపులు గందరగోళానికి గురవుతాయి. చెల్లించని బకాయిలను తిరిగి పొందడానికి ఇంటిని బ్యాంకు తన స్వాధీనంలోకి తీసుకోవచ్చు.

బీమా తప్పనిసరి

ఉమ్మడి గృహ రుణ దరఖాస్తుదారులున్నప్పుడు రుణంపై బీమా కవర్‌ ఉంటే మంచిది. రుణగ్రహీతలలో ఎవరు మరణించినా బీమా సొమ్ము ద్వారా రుణ చెల్లింపునకు మార్గం ఏర్పడుతుంది. మిగతా రుణగ్రహీతలపై ఒత్తిడి తగ్గుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని