Loan Against Car: కారు తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చా?

ఆర్థిక అత్యవసరాల్లో మీ కారును హామీగా ఉంచి రుణం తీసుకోవచ్చు.

Published : 29 Nov 2022 13:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక అత్యవసరాలు ఎప్పుడైనా రావచ్చు. అత్యవసరంగా డబ్బు కావాల్సినప్పుడు మన వద్ద బంగారం ఉన్నా లేక మరేదైనా ఆస్తి ఉన్నా.. దాన్ని బ్యాంకులో తనఖా ఉంచి రుణం తీసుకోవచ్చు. ఇది దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. మరి కారును తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చా? బ్యాంకులు రుణం ఇస్తాయా?

ఎలా పనిచేస్తుంది?

కారు తరుగుదల ఆస్తి. కాలం గడిచేకొద్దీ దాని విలువ తగ్గుతుంది. అందువల్ల కారుపై రుణం లభిస్తుందా అనేది చాలామందికి సందేహామే. అయితే, ఆర్థిక అత్యవసరాల్లో కారుపై కూడా రుణం పొందొచ్చు. ఇది సురక్షిత రుణం. బ్యాంకులు ముందుగా మీ వాహన విలువను అంచనా వేస్తాయి. దొంగిలించిన, ప్రభుత్వ అనుమతులు లేని వాహనాలను పరిగణనలోకి తీసుకోరు. తయారీ నిలిపివేసిన కార్లు/కార్‌ మోడళ్ల రుణ దరఖాస్తులను తిరస్కరిస్తారు. అలాగే,10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలం ఉన్న వాహనాలకు రుణం లభించకపోవచ్చు. అన్ని సరిగ్గా ఉంటే.. ఎలాంటి అవాంతరాలూ లేకుండా కారు తాకట్టు రుణం మంజూరవుతుంది.

ఎంత రుణం తీసుకోవచ్చు?

దరఖాస్తుదారుని ఆదాయం, ఇప్పటికే ఉన్న రుణాలు, క్రెడిట్‌ చరిత్ర, కారు విలువ వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రుణ మొత్తాన్ని నిర్ణయిస్తారు. కొన్ని బ్యాంకులు కారు విలువలో 50% వరకు రుణం ఆఫర్‌ చేస్తుంటే.. మరికొన్ని 150% వరకు కూడా రుణం ఇస్తున్నాయి. రుణ కాలవ్యవధి 12 నెలల నుంచి 84 నెలల వరకు (ఏడాది నుంచి ఏడేళ్ల వరకు) ఉంటుంది. 1-3% వరకు ప్రాసెసింగ్‌ ఫీజు ఉండొచ్చు.

రుణం దేనికోసం ఉపయోగించవచ్చు?

వ్యక్తిగత రుణాల మాదిరిగానే.. ఈ రుణాలు మీ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఎందుకోసం అనేది బ్యాంకు లేదా ఆర్థిక సంస్థకు వివరించాల్సిన అవసరం లేదు. పిల్లల చదువులు, వివాహం, వైద్యం, ఇతర అవసరాలకు నిధులు వినియోగించుకోవచ్చు. 

దరఖాస్తు..

అన్ని బ్యాంకులూ ఈ రకమైన రుణాలను అందించకపోవచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్‌ బ్యాంక్‌ వంటి కొన్ని బ్యాంకులు ఈ రకమైన రుణాలను అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ దరఖస్తు చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. మీకు ఇప్పటికే జీతం ఖాతా ఉన్న లేదా మంచి సంబంధాలు ఉన్న బ్యాంకులో దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఎందుకంటే మీ పాత రికార్డులు వారి దగ్గర ఉంటాయి. కాబట్టి రుణం సులువుగా లభిస్తుంది. రుణ సంబంధ వడ్డీ రేట్లను తెలుసుకుని.. అనుకూలమైన వడ్డీ రేటుతో అందించే బ్యాంకులు ఎంచుకోవడం మంచిది.

వాల్యుయేషన్‌..

ఈ రకమైన రుణాన్ని ఆమోదించే ముందు రుణదాతలు కారు విలువను లెక్కిస్తారు. ధ్రువీకరణ ప్రక్రియ జరుగుతుంది. ముందస్తు ఆమోదించిన రుణం విషయంలోనూ రుణం ఖాతాకు జమ చేసే ముందే ప్రాథమిక వాల్యుయేషన్‌ చేస్తారు.

కావాల్సిన పత్రాలు..

  • ఫోటో ఐడీ ఫ్రూఫ్‌ (ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్‌)
  • ఆదాయం రుజువులు (ఫారం-16 లేదా ఐటీఆర్‌, శాలరీ స్లిప్‌లు, శాలరీ ఖాతా స్టేట్‌మెంట్లు)
  • అడ్రస్‌ ఫ్రూఫ్‌ (టెలిఫోన్‌ బిల్లు, పాస్‌పోర్టు, ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ ఇచ్చిన ఐడీ కార్డు, క్రెడిట్‌ కార్డు స్టేట్‌మెంట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, రేషన్‌ కార్డు)
  • కారు లీగల్‌ డాక్యుమెంట్లు (చెల్లుబాటు అయ్యే మెటారు బీమా పాలసీ పత్రాలు, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌)

రుణదాత కారును తీసుకుంటారా?

ఈ రకమైన రుణం కింద కారు హామీగా మాత్రమే ఉంటుంది. ఈఎంఐలను సకాలంలో చెల్లించినంత వరకు కారు మీ వద్దే ఉంటుంది. కారును ఉపయోగించుకోవచ్చు. అయితే, రుణ వాయిదాలు చెల్లించడంలో విఫలం అయితే కారు సీజ్‌ చేసే హక్కు బ్యాంకులకు ఉంటుంది. 

చివరిగా..

పాత కార్లకు రీ-ఫైనాన్స్‌ చేసేటప్పుడు బ్యాంకులు ఎక్కువ మొత్తంలో వడ్డీ ఛార్జ్‌ చేయొచ్చు. కాబట్టి, రుణం తీసుకునే ముందు బ్యాంకులు విధించే వడ్డీ, డాక్యుమెంటేషన్‌ ఛార్జీలు, ప్రాసెసింగ్‌ ఫీజులు, ఈఎంఐ చెల్లింపులు ఆసల్యమైతే వర్తించే ఛార్జీలు, చెక్‌ బౌన్స్‌ ఛార్జీలు వంటివి తెలుసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని